కిర్లంపూడి పేరు వింటేనే… కాపు ఉద్యమ నేత, సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గుర్తుకు వస్తారు. రాజకీయాల్లో తనదైన మార్కుతో సాగుతున్న ముద్రగడ.. ఇప్పుడు దాదాపుగా రాజకీయాల్లో చివరి దశలో ఉన్నారు. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతూ.. తన పేరు చివరన రెడ్డి అనే ట్యాగ్ తగిలించుకున్న ముద్రగడ… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచే యత్నం చేస్తున్నారు. అయితే ఆ యత్నాలు అంతగా ఫలించడం లేదు.
ఇలాంటి క్రమంలో ఉన్నట్టుండి…ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఓ ఘటన కిర్లంపూడిలో పెను కలకలమే రేపింది. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి ట్రాక్టర్ తో దూసుకువచ్చిన ఓ యువకుడు… అక్కడ ముద్రగడ ఇంటి ర్యాంపుపై నిలిచి ఉన్న కారును తన ట్రాక్టర్ తో బలంగానే ఢీకొట్టాడు. ఈ సందర్భంగా ఆ యువకుడి నోట నుంచి జై జనసేన అంటూ ఓ నినాదం వినిపించిందట. దీంతో ఈ దాడి జనసేన మద్దతుతోనే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటన గురించి తెలిసినంతనే… కాపు నేతలు.. ప్రత్యేకించి ముద్రగడ అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటివద్దకు చేరుకున్నారు. దాడి జరిగిన తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు కూడా హుటాహుటీన అక్కడికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. అయితే సమయం పెరుగుతున్న కొద్దీ అక్కడకు చేరుకుంటున్న ముద్రగడ అభిమానుల సంఖ్య పెరుగుతుండటం టెన్షన్ వాతావరణాన్ని మరింతగా పెంచేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates