వైసీపీ హయాంలో జగన్ కక్షా రాజకీయాలకు పాల్పడ్డారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు వైసీపీ నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో, తమపై సీఎం చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని వైసీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు.
ఇక, జగన్ అయితే ఏకంగా గుడ్డలూడదీసి నిలబెడతా అంటూ పోలీసులు, అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు ఈ కక్షా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో కక్షా రాజకీయాలనేవి ఉండవని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.
వైసీపీ హయాంలో టీడీపీ ఆఫీసులపై దాడి జరిగిందని, ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులపై ఎప్పుడూ దాడి జరగలేదని అన్నారు. వైసీపీ నాయకులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే మాత్రం ఊరుకోబోనని వార్నింగ్ ఇచ్చారు. కొందరు యువత గంజాయి, డ్రగ్స్ కు అలవాటుపడిపోతున్నారని, అందుకే గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపామని తెలిపారు. ఈగల్ పేరుతో గంజాయి, డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించామని చెప్పారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. ఆడబిడ్డలపై హత్యాచారాలకు పాల్పడిన నిందితులకు అదే చివరి రోజని హెచ్చరించారు.