రాష్ట్రమంతా రాజకీయాలు ఒక పద్దతిలో నడుస్తుంటే గుంటూరు జిల్లాలోని పొన్నూరులో మాత్రం రివర్సులో నడుస్తోందని టాక్ వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి దూళిపాళ నరేంద్ర చౌదరిపై వైసీపీ అభ్యర్ధి కిలారు రోశయ్య మంచి మెజారిటితో గెలిచారు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో వడ్లమూడి మైనింగ్ లో అక్రమాలకు ఎంఎల్ఏ పాల్పడుతున్నట్లు మాజీ ఎంఎల్ఏ దూళిపాళ నరేంద్ర ఆరోపణలు చేశారు. అయితే దీనిపై రోశయ్య స్పందిస్తు ఓడిపోయిన కోపంతోనే నరేంద్ర తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్లు ఎదురుదాడి మొదలుపెట్టారు. నిజంగానే తనపై ఏవైనా ఆరోపణలుంటే బహిరంగచర్చకు రావాలంటూ ఎంఎల్ఏ చేసిన సవాలుకు టీడీపీ నుండి సమాధానం రాలేదు.
ఎన్నిరోజులైనా ఎంఎల్ఏ సవాలుకు టీడీపీ నేతలెవరు నోరిప్పకపోయేటప్పటికి అంతా సైలెంట్ అయిపోయినట్లే అనుకున్నారు. అయితే ఈ సైలెంట్ పేనే సోషల్ మీడియాలో ప్రచారం దుమ్మురేగిపోయింది. ఎంతైన తమంతా రాజకీయ నేతలం కాబట్టి ఆరోపణలు, ప్రత్యారోపణలతో బజారున పడటం ఎవరికీ మంచిది కాదనే పద్దతిలో ఇద్దరు అవగాహనకు వచ్చి సైలెంట్ అయిపోయారా ? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఇద్దరినీ నిలదీశారు.
ఇదే సమయంలో ఆమధ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నరేంద్రను ఎంఎల్ఏ రోశయ్య పరామర్శించారనే ప్రచారం జరగటంతో ఇంకేం ఇద్దరు ఒకటైపోయారంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్న రోశయ్య అసలు ఇటువంటి ప్రచారాలు ఎలా జరుగుతున్నాయనే విషయంలో కాస్త ఆరాలు మొదలుపెట్టారని సమాచారం. తాను జరిపిన విచారణలో ఎంఎల్ఏనే విస్తుపోయే ట్విస్టు బయటకు వచ్చిందని…. అదేమిటంటే ఈ నియోజకవర్గంలో మొదటినుండి కష్టపడిన నేత రావి వెంకటరమణ కారణమని రోశయ్యకు తెలిసిందట.
మొన్నటి ఎన్నికల్లో నిజానికి వెంకటరమణే పోటీ చేయాల్సింది. చివరినిముషంలో మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా రోశయ్య పొన్నూరులో పోటీ చేయాల్సొచ్చింది. అప్పటి నుండి ఎంఎల్ఏ పై వెంకటరమణ బాగా మండిపోతున్నారని పార్టీలోనే టాక్ నడుస్తోంది. ఎంఎల్ఏకి వ్యతిరేకంగా వెంకటరమణ, దూళిపాళ ఏకమైపోయారనే ప్రచారం ఇపుడు కొత్తగా మొదలైంది. ఎంఎల్ఏపై సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేక ప్రచారం, కథనాల వెనుక వెంకటరమణే ఉన్నాడనేది పార్టీలోనే చర్చ మొదలైందట. మరి ఈ ప్రచారానికి ఎంఎల్ఏ ఏ విధంగా ఫుల్ స్టాప్ పెడతారో చూడాల్సిందే. అసలు వెంకటరమణ హస్తం నిజమేనా అన్నది కూడా తేలాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates