2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కుంగిపోని పవన్ 2024 ఎన్నికల్లో పిఠాపురంలో అఖండ విజయం సాధించారు. తనతోపాటు తన పార్టీ నుంచి పోటీ చేసిన 21 మంది సభ్యులను గెలిపించుకొని 100 శాతం స్ట్రైక్ రేట్ తో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా పిఠాపురంలో పర్యటిస్తున్న ఆ ప్రాంత ప్రజలనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
తన గాయాలకు పిఠాపురం ప్రజలు మందు వేశారని పవన్ అన్నారు. తనకు పని చేయడం మాత్రమే వచ్చని, విజయం గురించి తెలీదని చెప్పారు. అటువంటిది, తనకు పిఠాపురం ప్రజలు ఘన విజయం అందించారని ప్రశంసించారు. తన గెలుపు ఆంధ్రా ఆత్మ గౌరవం అని, జన్మంతా పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు.
తిరుమలలో తొక్కిసలాట ఘటన బాధించిందని, సంక్రాంతికి పిఠాపురంలో ఊరంతా పందిరి వేద్దాం అనుకున్నానని, కానీ తిరుమల ఘటనతో సంబరాలు తగ్గించానని చెప్పారు. కుదిరితే దసరా బాగా చేసుకుందామని తెలిపారు. కూటమి విజయం ప్రజలకు గెలుపని.. రాష్ట్రం గెలుపని అన్నారు. ప్రజల బలం వల్ల రాష్ట్రానికి 2 లక్షల 8 కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ప్రభుత్వ జీతంతో బతికిన కుటుంబం తనదని, ఆ రుణం తీర్చుకోవాలని అన్నారు.
కూటమి పాలనపై తృప్తి లేదని వైసీపీ నేతలు అంటున్నారని, 6 నెలల్లో చాలా చేశామని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 260 గోకులాలు నిర్మిస్తే, 6 నెలల్లో 12,500 గోకులాలు నిర్మించామని చెప్పారు. పాడి రైతులు గుజరాత్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. స్కాముల్లో వైసీపీ ప్రభుత్వం రికార్డ్ సృష్టించిందని, తమ ప్రభుత్వం పెన్షన్ల పెంపు, అభివృద్ధిలో రికార్డులు సృష్టిస్తోందని చెప్పారు. ఓట్లు కోసం బుగ్గలు నిమరడం, తలకాయలు నిమరడం కాదని పరోక్షంగా జగన్ పై సెటైర్లు వేశారు. వేల కోట్ల రూపాయలను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఏడీబీ రోడ్డును గత ప్రభుత్వం ఐదేళ్లు వదిలేసిందని విమర్శించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates