టీడీపీ-బీజేపీ నేతల మధ్య వివాదాలు తెరమీదికి వచ్చాయి.. సర్దుకునే ప్రయత్నం చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. సాధారణంగా ఒకే వరలో రెండు కత్తులు ఇమడవనే సామెత ఉన్న నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన వారు కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు కామన్ గానే తెరమీదకు వస్తుంటాయి. అయితే.. ఇప్పుడు ఒకే పార్టీకి చెందిన నాయకులు తన్నుకునే పరిస్థితి కూడా తెరమీదికి వచ్చింది. ఇలా.. ఒక చోట రెండు చోట్ల అయితే ఫర్లేదు.
కానీ, 5-10 నియోజకవర్గాల్లో ఇరుగుపొరుగు టీడీపీ ఎమ్మెల్యేలు… కూడా కలివిడిగా లేకపోతే.. తన్నుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఉదాహరణకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర, శింగనమల నియోజకవర్గాలు, విజయవాడలోని సెంట్రల్-ఈస్ట్ నియోజకవర్గాలు, గుంటూరు వెస్ట్-ఈస్ట్ నియోజకవర్గాల్లో నాయకులు తన్నుకుంటున్నారు. దీనికి కారణం.. సొంత రాజకీయాలేనని కొందరు చెబుతున్నారు. మరికొందరు ఆధిపత్య రాజకీయాలు చేసుకుంటున్నారని అంటున్నారు.
మడకశిర-శింగనమల ఎమ్మెల్యేల వివాదాలు తరచుగా రోడ్డెక్కుతున్నాయి. ఇక, విజయవాడ సెంట్రల్-ఈస్ట్‌లో మాత్రం.. కొంత వరకు రోడ్డెక్కకపోయినా.. ఎమ్మెల్యేల మధ్య మాత్రం కోల్డ్ వార్ సాగుతోంది. ఇక, గుంటూరులో మాత్రం ఈ వివాదాలు బహిరంగంగానే సాగుతున్నాయి. మరికొన్ని చోట్ల తమ్ముళ్లు పంపకాలతో సరిపుచ్చుకుంటున్నారు. అంటే వివాదాలకు అవకాశం లేకుండా ముందుకు సాగుతున్నారు. దీంతో వారి పరిస్థితి అధిష్టానానికి పెద్ద ఇబ్బందిగా మారలేదు.
కానీ, ఇలా వివాదాలకు దిగుతున్న వారితోనే ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా ఇలాంటి వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. అయితే.. ఇది అంత సాధ్యమయ్యే లా కనిపించడం లేదు. అందుకే పార్టీ కూడా ఈ విషయాలను చూసీ చూడనట్టు వదిలేయడం గమనార్హం. ఇసుక, మద్యం వరకే కాకుండా.. ఇతర విషయాలపైనా ఆధిపత్యం కోసం పోరాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుండడం గమనార్హం.