టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏది పట్టినా బంగారమే అవుతోంది. ఇప్పటికే సినిమాల్లో వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య…రాజకీయాల్లో ఇప్పటికే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పారు. తనను వరుసబెట్టి గెలిపిస్తూ వస్తున్న హిందూపురం ప్రజల అభివృద్ధే లక్ష్యంగా బాలయ్య సాగుతున్నారు. ఇలాంటి క్రమంలో హిందూపురం మునిసాలిటీపైనా టీడీపీ జెండాను ఎగురవేసి బాలయ్య తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు.
వాస్తవానికి హిందూపురం మునిసిపాలిటీకి వైసీపీ హయాంలో ఎన్నికలు జరగ్గా… అధికార పార్టీ దౌర్జన్యకాండ నేపథ్యంలో బాలయ్య ఉన్నా హిందూపురం మునిసిపాలిటీని వైసీపీనే దక్కించుకుంది.అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడంతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారు అయ్యింది. అప్పటిదాకా హిందూపురం మునిసిపల్ చైర్మన్ గా సాగిన నేత ఆ పదవికి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే చాలా మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తాజాగా ఖాళీగా ఉన్న మునిసిపల్ చైర్మన్ ఎన్నిను సోమవారం నిర్వహించగా… టీడీపీ ప్రతిపాదించిన రమేశ్ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించారు.
హిందూపురం మునిసిపల్ చైర్ పర్సన్ ఎన్నిక నేపథ్యంలో గత వారం రోజులుగా పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకకొన్నాయి. తనకు దక్కిన మునిసిపాలిటీని నిలబెట్టుకునేందుకు వైసీపీ వ్యూహాలు అమలు చేయగా…తమవైపు తిరిగి వచ్చిన కౌన్సిలర్ల బలంతో హిందూపురం మునిసిపాలిటిపై టీడీపీ జెండా పాతేందుకు బాలయ్య తనదైన శైలి వ్యూహాలు అమలు చేశారు. ఈ క్రమంలో రెండు వర్గాలు క్యాంపు రాజకీయాలకు తెర తీశాయి.
పెనుకొండ రిసార్టులో టీడీపీ కౌన్సిలర్లను పెట్టిన బాలయ్య… వారందరిని సోమవారం నేరుగా మునిసిపల్ కార్యాలయానికి తరలించారు. అదే సమయంలో వైసీపీ కౌన్సిలర్లు మరో మార్గంలో అక్కడికి చేరుకున్నారు. అనంతరం అధికారులు చైర్ పర్సన్ ఎన్నికను నిర్వహించగా… టీడీపీ ప్రతిపాదించిన రమేశ్ కు 23 ఓట్లు రాగా… వేసీపీ ప్రతిపాదించిన మహిళకు 14 ఓట్లే వచ్చాయి. దీంతో హిందూపురం మునిసిపాలిటీ టీడీపీ వశమైంది. ఈ ఎన్నికలో స్థానిక ఎమ్మెల్యే హోదాలో బాలయ్య స్వయంగా ఎన్నికలో పాలుపంచుకోవడమే కాకుండా గెలిచిన రమేశ్ ను స్వయంగా కుర్చీలో కూర్చోబెట్టారు.