వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు భారీ షాక్ తగిలింది. జగన్ కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి కేటాయించిన భూములను తాజాగా కూటమి సర్కారు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు.. కలెక్టర్ల సదస్సులోనే ప్రకటించడం గమనార్హం. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆక్రమిత భూములతో పాటు.. అసైన్డ్ భూములను కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా గురజాల సహా పల్నాడులోని పలు ప్రాంతాల్లో సరస్వతి పవర్ ప్రాజెక్టు కోసం కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నట్టు సీఎం తెలిపారు. ఈ భూములను గత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జగన్ కు కేటాయించారు. అయితే.. ఇక్కడ ఇండస్ట్రీ ఏర్పాటు చేయకపోవడంతోపాటు..ఇటీవల వివాదాలకు కూడా కారణమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటున్నట్టు సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించడం గమనార్హం.
ఉత్తర్వులు జారీ ..
అయితే.. దీనికి సంబంధించి పల్నాడు ప్రాంతానికి చెందిన తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. తిరిగి స్వాధీనం చేసుకున్న భూముల్లో మొత్తం 17.69 ఎకరాలు ఉన్నాయి. వీటిలో పల్నాడు జిల్లాలోని మాచవరం మండలం వేమవరంలో 13.80 ఎకరాలు, పిన్నెల్లి గ్రామ పరిధిలో 3.89 ఎకరాలు వెనక్కి తీసుకుంటున్నట్టు స్థానిక తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అసైన్డ్ భూములను సంబంధిత వర్గాలకు తిరిగి కేటాయించే అవకాశం ఉందని ఆయన పేర్కొనడం గమనార్హం.