వైసీపీ అధినేత జగన్.. గతంలో మఠానికి వెళ్లిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలోని శారదా పీఠానికి వెళ్లి ప్రత్యేక పూజలు.. హోమాలు చేశారు. చేయించారు కూడా. 2019 ఎన్నికలకు ముందు జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ.. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యేక హోమాలు చేశారు. అదేసమయంలో జగన్‌ను ఆశీర్వదించారు కూడా. జగన్ కూడా తన పాదయాత్ర సమయంలోనూ.. సీఎం అయ్యాక కూడా పలు మార్లు శారదా పీఠానికి వెళ్లి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
ఇది అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన అధికారంలో ఉన్నసమయంలో శారదా పీఠానికి పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చారన్న వాదన కూడా ఉంది. ఇటు విశాఖలోనూ.. అటు తిరుమలలోనూ మఠానికి భూములు కేటాయించారు. లీజులు కూడా ఇచ్చారు. తాజాగా కూటమి సర్కారు వీటిని రద్దు చేసింది. అంతేకాదు.. సభలోనూ గురు దక్షిణ ఇచ్చారంటూ.. జగన్‌ను కూటమి పార్టీల ఎంపీలు, మంత్రులు ఏకేశారు. ఇక, ఇంత జరిగినా శారదా పీఠం నుంచి ఎలాంటి ప్రకటనలూ రాలేదు.
కట్ చేస్తే.. శారదా పీఠానికి తాను భూములు అప్పనంగా కేటాయించానంటూ.. కూటమి మంత్రులు విమ ర్శలు చేసినా.. జగన్ స్పందించలేదు. పైగా.. ఆయన మఠాన్ని మార్చేయడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉండగా.. ఆయన శారదా పీఠానికి వెళ్లారు. స్వరూపానందేంద్రను పూజించారు. ఇక, ఇప్పుడు ఆ మఠంపై ఆరోపణలు రాగానే.. జగన్ జెండా మార్చేసినట్టు మఠాన్ని మార్చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
తాజాగా ఆయన కర్ణాటకలోని శృంగేరీ జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి ఉత్తరాధికారిగా ఉన్న విదుశేఖర స్వామిని కలుసుకున్నారు. విదుశేఖర స్వామి.. విజయవాడకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జగన్.. ఆఘమేఘాలపై స్వామిని కలుసుకుని.. దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. మరి ఆయన ఏం మాట్లాడారో తెలియదు కానీ.. ఈ చర్చలకు మాత్రం ప్రాధాన్యం ఏర్పడింది. కర్ణాటకలోని శృంగేరీ మఠానికి.. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు మధ్య అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జగన్ నేరుగా వెళ్లి విదుశేఖరస్వామిని కలుసుకుని రెండు గంటలు చర్చించడం ఆసక్తిగా మారింది. పైగా ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా.. మఠాధిపతులను కలుసుకోవడం మరింత చిత్రంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. దీనివెనుక ఏం జరిగింది? రాజకీయ ప్రయోజనాలు ఏంటి? అనేది త్వరలో వెలుగు చూసే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates