వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి మరిన్ని చిక్కులు మొదలైనట్లేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత వారం అన్నమయ్య జిల్లా పోలీసులు హైదరాబాద్ వెళ్లి మరీ పోసానిని అరెస్టు చేసి ఓబులవారిపల్లెకు తీసుకుని వచ్చారు. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచిన పోలీసులు… కోర్టు ఆదేశాలతో పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. సోమవారం ఉదయం దాకా రాజంపేట సబ్ జైలులోనే ఉన్న పోసానిని… సోమవారం ఉదయం పల్నాడు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను పీటీ వారెంట్ మీద నరసరావు పేటకు తరలిస్తున్నారు.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్, జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై వైసీపీ అధికారంలో ఉండగా… పోసాని అసభ్య పదజాలంతో దూషణలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోసానిపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. తొలుత అన్నమయ్య జిల్లా పోలీసులు ఓబులవారిపల్లె పీఎస్ లో నమోదు అయిన కేసులో పోసానిని అరెస్టు చేయగా… తాజాగా నరసరావుపేట పీఎస్ లో నమోదు అయిన కేసులో పల్నాడు జిల్ల ా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరి నరసరావుపేటలో విచారణ అనంతరం పోసానికి ఎలాంటి పరిస్థితులు స్వాగతం చెబుతాయోనన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.
వాస్తవానికి పోలీసులు అరెస్టు చేసిన తర్వాత అయినా ఆయా కేసుల్లో నిందితులు కాస్తంతైనా ఒద్దికగా ఉండాలి. అయితే తాను చేసింది తప్పేనని ఒప్పుకున్న తర్వాత కూడా పోసాని… అనారోగ్యం పేరిట పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించారు. తనకేమీ కాకున్నా కూడా ఛాతీలో నొప్పి అని కొంతసేపు, కడుపులో నొప్పి అని మరికొంత సేపు చెబుతూ పోలీసులను టెన్షన్ కు గురి చేశారు. అసలే సినీ ఇండస్ట్రీకి చెందిన పోసానికి ఏమైనా అయితే ఇబ్బందేనని భావించిన పోలీసులు ఆయన చెప్పింది నిజమేనని నమ్మి… తొలుత రాజంపేట ఆసుపత్రికి, ఆ తర్వాత కడపలోని రిమ్స్ కు తరలించి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించారు. అయితే చివరకు పోసాని చెప్పినదంతా అబద్ధమేనని, అనారోగ్యం పేరిట ఆయన నాటకాలాడినట్టుగా తేలింది. తాజాగా పల్నాడు జిల్లా పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకోగానే… పోలీసులను ఇబ్బంది పెట్టిన పోసానికి ఇలా జరగాల్సిందేనన్న సెటైర్లు పడిపోతున్నాయి.