ప‌ట్టు బిగించి.. సాధించిన స‌త్య‌కుమార్‌

ఏపీలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. దీనిలో అనేక ఈక్వేష‌న్లు.. అనేక స‌మీక‌ర‌ణ‌లు కొన‌సాగాయి. ఇరుగు, పొరుగు రాష్ట్రాల‌కు చెందిన వారికి కూడా అవ‌కాశం చిక్కింది. అయితే.. తిరుమ‌ల‌లో స‌నాత‌న ధ‌ర్మానికి అన్యాయం జ‌రుగుతోంద‌ని, స్వామివారి సేవ‌లు స‌రిగా సాగ‌డం లేద‌ని, అన్య‌మ‌త‌స్తులు ఇక్కడ తిష్ట‌వేశార‌ని పేర్కొంటూ.. గ‌త ఐదేళ్లుగా తిరుమ‌ల‌లోను, బ‌య‌ట కూడా.. ఉద్య‌మాలు చేసిన బీజేపీ నాయ‌కుడు భానుప్ర‌కాష్‌ రెడ్డి. ఒక్క ఏపీలోనే కాకుండా.. తిరుమ‌ల‌లో అన్య‌మ‌త వ్య‌వ‌హారంపై ఆయ‌న ఢిల్లీకి కూడా వెళ్లి ఫిర్యాదులు చేశారు.

ఇక్క‌డితో కూడా ఆయ‌న ఆగ‌కుండా.. వైసీపీ హ‌యాంలో అప్ప‌టి ఈవో ధ‌ర్మారెడ్డి వ్య‌వ‌హారంపై నిరంతరం మీడియా ముందుకు వ‌చ్చారు. ఆయ‌న వ‌ల్ల తిరుమ‌ల అప‌ఖ్యాతి పాల‌వుతోంద‌ని పెద్ద ఎత్తున ఉద్య‌మించారు. అయితే.. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాలక మండ‌లి బోర్డులో త‌న‌కు స్థానం ద‌క్కుతుంద‌ని ఆయ‌న ఆశించారు. ఎన్నిక‌ల‌కు ముందు కూడా.. ఆయ‌న ఈ మాట‌చెప్పారు. తిరుమ‌ల బోర్డులో తాను త‌ప్ప‌కుండా ఉంటాన‌ని ప్ర‌క‌టించుకున్నారు. కానీ, తాజా బోర్డులో ఆయ‌న‌కు చోటు ద‌క్క‌లేదు. ఇదిలావుంటే.. తాజాగా ఆయ‌న పేరును చేరుస్తూ.. సీఎం చంద్ర‌బాబు ఆదేశాల‌తో బోర్డు స‌భ్యుల తుది జాబితా విడుద‌ల అయింది.

దీంతో భానుప్ర‌కాష్‌రెడ్డి సంతోషం వ్య‌క్తం చేశారు. అయితే.. ఇలా చిట్ట‌చివ‌ర ఆయ‌న పేరు చేర‌డానికి మాత్రం .. కూట‌మి స‌ర్కారులో మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్న స‌త్య‌కుమార్ యాద‌వ్ ఉన్నార‌ని బీజేపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆది నుంచి కూడా స‌త్య‌కుమార్‌, భాను ప్ర‌కాష్ రెడ్డి ఇద్దరూ మంచిమిత్రులు కావ‌డంతోపాటు.. బీజేపీ వ్య‌వ‌హారాల విష‌యంలోనూ ఇద్ద‌రూ క‌లిసి ప‌నిచేస్తున్నారు. ఈ క్ర‌మంలో మంత్రి స‌త్య‌కుమార్‌.. చిట్ట‌చివ‌రిలో జోక్యం చేసుకుని, కేంద్రంలోని పెద్ద‌ల సాయంతో భాను ప్ర‌కాష్‌కు బోర్డులో స‌భ్య‌త్వం ఇప్పించ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి స‌త్య‌కుమార్ కూట‌మి స‌ర్కారుపై ప‌ట్టు నిల‌బెట్టుకోవ‌డం రాజ‌కీయంగా కూడా త‌న‌ను తాను నిరూపించుకున్న‌ట్టు అయింది.

మొత్తం 25 మంది స‌భ్యులు, మ‌రో న‌లుగురు ఎక్స్ అఫిషియో స‌భ్యుల‌తో తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం టీటీడీ బోర్డును ప్ర‌క‌టించింది. దేవ‌దాయ శాఖ సెక్ర‌ట‌రీ, దేవ‌దాయ శాఖ క‌మిష‌నర్ల‌ను ఎక్స్ ఫిషియో స‌భ్యులుగా నియ‌మించారు. అదేవిధంగా తిరుప‌తి అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అధారిటీ చైర్మ‌న్‌(తుడా చైర్మ‌న్‌) స‌హా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కార్య‌నిర్వ‌హ‌ణాధికారిని కూడా ఎక్స్ అఫిషియో స‌భ్యులుగా చేర్చ‌డంతో మొత్తంగా బోర్డులో 29 మంది స‌భ్యులు ఉన్న‌ట్ట‌యింది. చైర్మ‌న్‌గా ఓ మీడియా సంస్థ య‌జ‌మాని బీఆర్ నాయుడును నియ‌మించిన విష‌యం తెలిసిందే.