శాసన మండలిలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియడం లేదా? వైసీపీ తరఫున గతంలో మండలిలో చక్రం తిప్పిన నాయకులు.. తర్వాత రాజీనామాలు సమర్పించినా.. వీటిని ఆమోదించాల్సిన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ఇప్పటికీ వాటిని అనుమతించలేదు. దీంతో రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీ లు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికి నలుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. వీరు తమ పదవులను వదులుకుని.. నాలుగు మాసాలు కూడా దాటింది.
అయితే.. వీరు అటు ఇటు ఎటూ కాకుండా పోవడం గమనార్హం. రాజీనామాలు ఆమోదిస్తే.. వేరే పార్టీలోకి వెళ్లి.. అక్కడ నామినేటెడ్ పదవులు అయినా దక్కించుకోవాలని వీరు చూస్తున్నారు. కానీ, చైర్మన్ మాత్రం వీటిపై సంతకాలు చేయడం లేదు. పోనీ.. సభకు వెళ్లాలి.. కాసేపు ఏదో ఒక రకంగా.. సభలో ఉండాలని అనుకుంటే.. అలా కూడా అవకాశం కోల్పోయారు. “మీరు మీ పదవులకు రాజీనామా చేసినందున.. మండలి కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనే అవకాశం లేదు” అని అధికారులు తేల్చి చెబుతున్నారు.
దీంతో ప్రస్తుతం వైసీపీకి రాజీనామాలు చేసిన నలుగురు ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణలు గ్యాలరీలకే పరిమితం అవుతున్నారు. ఇదిలావుంటే.. రాజీనామాలు చేసిన వారికి నిర్ణీత సమయంలోగా.. నిర్ణయం వెలువరించాల్సిన బాధ్యత మండలి చైర్మన్ పై ఉన్నప్పటికీ.. అది ఆయన స్వేచ్ఛకు పరిమితమైన వ్యవహారం. దీంతో ఎవరూ కొశ్చన్ చేయాల్సిన అవకా శం లేకుండా పోయింది.
అయితే.. న్యాయపోరాటం చేయొచ్చు. కానీ, ఆదిశగా అడుగులు వేస్తే.. ఇబ్బంది తప్పదన్నఆలోచనతో వైసీపీ రిజైన్డ్ ఎమ్మెల్సీలు ఉన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు కూడా ఫిల్ అవుతున్నా యి. దీంతో మరింత గందరగోళంలోనే ఉన్నారు. వీరు రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరినా.. తిరిగి వారికి ఆయా స్థానాలు దక్కుతాయా? దక్కవా? అనేది మరో కీలక సందేహంగా మారింది. దీంతో వీరంతా త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.