ఏ రోటికాడ ఆ పాటే! అనే సామెత రాజకీయాలకు సరిగ్గా నప్పుతుందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు రాజకీయాల్లో సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువైపోయింది. ఒకప్పుడు నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైన సామాజిక వర్గాల హడావుడి.. సమీకరణలు ఇప్పుడు జిల్లాలకు కూడా వ్యాపించింది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా అంటే.. రెడ్డి సామాజిక వర్గానికి కంచుకోట అనేక పరిస్థితి కొన్నాళ్లుగా వినిపిస్తోంది. అధికార వైసీపీ గత ఎన్నికల్లో నెల్లూరును క్లీన్ స్వీప్ చేసింది. అయితే, వీరిలో అనిల్‌కుమార్ నెల్లూరు సిటీ నుంచి గెలిచిన రెడ్డి సామాజికేతర ఎమ్మెల్యే ఒక్కరే ఉన్నారు. మిగిలిన వారంతా కూడా రెడ్డి వర్గానికి చెందినవారే. దీంతో ఈ జిల్లాలో రెడ్డి వర్గం హవా ఎక్కువగాఉంది.
నిజానికి ఆత్మకూరు, ఉదయగిరి, వెంకటగిరి నియోజకవర్గాల్లో కమ్మ వర్గం నేతలు గతంలో విజయం సాధించారు. కానీ, ఇప్పుడు మాత్రం అంతా రెడ్డి మయం అయిపోయింది. దీంతో నిన్న మొన్నటి వరకు తన సొంత సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇప్పుడు రెడ్ల బాటనే పడుతున్నారని తెలుస్తోంది. అయితే, ఇక్కడో చిత్రమైన విషయం ఉంది. టీడీపీకి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నాయకుడే అయినా.. పార్టీకి బూమ్ తీసుకురాలేక పోయారు. అయినప్పటికీ.. ఎక్కడ లోపాలు ఉన్నాయో.. గుర్తించకుండా చంద్రబాబు రెడ్ల బాటపడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక, ఈ విమర్శలను పక్కన పెడితే.. తాజాగా ఓ రెడ్డిగారికి చంద్రబాబు ఛాన్స్ ఇస్తున్నారనే వార్త జిల్లాలో హల్‌చల్ చేస్తోంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నెల్లూరు జడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని ఇక్కడ నియమించాలని, ఆయనకు పగ్గాలు అప్పగించాలని బాబు భావిస్తున్నట్టు సమాచారం. బొమ్మిరెడ్డి ఫ్యామిలీ చాలా ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్న మాట వాస్తవం. గతంలో వైసీపీలో ఉన్న ఆయన గత ఏడాది టికెట్ ఆశించారు. అయితే, జగన్ తిరస్కరించడంతో పార్టీ నుంచి బయటకు వచ్చారు. జగన్ డబ్బు మనిషని.. తీవ్ర ఆరోపణలు చేశారు. తర్వాత ఆయన టీడీపీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో నే టికెట్ ఆశించారు. అయితే.. చంద్రబాబుకు సమీకరణలు కుదరకపోవడంతో పక్కన పెట్టారు. ఇక, ఇప్పుడు రెడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని భాఇంచి బొమ్మిరెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు, వైసీపీ నుంచి ఎవరైనా రెడ్డి సామాజిక వర్గం నాయకులు వస్తే.. వెంటనే రెడ్‌కార్పెట్ పరచాలని కూడా చంద్రబాబు స్థానిక నాయకులకు ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. జిల్లాలో ప్రస్తుతం ఆనం రామనారాయణరెడ్డి వంటివారు.. వైసీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలానే మరికొందరు కూడా ఉన్నట్టు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ అసంతృప్తులను చేరదీసి రెడ్డి వర్గాన్ని తనవైపు మళ్లించుకుంటే.. నెల్లూరులో పాగా వేసేందుకు అవకాశం ఉంటుందని బాబు భావిస్తున్నట్టు సమాచారం. మరి బాబు ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి. ఎందుకంటే.. గతంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వంటివారు టీడీపీలో నుంచే బయటకు వచ్చారు. సో.. టీడీపీ అధినేత వ్యూహం సక్సెస్‌పై సందేహాలు అలానే ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.