Movie Reviews

సమీక్ష – జపాన్

తమిళ హీరోనే అయినా తెలుగులోనూ మంచి గుర్తింపున్న కార్తీకి స్టార్ కన్నా యాక్టర్ గా ఫాలోయింగ్ ఎక్కువ. టాలీవుడ్ మీద ప్రత్యేక ఆసక్తి చూపించే ఇతను ప్రమోషన్ల మీద ఎంత శ్రద్ధ పెడతాడో గత కొద్దిరోజులుగా చూస్తున్నాం. అందుకే జపాన్ కు మంచి బజ్ నెలకొంది. దర్శకుడు, హీరోయిన్ వగైరా అంశాలు పెద్దగా హైప్ కలిగించకపోయినా ట్రైలర్ చూశాక ఏదో డిఫరెంట్ ఎంటర్ టైనర్ ఇచ్చారనే అభిప్రాయం కలిగించారు. దీపావళి పండగని టార్గెట్ చేసుకున్న జపాన్ జనం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా లేదా

కథ

నగరం నడిబొడ్డున ఉండే నగల దుకాణంలో రెండు వందల కోట్ల బంగారం చోరీ అవుతుంది. పేరు మోసిన దొంగ జపాన్(కార్తీ) చేశాడని పోలీస్ ఆఫీసర్ శ్రీధర్(సునీల్)కు ఆధారాలు దొరుకుతాయి. అయితే ఎక్కడున్నాడో తెలియక వేట మొదలుపెడతాడు. ఈలోగా తానెంతో ఇష్టపడే హీరోయిన్ సంజు(అను ఇమ్మానియేల్)ను చేరుకుంటాడు జపాన్. తనకు తెలియకుండా ఏదో కుట్ర జరిగిందని భావించి ఒక్కొక్క చిక్కుముడి విప్పుకుంటూ పోతాడు. కొన్ని అనూహ్య సంఘటనలు, ఛేజుల తర్వాత ఊహించని మలుపులు చోటు చేసుకుంటాయి.

విశ్లేషణ

హీరోని కామెడీ దొంగగా మార్చి దానికో క్రైమ్ ని ముడిపెట్టి ప్రేక్షకులను మెప్పించడం ఒక ఆర్టు. అప్పటి ఎన్టీఆర్ నుంచి ఇప్పటి తారక్ దాకా దాదాపు అందరూ చేశారు. ఇలాంటి పాత్రకు టైమింగ్ ఉన్న ఆర్టిస్టు దొరికితే బంతాట ఆడొచ్చు. కార్తీని చూశాక దర్శకుడు రాజు మురుగన్ కి అలాంటి ఆలోచనే వచ్చింది కాబోలు. ఒక డిఫరెంట్ స్లాంగ్ ని సెట్ చేసుకుని, పెద్ద రాబరీ ఎపిసోడ్ రాసుకుని దాని చుట్టూ కోటింగ్ వేస్తే చాలనుకున్నాడు. ఒకవేళ హెచ్చుతగ్గులు ఏమైనా వచ్చినా కార్తీ కవర్ చేస్తాడనే గుడ్డి నమ్మకంతో కథనాన్ని చాలా తేలిగ్గా నడిపించడంతో లాజిక్కులు సంగతి తర్వాత కనీసం తెరమీద జరుగుతున్నది టైం పాస్ అయ్యేలా చేయడంలోనే తప్పటడుగు వేశాడు.

ఓపెనింగ్ సీన్లో ఒక తల్లి కొడుకు చదువు కోసం బంగారం దాచి పెట్టాలనే తాపత్రయం చూపించి ఇదేదో జపాన్ బాల్యం తాలూకు ఫీలింగ్ ఇస్తాడు రాజూ మురుగన్. కాసేపటికే ఇది వేరు ట్రాకని, జ్యువెలరీ షాప్ దొంగతనంతో సమాంతరంగా నడుస్తుందని క్లారిటీ ఇచ్చాక స్క్రీన్ ప్లే ఇష్టం వచ్చిన రీతిలో ఎగుడు దిగుడుగా సాగుతుంది. జపాన్ చేసే పనులు ఏవీ స్పెషల్ గా అనిపించవు. గొంతుని మార్చి విచిత్రంగా మాట్లాడ్డం తప్ప ఎగ్జైటింగ్ గా అనిపించే చర్యలేవీ లేకపోవడంతో వ్యవహారం బోరింగ్ గా మారిపోయింది. సునీల్, విజయ్ మిల్టన్ లు పరస్పరం వేర్వేరు చోట్ల చేసే ఇన్వెస్టిగేషన్ కూడా ఏ థ్రిల్స్, సస్పెన్స్ లేక నీరసంగా సాగటంతో క్రమంగా వేగం సన్నగిల్లుతుంది.

ఇంటర్వెల్ దగ్గర ట్విస్టు తర్వాత సెకండ్ హాఫ్ లో ఏమైనా స్పీడ్ పెరుగుతుందేమోనని ఆశిస్తాం కానీ అసలు విలన్లను రివీల్ చేసే పద్ధతిని రాజ్ మురుగన్ సెట్ చేసిన తీరు సహనాన్ని పీక్స్ కి తీసుకెళ్తుంది. పైగా కీలక మలుపుల కోసం ఎంచుకున్న ఆర్టిస్టుల ఎంపిక కూడా తేడా కొట్టడంతో ఏదో ఊహించుకుంటే ఏదో జరిగిందనే రీతిలో నీరసాన్ని ఆవహింపజేస్తుంది. జపాన్ కు ఎయిడ్స్ పెట్టడంలో ఉద్దేశం, సంజు అంతగా అతన్ని ప్రేమించడంలో పరమార్థం, మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన వైనం ఏదీ కన్విన్సింగ్ గా ఉండదు. స్టోరీకి ముడిపడిన సంఘటనల మధ్య లంకెలు సోసోగా ఉండటం ఇంపాక్ట్ ని తగ్గించేసింది.

ఇలాంటి సినిమాల్లో స్క్రీన్ ప్లే రేసీగా ఉండాలి. కేవలం డైలాగుల వల్ల పుట్టే హాస్యంతో ఎక్కువసేపు నిలబెట్టలేం. విడిగా చూస్తే కొన్ని సీన్లలో జపాన్ నవ్వించినప్పటికీ వాటి ముందు వెనుక వచ్చే సన్నివేశాల్లోని బలహీనత వల్ల తను కూడా ఒక దశ దాటాక హెల్ప్ లెస్ గా మిగిలిపోయాడు. ఎలాంటి ఛాలెంజ్ అయినా స్వీకరించే కార్తీ లాంటి నటుడు ఉన్నప్పుడు దాన్ని వాడుకునే తీరు ఇది కాదు. అవసరం లేని ఎమోషన్లను ఇరికించబోయి రాజ్ మురుగన్ ఇంకో పొరపాటు చేశాడు. దీంతో ఆ భావోద్వేగాన్ని ఫీల్ కాలేక, స్క్రీన్ మీద జరుగుతున్న తతంగాన్ని ఎంజాయ్ చేయలేక ఆడియన్స్ అయోమయంలో పడిపోతారు. ఇదే జపాన్ ఉద్దేశాన్ని సమూలంగా దెబ్బ తీసింది.

కొంతమేర అభిమానులు యావరేజ్ అనే భావన దగ్గర అటుఇటు ఊగొచ్చు కానీ సగటు ప్రేక్షకులు పదే పదే నిట్టూర్చే అవకాశాన్ని రాజ్ మురుగన్ బోలెడుసార్లు ఇచ్చాడు. అవసరం లేని కన్ఫ్యూజన్, ఏదో షాక్ ఇవ్వబోయే రేంజ్ లో బిల్డప్ ఇస్తూ క్లైమాక్స్ దాకా సాగదీసిన తీరు జపాన్ ని పూర్తిగా కిందకు లాగేసింది. తనను తాను సరిదిద్దుకోవడానికి రెండో సగంలో బోలెడు స్కోప్ దొరికినప్పటికీ దర్శకుడు వాడుకోలేదు. చివరిగా షాకిచ్చే ఎండింగ్ తో జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం ఎక్కువైపోయింది. మదర్ సెంటిమెంట్ ని సైతం సరిగా హ్యాండిల్ చేయలేకపోవడంతో దాని తాలూకు ఎమోషన్ పూర్తి స్థాయిలో చేరలేక విఫలమైంది

