ఆ క్రెడిట్ అంతా రామ్మోహనుడిది కదా!

దేశంలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎక్కడికక్కడ కొత్తగా పుట్టుకు వస్తున్న కొత్త పార్టీలతో పాటు ఏళ్ల తరబడి ప్రస్థానం సాగిస్తున్న రాజకీయ పార్టీలు కూడా క్రెడిట్ కోసం పాకులాడే క్రమంలో ఏకంగా యుద్ధాలకే దిగుతున్నాయి. మొన్నటిదాకా ఈ తరహా క్రెడిట్ కోసం యత్నాలు జరిగినా.. పరస్పర నిందలు, విమర్శలు, వాదనలు, ప్రతిపాదనలు, ఆధారాల విడుదల… ఇలా రకరకాల పద్ధతులను వినియోగించే వారు. అయితే ఇప్పుడు ఈ క్రెడిట్ గోల ఏకంగా యుద్ధాలను తలపిస్తున్నాయి. ప్రస్తుతం వరంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్ పోర్ట్ భూముల వద్ద ఇలాంటి ఓ పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఓ వైపు బీజేపీ శ్రేణులు.. మరో వైపు కాంగ్రెస్ శ్రేణులు పరస్పరం భారీ ప్రదర్శనలకు తెర తీశాయి. ఫలితంగా శనివారం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అసలేం జరిగిందన్న విషయానికి వస్తే.. మామునూరు కేంద్రంగా విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ 690 ఎకరాల భూమిని కూడా ఎయిర్ పోర్టు కోసం అంటూ సేకరించింది. ఇలాంటి క్రమంలో మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పచ్చ జెండా ఊపింది. ఇప్పటికే సేకరించిన భూములకు అదనంగా ఇంకో 300 ఎకరాల దాకా భూములు సేకరించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. అంటే… మామునూరులో అతి త్వరలోనే ఎయిర్ పోర్టు ఏర్పాటు కావడం ఖాయమేనని తేలిపోయింది. ఈ వార్త విన్నంతనే ఓరుగల్లు ప్రజలతో పాటుగా యావత్తు తెలంగాణ సమాజం సంబరాల్లో మునిగిపోయింది.

అయితే… మామునూరు ఎయిర్ పోర్టు తమ వల్లే వచ్చిందంటూ శనివారం ఉదయం అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో మామునూరు విమానాశ్రయం భూముల వద్దకు వచ్చి సంబరాలకు తెర తీశారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసేందుకు సిద్ధపడ్డారు. సరిగ్గా అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన స్థానిక శ్రేణులు లోకల్ లీడర్ల ఆధ్వర్యంలో అక్కడకు చేరుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసేందుకు సిద్ధపడ్దారు. ఒకేసారి వందల సంఖ్యలో ఇరు పార్టీలకు చెందిన శ్రేణులు అక్కడికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి ఉరుకులు పరుగులు పెట్టక తప్పలేదు.

అయినా.. మామునూరు ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయాలని అడగడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి… అధికారుల నివేదిక మేరకు విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలా? వద్దా? అని నిర్ణయించాల్సిన బాధ్యత కేంద్రానిది. ఇలాంటి నేపథ్యంలో మామునూరుకు ఎయిర్ పోర్టు వచ్చిందంటే.. అందులో ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు కేంద్ర ప్రభుత్వం కూడా తమ వంతు బాధ్యతలను నెరవేర్చినట్టే కదా. ఈ లెక్కన బీజేపీ, కాంగ్రెస్ లు కలిసి సంబరాలు చేసుకోవాల్సింది పోయి… ఎయిర్ పోర్టు క్రెడిట్ తమదంటే… కాదు తమదని కీచులాడుకోవడం తగదు కదా.

ఇక్కడ మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా టీడీపీ యువ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టాక భారత పౌర విమానయాన శాఖ కార్యకలాపాలు ఓ రేంజిలో దూసుకుపోతున్నాయి. మామునూరుకు ఇంత త్వరగా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే… అందులో రామ్మోహన్ నాయుడి పాత్రే కీలకమని చెప్పాలి. తెలుగు నేలకు చెందిన నేతగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతిపాదనలను ఆయన యుద్ధ ప్రాతిపదికన ఆమోదిస్తున్నారు. ఈ లెక్కన రామ్మోహన్ నాయుడికి దక్కాల్సిన క్రెడిట్ లాక్కునేందుకు బీజేపీ, కాంగ్రెస్ లు పోటీ పడుతున్నాయా? అన్న దిశగానూ ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.