మాములుగా ఏదైనా సినిమా హీరో పేరు మీద ఎక్కువగా ప్రమోట్ అవుతుంది. ఒకవేళ దర్శకుడికి పది ఇరవై సినిమాల అనుభముండి ఎక్కువ బ్లాక్ బస్టర్లు తీసుంటే అప్పుడు డైరెక్టర్ బ్రాండ్ తో బిజినెస్ చేస్తారు. కానీ కీడా కోలా హైప్ మొత్తం తరుణ్ భాస్కర్ భుజాల మీదే నడిచింది. స్టార్ క్యాస్టింగ్ లేకపోవడంతో క్రేజీ కంటెంట్ తో తీశానని అంతా తానై చెప్పుకుని ప్రమోట్ చేసుకున్నారు. ఈ శుక్రవారం ఎంత పోటీ ఉన్నా యూత్ కి ఫస్ట్ ఛాయస్ గా మారింది మాత్రం కీడా కోలానే. మరి ఇంత హడావిడిలో వచ్చిన ఈ బొద్దింక మెప్పించేలా ఉందా
కథ
వాస్తు(చైతన్యరావు), లాయర్ కౌశిక్(రాగ్ మయూరి) స్నేహితులు. ఒక కేసు విషయంలో కోటి రూపాయలు అవసరమై కీడా కోలా సీసాలో బొద్దింకను చూసి దాని ద్వారా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేసుకుంటారు. కార్పొరేట్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్న జీవన్(జీవన్) జైలు నుంచి బయటికి వచ్చిన అన్న నాయుడు(తరుణ్ భాస్కర్) సహాయంతో సొమ్ము కోసం స్కెచ్చులు వేస్తుంటాడు. ఈ రెండు బ్యాచులను అనుకోకుండా ఆ కూల్ డ్రింక్ కలుపుతుంది. అక్కడి నుంచి క్యాట్ అండ్ మౌస్ ఆట మొదలై చిత్ర విచిత్ర పరిణామాలు ఎదురవుతాయి.
విశ్లేషణ
జనరేషన్ మారుతోంది. దానికి తగ్గట్టు కొత్త తరహా కామెడీని సృష్టించి ఒక సెపరేట్ జానర్ ని తయారు చేయాలని తరుణ్ భాస్కర్ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ లో ఢిల్లీ బెల్లి తరహా ప్రయోగాలు చాలా ఏళ్ళ క్రితమే సక్సెసయ్యాయి కూడా. కానీ నార్త్ ఆడియన్స్ అభిరుచులకు మన ఆలోచనలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే దాని సౌత్ రీమేక్ తమిళ, తెలుగులో సోదిలో కనిపించకుండా పోయింది. సరే ట్రెండ్ ని పసిగట్టి దానికి అనుగుణంగా తీస్తే వర్కౌట్ అవుతుందనే ఆలోచన కీడా కోలా తీసేందుకు తరుణ్ భాస్కర్ ని ప్రేరేపించింది కాబోలు. రెండు గంటల నిడివే ఉన్నా ఆద్యంతం ఆ ఆలోచన తాలూకు ప్రభావం కనిపిస్తుంటుంది.
కాన్సెప్ట్ పరంగా ఖచ్చితంగా ఇది వినూత్నమైన ఆలోచనే. సాంప్రదాయ శైలికి అలవాటు పడిన వాళ్లకు ఇలాంటి థాట్స్ రావు. నిజమే. అలా అని క్వాకీ నరేషన్ మీద ఆధారపడితే అందరికీ కనెక్ట్ అవ్వదు. క్షణ క్షణం, అనగనగా ఒక రోజు లాంటి వర్మ సినిమాలు క్రైమ్ కామెడీ చుట్టూ తిరుగుతూనే కమర్షియల్ హంగులు కూడా జోడించుకుని విజయం సాధించాయి. కానీ కీడా కోలాలో అలాంటి వాటి జోలికి పోలేదు తరుణ్ భాస్కర్. సింపుల్ గా ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ మీద ఆధారపడి డైలుగులతో నవ్వించడం మీద దృష్టి పెట్టి సన్నివేశాల్లో తగినంత బలం ఉందో లేదో చూసుకోలేదు. దీంతో రెండు గంటల తక్కువ నిడివిలోనూ కుదుపులు ఎదురవుతూ ఉంటాయి.
