తెలంగాణలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన కేబినెట్ ను పరిపూర్ణం చేసుకునే దిశగా చేసిన యత్నాలు ఎట్టకేలకు ఫలించాయనే చెప్పాలి. కేబినెట్ విస్తరణకు ఇంకా ముహూర్తం అయితే ఖరారు కాలేదు గానీ…కేబినెట్ విస్తరణకు అయితే కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తెలుగు సంవత్సరాది ఉగాదికి కాస్త అటూఇటూగా కేబినెట్ విస్తరణ ఖాయమని చెప్పాలి. విస్తరణలో ఎవరి జాతకం ఎలా ఉన్నా… కోమటిరెడ్డి ఫ్యామిలీకి మాత్రం డబుల్ ధమాకా దక్కిందని మాత్రం చెప్పక తప్పదు. ఇప్పటికే రేవంత్ కేబినెట్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనసాగుతుంఃడగా.. తాజాగా ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా కేబినెట్ బెర్త్ ఖరారు అయ్యింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి ఫ్యామిలీ పెద్ద దిక్కుగానే చెప్పాలి. ఈ జిల్లా నుంచి పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఉన్నా… వారిలో జానారెడ్డి లాంటి సీనియర్లు కూడా చాలా మంది ఉన్నా… కోమటిరెడ్డి ఫ్యామిలీకి అంతకంతకూ ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి జిల్లాలో ఈ అన్నాతమ్ముళ్లదే హవా అని చెప్పాలి. ఒకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే…మరొకరు ఎంపీగా పోటీ చేస్తూ వచ్చారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటరెడ్డితో పాటు రాజగోపాల్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగానే పోటీ చేశారు. అన్నాతమ్ముళ్లిద్దరూ విజయం సాధించారు. ఆ తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో కోమటిరెడ్డి ఫ్యామిలీకి మంచి పట్టున్న భువనగిరి నుంచి చాలమ కిరణ్ ను గెలిపిస్తే… రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామంటూ అధిష్ఠానం ఆఫర్ చేసింది.
అధిష్ఠానం నుంచి అందిన ఈ ఒక్క హామీని గట్టిగా పట్టేసుకున్న రాజగోపాల్ రెడ్డి… తనకు మంచి పట్టున్న భువనగిరిని చుట్టేశారు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించారు. ఆ తర్వాత ఎప్పుడెప్పుడు కేబినెట్ విస్తరణ అంటూ ఆయన ఎదురు చూస్తూ వస్తున్నారు. అయితే అప్పటికే వెంకటరెడ్డి కేబినెట్ లో ఉన్న కారణంగా రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కదులే అంటూ చాలా మంది పెదవి విరిచారు.అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం అధిష్ఠానం మాటను గట్టిగా పట్టేసుకుని ఎప్పటికప్పుడు ఆ మాటను అధిష్ఠానం పెద్దల చెవిన వేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా చామల కిరణ్ తోనూ ఆయన అధిష్ఠానానికి తన మంత్రి పదవి గురించి గుర్తు చేస్తూనే ఉన్నారట. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమైపోయిందని చెప్పాలి.