జనసేన ఆవిర్భావ సభ జయకేతనం వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణ వినిపించింది. మొన్నటిదాకా వైసీపీలోనే కొనసాగిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి… ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయిన సంగతి తెలిసిందే. శుక్రవారం చిత్రాడలో జరిగిన జయకేతనం సభకు హాజరైన సందర్భంగా ప్రసంగించిన బాలినేని… జగన్ పై సంచలన ఆరోపణలు గుప్పించారు. తన ఆస్తులతో పాటు తన వియ్యంకుడి ఆస్తులను కూడా జగన్ లాగేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయం గురించి చెప్పాలంటే..ఈ సమయం సరిపోదని, తర్వాత సమయం వచ్చినప్పుడు జగన్ తనకు చేసిన అన్యాయం గురించి సవివరంగా చెబుతానని ఆయన అన్నారు.
రాజకీయాల్లోకి వచ్చిన తాను సగం ఆస్తులను అమ్మేసుకున్నానని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా జగన్ తనకు లైఫ్ ఇచ్చిన మాట వాస్తవమేనన్న బాలినేని… అందుకే జగన్ కోసం తన మంత్రి పదవిని కూడా త్యాగం చేశానని తెలిపారు. అయినా జగన్ తన తండ్రి పేరు చెప్పుకుని ఓ సారి సీఎం కాగలిగారన్నారు. ఇక మరోమారు జగన్ సీఎం అయ్యే అవకాశమే లేదని బాలినేని చెప్పారు. అయితే పవన్… జగన్ మాదిరిగా కాదన్నారు. స్వశక్తితో పార్టీని పెట్టిన పవన్… తన సొంతంగానే అధికారంలోకి వచ్చారన్నారు. పవన్ కు మరింత ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆయన తెలిపారు.
ఇదిలా ఉంటే… జనసేనలో తన చేరిక గురించి కూడా బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగబాబు ఆహ్వానం మేరకే తాను జనసేనలో చేరానని తెలిపారు. జనసేనలో చేరినప్పుడు తాను పదవులను అడగలేదని ఆయన చెప్పారు. అయితే పవన్ ను తాను ఓ రిక్వెస్ట్ చేశానన్నారు. పవన్ తో తాను ఓ సినిమా తీయాలనుకుంటున్నానని… ఆ ఒక్క అవకాశం ఇవ్వాలని కోరానని తెలిపారు. అందుకు పవన్ కూడా ఓకే చెప్పారని…త్వరలోనే తాను పవన్ తో ఓ సినిమాను నిర్మిస్తానని బాలినేని చెప్పుకొచ్చారు.