వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ను సీఎం చంద్రబాబు కరుణిస్తారా? గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా దయ చూపిస్తారా? ఇదీ.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే కాదు.. సోషల్ మీడియాలోనూ జరుగుతున్న చర్చ. మరికొన్ని గంటల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. ఈ సమావేశాల్లో అనేక హైలెట్లు ఉన్నప్పటికీ.. అందరి దృష్టీ.. వైసీపీ నేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్‌పైనే ఉండడం గమనార్హం.
జగన్ సభకురాకున్నా వార్తే… వచ్చినా వార్తే.. అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి. సభకు రాకపోతే.. సభ్యత్వం రద్దవుతుందన్న చర్చ సాగింది. అదే జగన్ సభకు వస్తానని కబురు పెడితే.. ఇప్పుడు మరో రకమైన చర్చ సాగుతోంది. ప్రస్తుతం జగన్‌కు ‘ఎమ్మెల్యే’ అనే హోదా తప్ప.. ఇంకేమీ లేదు. ఇతమిత్థంగా చెప్పాలంటే అంతే! దీంతో ఆయన అసెంబ్లీకి వచ్చే విషయం.. చర్చకు వస్తోంది. సాధారణంగా ఏపీ అసెంబ్లీకి మొత్తం 4 గేట్లు ఉన్నాయి.
1వ గేటు నుంచి గవర్నర్, సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
2వ నెంబరు గేటు నుంచి మంత్రులు, చీఫ్ విప్‌లు వచ్చే అవకాశం కల్పిస్తారు.
3వ నెంబరు గేటు నుంచి కేవలం అసెంబ్లీ, శాసన మండలి ఉన్నతాధికారులు , సిబ్బందిని పంపుతారు.
4వ నెంబరు గేటు నుంచి అన్ని పార్టీల ఎమ్మెల్యేలను అలౌ చేస్తారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు.. జగన్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా లేనందున.. ఆయనను 4వ నెంబరు గేటు నుంచే పంపుతారు. అంటే.. ఒక సాధారణ ఎమ్మెల్యేగానే జగన్ అడుగులు వేయాలి. అయితే.. గతంలో సభా నాయకుడిగా ఉన్న సీఎం చంద్రబాబు.. జగన్ను 1వ నెంబరు గేటు నుంచే అనుమతించారు. మరి ఇప్పుడు కూడా బాబు కరుణ చూపిస్తారా? జగన్‌ను 1వ నెంబరు గేటు నుంచి అనుమతిస్తారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ చంద్రబాబు జోక్యం చేసుకుని.. స్పీకర్‌కు సూచిస్తే.. జగన్ 1వ నెంబరు గేటు నుంచి దర్జాగా సభకు రావొచ్చు. లేదంటే 4వ నెంబరు గేటు నుంచి నడుచుకుంటూ రావాల్సి వుంటుంది.