Movie Reviews

సమీక్ష – శివం భజే

స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన అశ్విన్ బాబు అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు కానీ రెగ్యులర్ గా కనిపించడం తగ్గిపోయింది. కొంత బ్రేక్ తీసుకున్నా గత ఏడాది నుంచి మళ్ళీ స్పీడ్ పెంచడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా వచ్చిన హిడింబ అంచనాలు అందుకోలేకపోయినా ప్రయత్న పరంగా డిఫరెంట్ అనిపించుకుంది. ఇప్పుడు కూడా అదే తరహాలో శివం భజేతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అశ్విన్. డెబ్యూ డైరెక్టర్ అఫ్సర్ దర్శకత్వంలో గంగ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దీన్ని రూపొందించారు.

కథ

ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ గా పని చేసే చందూ (అశ్విన్ బాబు) అమ్మ చెల్లితో కలిసి మధ్య తరగతి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కళ్ళు పోవడంతో వేరే దాత ద్వారా డాక్టర్లు చూపు వచ్చేలా చేస్తారు. అయితే అప్పటి నుంచి చందూకి కొత్త సమస్య మొదలవుతుంది. ఇంకోపక్క దేశంలోనే ప్రసిద్ధి గాంచిన ఒక ఫార్మాసుటికల్ కంపెనీకి చెందిన ఉద్యోగులు ఒక్కొకరుగా హత్యకు గురవుతారు. కేసుని ఏసీపీ మురళి (అర్బాజ్ ఖాన్) టేకప్ చేస్తాడు. ఇండియాని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న చైనా, పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థలకు ఈ సంఘటనలకు కనెక్షన్ ఉంటుంది. ఆపై జరిగేది అసలు స్టోరీ.

విశ్లేషణ

మనం ఇప్పటిదాకా బోలెడు క్రైమ్ థ్రిల్లర్లు చూశాం. అలాగే దేశభక్తి ముడిపడిన తీవ్రవాద వ్యతిరేక చిత్రాలు చూస్తూనే ఉన్నాం. ఫాంటసీ మిళితం చేసిన సినిమాలు సరేసరి. ఈ మూడింటిని కలిపితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి పుట్టొకొచ్చిందే శివం భజే. దర్శకుడు అఫ్సర్ తీసుకున్న పాయింట్ లో కొత్తదనం ఉంది. తానే హైపర్ ఆదితో ఒక డైలాగు ద్వారా చెప్పించినట్టు ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన నరేష్ కోకిల తరహా కాన్సెప్ట్ తీసుకున్నా దానికి టెర్రరిజం, మైథలాజి ముడిపెట్టాలని చూశాడు. ఇక్కడి దాకా బాగానే ఉంది. అయితే పేపర్ మీద ఎగ్జైట్ చేయించే ఎన్నో సబ్జెక్టులు తెరమీదకొచ్చేటప్పటికీ ఎందుకు తడబడతాయంటే కేవలం ట్రీట్మెంట్ వల్లే.

కొంచెం రొటీన్ అయినా ఆసక్తి కలిగించే అంశంతో మొదలుపెట్టిన అఫ్సర్ చందూ ఎంట్రీతో మొదలుపెట్టి హీరోయిన్ దిగంగన సూర్యవంశీతో లవ్ ట్రాక్ వరకు ఫక్తు రెగ్యులర్ అంశాలతో కథనం నడిపించడంతో సన్నివేశాలు చాలా ఫ్లాట్ గా వెళ్తాయి. ట్విస్టులకు చాలా కీలకమైన హత్యలు సైతం మాములుగా జరిగిపోయి తర్వాత ఏం జరుగుతుందనే సస్పెన్స్ ని సృష్టించలేకపోయాయి. పైగా ఎసిపి మురళి వాటిని ఇన్వెస్టిగేట్ చేసే తీరు సిల్లీగా ఉండటమే కాక చిక్కుముడిని విప్పదీసే విధానం ఏ మాత్రం ప్రత్యేకంగా అనిపించదు. మొదట్లో ఇచ్చిన బిల్డప్ కు తగ్గట్టు హై ఎపిసోడ్ ని ఎదురు చూసే కొద్దీ సీన్లు గడిచిపోతాయి తప్పించి పెద్దగా మలుపులు రావు.

