కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి కంకర్యాలు, స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల బాగోగులను పర్యవేక్షఇంచేందుకు ఏర్పాటైనదే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఏపీ ప్రభుత్వమే ఈ పాలక మండలిని ఏర్పాటు చేస్తున్నా… పాలక మండలి వ్యవహారాల్లో పెద్దగా ప్రభుత్వ జోక్యం కనిపించదు. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటిదాకా టీటీడీ వ్యవహారాల్లో అసలు జోక్యం చేసుకున్న దాఖలానే లేదు. ఫర్ ద ఫస్ట్ టైం… ఇప్పుడు టీటీడీ వ్యవహారాలపై కేంద్రం దృస్టి సారించింది. ఈ పరిణామంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వైకుంఠ ద్వార దర్శనం కోసం ఉద్దేశించిన టోకెన్ల జారీ సందర్బంగా ఇటీవలే తిరుపతిలో తొక్కిసలాట జరగింది.ఈ ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు. ఈ తరహా ఘటన టీటీడీ చరిత్రలో ఇదే మొదటిది. ఈ ప్రమాదం రాజకీయ రంగు పులుముకోగా… కూటమి పార్టీలు, వైసీపీ మధ్య రచ్చ సాగింది. ఇక ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ తరఫున చైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు క్షమాపణలు చెప్పారు.
ఈ ఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే తిరుమలలో లడ్డూ జారీ కౌంటర్లలో అగ్ని ప్రమాదం చోటచేసుకుంది. సార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ఈ ప్రమాదంలో పెద్దగా నష్టమేమీ జరగలేదు. అయితే తొక్కిసలాట జరిగిన రోజుల వ్యవధిలోనే ఈ ఘటన జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దేవదేవుని గడపలో వరుసగా రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో భక్తుల్లో ఓ రకమైన భయాందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా టీటీడీ బోర్డు సామర్థ్యంపైనా చర్చ సాగుతోంది.
ఇలాంటి తరుణంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ టీటీడీ ప్రమాదాలపై దృష్టి సారించింది. అసలు తిరుమలలో ఏం జరుగుతుందో తెలుసుకుని రావాలంటూ… అదనపు కార్యదర్శిగా కొనసాగుతున్నసంజీవ్ కుమార్ జిందాల్ ను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. దీంతో జిందాల్ రేపు తిరుమల రానున్నారు. ఆదివారంతో పాటు సోమవారం కూడా ఆయన తిరుమలలోనే మకాం వేయనున్నారు. ఈ సందర్భంగా ఆయా ఘటనలపై వివరాలు సేకరించడంతో పాటుగా… వీటిపై టీటీడీ యంత్రాంగంతో సమీక్షించనున్నారు. జిందాల్ నివేదిక అందిన తర్వాత టీటీడీ వ్యవహారాలకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates