రాజకీయం అంటే ఇప్పుడో లాభసాటి వ్యాపారం కిందే లెక్క. డబ్బు సంచులతో రాజకీయాల్లోకి వస్తున్న కొత్త తరం నేతలు… ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యాక… తాము పెట్టిన ఖర్చుకు పదింతలు, వంద రెట్లు, వెయ్యి రెట్ట సంపాదన అంటూ అందిన కాడికి దోచుకుంటున్న చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. ఇంతటి డబ్బు యావలోనూ ఆదర్శకంగా రాజకీయాలు చేద్దామంటూ పాలిటిక్స్ లోకి వస్తున్న అతి కొద్ది మంది యువకులు అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఎన్నికల్లో నిలిచి ఎలాగోలా గెలిచి ప్రజా ప్రతినిధుల ట్యాగ్ తగిలించుకుని రోడ్డెక్కుతున్న ఈ తరహా యువ నేతలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ కోవకు చెందిన వారే టీడీపీ యువ నేత, అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.
దళిత సామాజిక వర్గానికి చెందిన రాజు… ఆది నుంచి టీడీపీలో యమా యాక్టివ్ గా ఉంటున్నారు. పార్టీ ఎస్పీ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్న రాజు.. వైసీపీ హయాంలో టీడీపీ తరఫున గట్టిగా నిలబడ్డారు. వైసీపీ పాలనా తీరుపై ఓ రేంజిలో పోరాటం చేశారు. ఈ పోరాటాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎస్పీ రిజర్వ్ డ్ సీటు అయిన మడకశిర సీటును దక్కించుకున్నారు. టీడీపీ మాదిరే విక్టరీ కొట్టేశారు. ఆపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిలో సభ్యత్వాన్ని కూడా దక్కించుకున్నారు. ఓ వైపు ఎమ్మెల్యే, మరోవైపు టీటీడీ బోర్డు సభ్యుడిగా బిజీబిజీగా మారిన రాజు.. తనను అసెంబ్లీకి పంపిన మడకశిర ప్రజలకు తన వంతు సహాయం చేయాలని తలచారు.
ఇలా అనుకున్నదే తడవుగా ”టీ టైమ్ విత్ ఎమ్మెల్యే” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ సమస్యలను పట్టుకుని ఎమ్మెల్యేల వద్దకు వచ్చే సంస్కృతికి ఆయన స్వస్తి పలికారు. మీరేమీ నా వద్దకు సమస్యలను తీసుకుని రావాల్సిన అవసరం లేదని చెప్పిన రాజు… తానే మీ వద్దకు వస్తానంటూ ప్రజలకు చెప్పారు. చెప్పినట్టే బుధవారం ఆయన రంగంలోకి దిగిపోయారు. మడకశిర పట్టణంలోని ఒడిసలమ్మ దేవాలయం సమీపానికి వెళ్లిన రాజు… అక్కడే ప్రజలతో రచ్చబండ లాంటి వేదికపై కూర్చుని.. స్థానికులతో తేనీరు సేవిస్తూ మాట కలిపారు. మీ సమస్యలేమిటి? అంటూ వారితో మాట కలిపారు. ఇలా ఎమ్మెల్యేనే స్వయంగా వచ్చి తమతో మాట కలపడంతో స్థానికులు ఆనంద వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా 30 ఏళ్ల ఉదయ్ అనే వ్యక్తి రాజు వద్దకు వచ్చి కూర్చున్నారట. తనకు మూడేళ్ల క్రితం పక్షవాతం వచ్చిందని… ఫలితంగా తాను ఏ పనీ చేత కావడం లేదని, పూర్తిగా మంచానికే పరిమితం అయ్యానని… వెరసి తన కుటుంబం గడవడమే కష్టంగా మారిందని రాజుకు చెప్పాడట. అయితే ఇటీవల తన ఆరోగ్యం ఓ మోస్తరుగా మెరుగుపడిందని, ఇప్పుడు తనకు ఏదో ఒక ఉపాధి చూపించి.. తన జీవనాధారానికి మార్గం చూపాలని వేడుకున్నాడట. దీంతో చలించిపోయిన రాజు అక్కడికక్కడే ఉదయ్ పరిస్థితిపై ఆలోచించి… వెనువెంటనే సెక్యూరిటీ గార్డు ఉద్యోగం ఇప్పించారట. అంతేకాకుండా అప్పటికప్పుడు ఉద్యోగంలో చేరేలా ఏర్పాట్లు చేశారట. రాజు సరికొత్త కార్యక్రమాన్ని చూస్తుంటే… ఇలాంటి నేతలు కదా మనకు కావాల్సింది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.