ఇంటర్వెల్ కు ముందు చందూ కళ్ళకు సంబంధించిన ఒక ముఖ్యమైన ట్విస్టు తర్వాత హ్యాండిల్ చేసిన విధానం గ్రాఫ్ ని ఇంకా కిందకు తీసుకెళ్లింది. అసలు హంతకుడు ఎవరనే ప్రశ్నను ఆడియన్స్ మెదళ్లలో బలంగా రిజిస్టర్ చేస్తేనే ఇలాంటివి పండుతాయి. బెల్లంకొండ రాక్షసుడు లాగా. కానీ శివం భజేలో ఇది పూర్తిగా మిస్సయ్యింది. మర్డర్లు జరుగుతాయి సరే వాటి వెనుక ఉద్దేశాలను బలంగా రిజిస్టర్ చేయకపోతే తీరా సస్పెన్స్ రివీలయ్యాక చప్పగా అనిపిస్తుంది. పైగా బడ్జెట్ పరిమితులు బోలెడు ఉండటంతో అఫ్సర్ ఖర్చు విషయంలోనే కాదు స్క్రీన్ ప్లేలోనూ రాజీ పడిపోవడం మొత్తంగా అసలు అవుట్ ఫుట్ ని ప్రభావితం చేసి చప్పగా మార్చేసింది.

కంటి ఆపరేషన్లకు సంబంధించిన సమాచారాన్ని బాగానే రీసెర్చ్ చేసిన అఫ్సర్ ఆపద వచ్చినప్పుడు లయకారకుడు స్వయంగా వస్తాడనే సందేశం ఇవ్వడానికి చాలా కష్టపడ్డాడు. మనిషికి జంతువుకి మధ్య అనుసంధానం చేసి ఏదో కొత్తగా చెప్పాలని ట్రై చేశాడు కానీ అనుభవలేమి డామినేట్ చేయడంతో రైటింగ్ వీకైపోయింది. శివుడి ఎలిమెంట్ ని క్లైమాక్స్ వరకు దాచి ఒక్కసారిగా దాన్ని బ్లాస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకున్న అఫ్సర్ దానికి ముందు వెనుకా ఆడియన్స్ ని థ్రిల్ చేసేందుకు సరిపడా నాటకీయత ఉందా లేదా చెక్ చేసుకోలేదు.  దీంతో ఏ ఎపిసోడ్ పెద్దగా ఎంగేజ్ చేస్తున్నట్టు అనిపించదు. వావ్ ఫ్యాక్టర్ ఏ కొంచెం ఉన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

నిస్సందేహంగా శివం భజే బ్యాక్ డ్రాప్ పరంగా క్రియేటివిటీ ఉన్న క్యాటగిరీనే. కానీ థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేయాలంటే ఒకటి రేండు అంశాలు సరిపోవు. క్యాస్టింగ్ తో మొదలుపెట్టి రైటింగ్ దాకా ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలి. అప్పుడే జనాన్ని మెప్పించగలం. దారుణం లాంటి పదాలు వాడలేం కానీ సినిమా మొత్తం అయ్యాక ఇందులో గొప్పగా ఏముందని ఎవరైనా అడిగితే సమాధానం చెప్పేందుకు మాత్రం తడబడాల్సి వస్తుంది. సరిగ్గా ఇక్కడే దర్శకుడికి తక్కువ మార్కులు పడ్డాయి. చివరి ఘట్టంలో శివుడి విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వగైరా ఓ మోస్తరుగా బాగానే కుదిరినా సినిమా బాగుందనే ట్యాగుకి కిలోమీటర్ దూరంలో ఆపేశాడు అఫ్సర్.  

నటీనటులు

అశ్విన్ బాబు తన వరకు బాగానే చేశాడు. సెకండాఫ్ లో మెరుగైన నటన కనిపిస్తుంది. బెస్ట్ అని చెప్పలేం కానీ ఉన్నంతలో దర్శకుడు కోరింది ఇచ్చాడు. హీరోయిన్ దిగంగన సూర్యవంశీ అందంగా ఉంది. అభినయపరంగా చెప్పడానికి ఏమి లేదు. జై చిరంజీవ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో హుందాగా కనిపించి నాలుగైదు డైలాగులు చెప్పడం తప్పించి పెర్ఫార్మన్స్ పరంగా ఇవ్వడానికి ఎక్కువగా లేదు. బ్రహ్మాజీ, మురళి శర్మ, అయ్యప్ప పి శర్మ, తులసి, షకలక శంకర్ తదితరులవి చాలాసార్లు చూసిన పాత్రలే. హైపర్ ఆది జోకులు కొన్ని పేలాయి. కొన్నిసెకండ్లే కనిపించే ఆర్టిస్టులున్నారు

సాంకేతిక వర్గం

వికాస్ బడిస పనితనం నేపధ్య సంగీతంలో బాగా వినిపించింది. ముఖ్యంగా శివుడి రిఫరెన్స్ ఉన్న వాటికి మంచి ఎలివేషన్ స్కోర్ ఇచ్చాడు. పాటలు వినసొంపుగా, చూడసొంపుగా లేవు కానీ బీజీఎమ్ ఒక్కటి కొంతమేర కాపాడుకుంటూ వచ్చింది. దాశరధి శివేంద్ర – అనిల్ ఛాయాగ్రహణం మంచి స్టాండర్డ్ లోనే సాగింది. వీలైనంత క్వాలిటీని తెరమీద చూపించేందుకు కష్టపడ్డారు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ నిడివిని కేవలం రెండు గంటల అయిదు నిమిషాల లోపే కట్ చేయడం మంచి పని. సాహి సురేష్ ఆర్ట్ వర్క్ పరవాలేదు. బడ్జెట్ పరంగా ఎక్కువ రిస్క్ తీసుకూడదని ముందే అనుకున్నారు కాబోలు ఖర్చు పరంగా పడిన రాజీ చాలా చోట్ల కనిపిస్తుంది

ప్లస్ పాయింట్స్

వినూత్న కాన్సెప్ట్
బీజీఎమ్

మైనస్ పాయింట్స్

థ్రిల్ ఇవ్వని ట్విస్టులు
పాటలు
ఫ్లాట్ గా సాగే కథనం
లవ్ ట్రాక్

ఫినిషింగ్ టచ్ : గురి తప్పిన శూలం

రేటింగ్ : 1.75 / 5 

This post was last modified on August 1, 2024 6:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిచ్చగాడు హీరోకి ఇంత రిస్క్ ఎందుకబ్బా

ఎప్పుడో బిచ్చగాడుతో బ్లాక్ బస్టర్ కొట్టిన విజయ్ ఆంటోనీ ఆ తర్వాత మళ్ళీ హిట్టు మొహం చూసింది దాని సీక్వెల్…

6 mins ago

రాక్షసరాజుని వదలనంటున్న రానా

నేనే రాజు నేనే మంత్రి లాంటి సక్సెస్ ఫుల్ కాంబోని రిపీట్ చేయాలనే ఉద్దేశంతో రానా దగ్గుబాటి, దర్శకుడు తేజ…

1 hour ago

దావూది పాట మీద తర్జనభర్జనలు ?

వచ్చే వారం విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1 కోసం అభిమానుల ఎదురుచూపులు అంతకంత భారంగా మారిపోయాయి. ఎప్పుడెప్పుడు ఏడు…

2 hours ago

దసరా కాంబో.. డౌటేం లేదు

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మంచి ఊపు మీదున్నాడు. 15 నెలల వ్యవధిలో అతను మూడు సక్సెస్‌లు అందుకున్నాడు. గత…

3 hours ago

టెన్షన్‌గా ఉందన్న ఎన్టీఆర్

ప్రస్తుతం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం అంటే.. ‘దేవర’నే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ…

4 hours ago

కంగువ.. వేరే దారి లేదు మరి

తమిళ టాప్ స్టార్లలో ఒకడైన సూర్య కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం.. కంగువ. ఇప్పటిదాకా రొటీన్ మాస్ మసాలా…

5 hours ago