నటీనటులు

కార్తీ బాగా చేశాడు. వంక పెట్టడానికి లేదు. తనను ఎలా ఊహించుకుని రాజ్ మురుగన్ జపాన్ రాసుకొచ్చాడో దానికి పూర్తి న్యాయం చేశాడు. స్వంత డబ్బింగ్ లో ఇంత క్లిష్టమైన స్లాంగ్ ని చెప్పడానికి ప్రత్యేక మార్కులు ఇవ్వాలి. అను ఇమ్మానియేల్ ది మొక్కుబడి పాత్రే. అక్కడక్కడా మెరవడం తప్ప ఏ ప్రయోజనం లేదు. సునీల్ ని సరిగా ఉపయోగించుకోలేదు. బట్టతల విగ్గు పెట్టడం తప్ప ఇంకే ప్రత్యేకత లేదు. ఇతను తప్ప కెఎస్ రవికుమార్, జితన్ రమేష్, విజయ్ మిల్టన్ తదితరులంతా ఆరవ బ్యాచే. విలన్ గా ఒక పవర్ ఫుల్ ఆర్టిస్టు లేకపోవడం జపాన్ ని ఎలివేట్ చేయలేకపోయింది. అసలు దొంగలుగా పెట్టుకున్న క్యాస్టింగ్ పూర్తిగా మిస్ ఫైర్ అయ్యింది

సాంకేతిక వర్గం

జివి ప్రకాష్ కుమార్ సంగీతంలో ఎలాంటి మెరుపుల్లేవ్. పాటలు సోసోనే. అక్కడక్కడా బిజిఎంతో ఏదో వినూత్నంగా ఇవ్వాలని ట్రై చేశాడు కానీ కుదరలేదు. రవి వర్మన్ ఛాయాగ్రహణంలో అనుభవం తొంగి చూసింది. అయినా ఇలాంటి అవుట్ ఫుట్ తో ఆయనకొచ్చే ఉపయోగం, పేరు రెండూ లేవు. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ ని నిందించాలంటే దానికన్నా ముందు రైటింగ్, డైరెక్షన్ ని అనాల్సి ఉంటుంది కాబట్టి ఆయన నిమిత్తమాత్రమే. ఫైట్లతో పెద్దగా పని పడలేదు. వాటిని గుర్తించేలా డిజైన్ చేయలేదు. డ్రీం వారియర్ నిర్మాణ విలువలు కథ డిమాండ్ చేసినంత పెట్టారు కానీ దానికి న్యాయం జరిగే రీతిలో పని చేసింది ఒక్క హీరో కార్తీ మాత్రమే

ప్లస్ పాయింట్స్

కార్తీ నటన
కొంత ఎమోషన్

మైనస్ పాయింట్స్

సాగతీత స్క్రీన్ ప్లే
ఆసక్తి రేపని కథనం
క్యాస్టింగ్
ట్విస్టుల మధ్య లింకులు

ఫినిషింగ్ టచ్ – పారని జపాన్ పాచిక

రేటింగ్ : 2 / 5

This post was last modified on November 10, 2023 2:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సితార & హారికా హాసిని – 18 సినిమాల జాతర

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…

9 minutes ago

యువ ఎమ్మెల్యే దూకుడు: ప్ర‌చారం కాదు.. ప‌నిచేస్తున్నారు ..!

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న గాలి భానుప్ర‌కాష్ నాయుడు.. దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…

1 hour ago

వైఎస్’ల వార‌స‌త్వం కోసం జ‌గ‌న్ ఆరాటం!

ఈ ఏడాది జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ.. త‌ర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఓ ప్ర‌శ్న…

2 hours ago

బన్నీ నిర్ణయం కరెక్టని ఋజువైనట్టే

ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…

3 hours ago

హీరోలు సాధార‌ణ మ‌నుషులే.. మ‌రిచిపోతున్నారు: త‌మ్మారెడ్డి

ద‌ర్శ‌కుడు, న‌టుడు, నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌కు ఇండ‌స్ట్రీలో మంచి పేరుంది. ఆయ‌న ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడ‌తారు.. ఏం…

3 hours ago

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్‌కు హైకోర్టు ఊరట

తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మధ్యంతర…

3 hours ago