ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ తాజాగా భేటీ అయ్యారు. భారత కాల మానం ప్రకారం బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం ఏపీకి, ముఖ్యంగా సీఎం చంద్రబాబుకు ప్రత్యేకం కావడం విశేషం. ఈ క్రమంలో బిల్ గేట్స్‌తో తనకు పూర్వమే ఉన్న పరిచయాలను చంద్రబాబు పంచుకున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కలిసి పనిచేసిన విధానాలను ఆయనకు మరోసారి గుర్తు చేశారు.
హైదరాబాద్‌లో 1995-97 మధ్య మైక్రోసాఫ్ట్‌ను తీసుకురావడం.. ఈక్రమంలో అమెరికాలో గేట్స్ కోసం వేచి ఉన్న సమయం.. కేవలం పదినిమిషాల పాటు సమయం ఇచ్చి.. దాదాపు గంట సేపు చర్చించుకున్న సందర్భం వంటివి చంద్రబాబు ఈ సందర్భం గా గత ఫొటోలను కూడా చూపించి వివరించారు. గేట్స్‌తో తనకు ఉన్న పరిచయం.. వ్యక్తిగతం కాదని.. అది దేశానికి, రాష్ట్రానికి సంబంధించిన పరిచయమని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఇక, తాజా భేటీలో గేట్స్‌ను ఏపీకి ఆహ్వానించారు. ఏపీలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వ ప్రాధాన్యాలను కూడా ఆయన వివరించారు.
సాంకేతికంగా రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలపాలన్న తన వ్యూహాన్ని కూడా నిర్దేశించారు. ఈ క్రమంలోఏపీకి వచ్చి.. తమకు సలహాలు ఇవ్వాలని.. తమను నడిపించాలని కూడా సీఎం చంద్రబాబు గేట్స్‌ను కోరినట్టు తెలిసింది. రాష్ట్రంలో తొలిసారిగా కృత్రిమ మేథ(ఏఐ) విశ్వవిద్యాలయాన్ని స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని.. దీనికి సలహాలు ఇవ్వాలని గేట్స్‌ను కోరారు. శర వేగంతో అభివృద్ధి చెందుతున్న ఏపీ ఐటీ పరిశ్రమకు కూడా గేట్స్ తన అమూల్యమైన సలహాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు.
ఇక, ఇదే విషయాన్ని చంద్రబాబు ట్వీట్ రూపంలోనూ ప్రజలతో పంచుకున్నారు. బిల్ గేట్స్-చంద్రబాబులు దావోస్‌లో భేటీ అయిన ఫొటోను షేర్ చేసిన ఆయన 1995-2025 మధ్య తమ సంబంధాన్ని.. గుర్తు చేసుకున్నట్టు తెలిపారు. అనేక సంవత్సరాల తర్వాత.. తాము కలుసుకున్నామని.. ఇది తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఫొటోలో ఏపీకి సంబందించిన పలు విషయాలను లిఖిత పూర్వకంగా బిల్ గేట్స్‌కు వివరిస్తున్నట్టు ఉండడం గమనార్హం.