ఏపీ సీఎం చంద్రబాబు రికార్డుల్లోకి సరికొత్త ప్రశంస వచ్చి చేరింది. ఆయనను ‘ఐటీ మ్యాన్’ అంటూ.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొనియాడారు. నిజానికి ‘ఐటీ’ గురించి ఎక్కడమాట్లాడినా.. చంద్రబాబు పేరు తరచుగా వినిపిస్తుంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. ఈ పేరు మాత్రం శాశ్వతంగా నిలిచిపోయింది. దీనికి కారణం.. హైదరాబాద్‌కు దీటుగా సైబరాబాద్‌ను నిర్మించారు. దీనిలో ప్రఖ్యాత ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించారు. అంతర్జాతీయ సంస్థలను కూడా తీసుకువచ్చారు.
దీంతో చంద్రబాబుపై సహజంగానే ‘ఐటీ’ ముద్ర పడింది. గతంలో తెలంగాణను పాలించిన కేసీఆర్ సహా..అప్పటి మంత్రి కేటీఆర్ కూడా.. చంద్రబాబు ఐటీ కోసం చేసిన కృషిని తగ్గించలేకపోయారు. పైకి కొ్న్ని కొన్ని సందర్భాల్లో బయట కూడా పడ్డారు. ఇలా.. తనకంటూ.. ప్రత్యకతను సంతరించుకున్న చంద్రబాబు.. తాజాగా కేంద్ర మంత్రి నుంచి కూడా ప్రశంసలు దక్కించుకోవడం గమ నార్హం. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ది ప్రాజెక్టులు.. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీ అంతా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, కేంద్ర మంత్రులు, బీజేపీ చీఫ్ పురందేశ్వరి వంటివారు పదుల సంఖ్యలో అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని.. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.. “ఇంత మందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఘనత మీదే” అంటూ.. అశ్వినీ వైష్ణవ్‌పై ప్రశంసలు గుప్పించారు. అయితే.. ఆయన ఈ ప్రశంసలను తిప్పి కొడుతూ.. “నేను కాదు.. అసలు ఐటీమ్యాన్ మన ముందున్న చంద్రబాబు జీ!” అని ప్రశంసించారు. దీంతో హాలు హాలంగా చప్పట్లతో మార్మోగిపోయింది. అయితే.. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడడం గమనార్హం.