లీజుకు తీసుకుని సొమ్ములు ఎగ్గొట్టిన వైసీపీ నేత‌

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బ‌య్య చౌద‌రికి భారీ దెబ్బే త‌గిలింది. నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ప‌లు గ్రామాల‌కు చెందిన 150 మందికి పైగా రైతులు ఆదివారం ఆయ‌న ఇంటి ముందు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. వంటా వార్పు పేరుతో ఆయ‌న ఇంటి ముందే.. పొయ్యిలు వెలిగించి.. వంట‌లు చేసి నిర‌సన తెలిపారు. దీంతో వైసీపీ నాయ‌కులు వారిని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా.. ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. అయితే.. పోలీసులు జోక్యం చేసుకుని వైసీపీ నేత‌ల‌ను అక్క‌డ నుంచి పంపించేశారు.

ఏం జ‌రిగింది?

అబ్బ‌య్య చౌద‌రి 2019 ఎన్నిక‌ల్లో తొలిసారి దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో కొల్లేరు స‌ర‌స్సు కొంత భాగం ఉంటుంది. దీనిలో చేప‌ల చెరువులు ఉన్నాయి. స్థానిక శ్రీప‌ర్రు గ్రామానికి చెందిన రైతుల నుంచి చెరువులు లీజుకు తీసుకున్నారు. వాటిలో చేప‌లు, రొయ్య‌లు సాగు చేశారు. భారీగానే గ‌డించార‌ని రైతులు చెబుతున్నారు. అయితే.. లీజుల‌కు సంబంధించి ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి సొమ్ములు చెల్లించాల్సి ఉంది.

కానీ, అబ్బ‌య్య చౌద‌రి త‌మ‌కు రూపాయి కూడా ఇవ్వ‌లేద‌ని, అదేమ‌ని అడిగితే.. అక్ర‌మకేసులు పెట్టించి వేధించార‌ని రైతులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం అధికారం మార‌డంతో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి సాయంతో అబ్బ‌య్య ను క‌లుసుకుని త‌మ సొమ్ములు వ‌సూలు చేసుకునేందుకు ప్ర‌య‌త్నించా మన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌ప్పించుకుని తిరుగుతున్న నేప‌థ్యంలో నిర‌స‌న తెలిపేందుకువ చ్చిన‌ట్టు పేర్కొన్నారు. త‌మ‌ను వైసీపీ నాయ‌కులు అడ్డుకున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు.

మాజీ ఎమ్మెల్యే ఎక్క‌డ‌?

త‌న ఇంటి ముందుకు రైతులు ఆందోళ‌న‌కు దిగినా.. మాజీ ఎమ్మెల్యే అబ్బ‌య్య చౌద‌రి మాత్రం స్పందిం చలేదు. ప్ర‌స్తుతం ఆయ‌న లండ‌న్‌లో ఉన్నార‌ని.. త్వ‌ర‌లోనే వ‌స్తార‌ని.. వ‌చ్చిన త‌ర్వాత‌సెటిల్ చేస్తార‌ని అబ్బ‌య్య చౌద‌రి త‌ర‌ఫున ఆయ‌న అనుచ‌రులు చెప్పారు. ఇంటి ముందు వంటా వార్పు చేయ‌డం ఏంట‌ని నిల‌దీశారు. దీంతో ఇరు ప‌క్షాల వాగ్వాదం చోటు చేసుకుంది. రంగప్ర‌వేశం చేసిన పోలీసులు.. శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న రైతుల‌కు అండ‌గా నిలిచారు. వైసీపీ నాయ‌కుల‌ను అక్క‌డ నుంచి పంపించేశారు.