త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన ఆవిర్భావ వేడుకల సందర్భంగా శుక్రవారం రాత్రి పిఠాపురంలో మాట్లాడిన సందర్భంగా పవన్ పలు అంశాలను ప్రస్తావించారు. అందులో భాగంగా త్రిభాషా సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు వైఖరి సరికాదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. త్రిభాషా సిద్ధాంతం కంటే కూడా బహుభాషా విధానం మరింత ప్రభావవంతమైనదని.. దేశ సమగ్రతకు ఇదో మంచి ఉపకరణమంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడు భగ్గుమంది. అక్కడి డీఎంకే పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. కర్ణాటకకు చెందిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
ఈ క్రమంలో శనివారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఏదైనా ఓ భాషను బలవంతంగా రుద్దడం, అదే సమయంలో ఏదో ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడం… రెండూ తప్పేనని పవన్ ఈ సందేశంలో అభిప్రాయపడ్డారు. ఈ రెండూ దేశ సమగ్రతకు నష్టం కలిగించేవేనని కూడా ఆయన తెలిపారు. తానెప్పుడూ భాషగా హిందీని వ్యతిరేకించలేదన్నారు. అయితే దానిని బలవంతంగా రుద్దడాన్నే తాను వ్యతిరేకించానని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 కూడా ఇదే మాటను చెబుతోందన్న పవన్… దానిపై అసత్య ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఈ తరహా ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు.
జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం తమ మాతృభాషతో పాటుగా ఏదైనా రెండు భాషలను విద్యార్థులు ఎంచుకునే వెసులుబాటు ఉందని పవన్ చెప్పారు. అందులో భాగంగా హిందీ వద్దనుకునే వారు… తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, మరాఠీ, సంస్కృతం, గుజరాతీ, అస్సామీ, కశ్మీరీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, సింధీ, బోడో, డోగ్రీ, కొంకణి, మైథిలీ, మీటీ, నేపాలీ, సంతాలీ, ఉర్దూ లేదంటే ఏ భారతీయ భాషను అయినా ఎంచుకోవచ్చన్నారు. ఇందులో ఏ ఒక్కరిపైనా ఒత్తిడి ఉండబోదని ఆయన తెలిపారు.
బహుభాషా విధానం పిల్లల మనోవికాసం కోసమే ఉద్దేశించబడిందని… దేశ సమగ్రత, దేశ భిన్న భాషా సంస్కృతిని పెంపొందించేందుకే ఈ విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. అయితే తానేదో దీనిపై తన సొంత భావాన్ని చెబుతున్నట్లుగా కొందరు తమ రాజకీయ అజెండాలను తనపై రుద్దుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రతి బారతీయుడికి తనకు ఇష్టమైన భాషలో విద్యనభ్యసించే స్వాతంత్య్రం ఉందన్న మాటను జనసేన బలంగా విశ్వసిస్తోందని కూడా ఆయన పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఇంత వివరణ ఇచ్చాక అయినా ఈ వివాదానికి తెర పడుతుందా? లేదా? అన్నది చూడాలి.
This post was last modified on March 16, 2025 4:53 am
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…