తరుణ్ భాస్కర్ లో ఇంటెలిజెంట్ రైటర్ ఉన్నాడు. కానీ కీడా కోలాలో అతన్ని యాక్టర్ డామినేట్ చేయడంతో కలం పూర్తి డ్యూటీ చేయలేకపోయింది. థ్రిల్ ఇవ్వడానికి బోలెడు స్కోప్ ఉన్న సన్నివేశాలు చాలానే రాసుకోవచ్చు. ఇందులో కొన్ని పేలాయి కూడా. ముఖ్యంగా విష్ణు, జీవన్, తరుణ్ లు మంచి నవ్వులు పూయించారు. కానీ అంతకన్నా బెటర్ హ్యూమర్ ఆడియన్స్ బ్రహ్మానందం, హీరోల నుంచి ఆశిస్తారు కాబట్టి ఆ కోణంలో చూస్తే రైటింగ్ వీకైపోయింది. కీలకమైన ట్విస్టునే సిల్లీగా హ్యాండిల్ చేయడం వల్ల వచ్చిన చిక్కిది. ఇలాంటి వాటిలో లాజిక్స్ కి చోటు ఉండదు. నిజమే. అలా అని పూర్తిగా ఓవర్ బోర్డు వెళ్ళిపోతే నవ్వుల మాటున తర్కాన్ని దాచలేం.
ఫస్ట్ హాఫ్ లో పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్న తరుణ్ భాస్కర్ శిక్ష పూర్తి చేసుకుని వచ్చిన నాయుడుగా తన ఎంట్రీ తర్వాతే స్పీడ్ పెంచుతాడు. నిజానికి జీవన్ కార్పొరేటర్ కావాలనుకున్న వైనాన్ని, అవమానాల పాలయ్యే తీరుని ఇంకాస్త ఎంగేజింగ్ గా మలచాల్సింది. కోలా కంపెనీ ఓనర్ తో నడిపించే వ్యవహారం కూడా అటుఇటుగా ఊగింది. దీంతో ఆ ఎపిసోడ్స్ లో పండాల్సిన ఇంటెన్సిటీ తగ్గిపోయింది. సగానికి పైగా సినిమాని అధిక శాతం యూత్ ఎంజాయ్ చేసేటట్టే ఉంది. అలా అని ఈ నగరానికి ఏమైంది లాగా రిపీట్ వేల్యూ ఉందా అంటే సమాధానం లేదనే వస్తుంది. ఇది నాయిడుగా తరుణే నటించడం వల్ల వచ్చిన చిక్కే.
యువతనే లక్ష్యంగా పెట్టుకున్నామని ధోరణిలో కీడా కోలా యూనిట్ ప్రమోట్ చేసింది కాబట్టి ఆ కోణంలో కొంతవరకు పాస్ అయినట్టే కానీ హోల్ సమ్ ఎంటర్ టైన్మెంట్ అనే ట్యాగ్ కి మాత్రం న్యాయం చేయలేకపోయింది. బడ్జెట్ పరంగా రిస్క్ లేని ప్రాజెక్టు కావడంతో బిజినెస్, లాభాలకు గట్రా విషయాల్లో కీడా కోలా గట్టెక్కవచ్చేమో కానీ తరుణ్ భాస్కర్ బెస్ట్ వర్క్స్ లో దీని ర్యాంక్ ఇప్పటిదాకా వచ్చిన వాటిలో చివరిదే అవుతుంది. ఒకవేళ వాస్తు, కౌశిక్ క్యారెక్టరైజేషన్లను ఇంకొంచెం పదునుగా మలచి, స్క్రీన్ ప్లేలో వేగం పెరిగేలా జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఫస్ట్ రిలీజ్ లోనే క్లాసిక్ అయ్యేది. ఒక అయిదారేళ్ళ తర్వాత ఇదేదో బానే ఉందే అని అప్పటి టీనేజర్లు అనుకోవచ్చు.
నటీనటులు
వెబ్ సిరీస్ లో పేరున్న చైతన్య రావు బాగానే చేశాడు. అయితే తనకు సవాలు విసిరేంత డెప్త్ పాత్రలో లేదు. రాగ్ మయూర్ కు నటనకు స్కోప్ ఉన్న సీన్లు పడ్డాయి. బ్రహ్మానందం గారిని సరిగా వాడుకోలేదు. వయసు కారణం కాదు కానీ క్యారెక్టర్ కిచ్చిన ప్రాధాన్యం అలాంటిది. తరుణ్ భాస్కర్ మాత్రం యాక్టర్ గా చెలరేగిపోయాడు. టెక్నిషియన్ గా కెమెరా వెనుక కంటే ముందు అదరగొడుతున్నాడు. కమెడియన్ విష్ణుకి తనకిచ్చిన తక్కువ స్పేస్ లో నవ్వించాడు. రవీంద్ర విజయ్, మురళీధర్ గౌడ్, రఘురాంలకు తక్కువ పరిమితి దొరికింది. క్లైమాక్స్ లో ఒక్క షాట్ లో కనిపించే రోజ్ తప్ప సినిమా మొత్తం మీద ఆడపాత్రే లేకపోవడంతో వాళ్ళ ప్రత్యేక ప్రస్తావన అక్కర్లేకుండా పోయింది.
సాంకేతిక వర్గం
వివేక్ సాగర్ నేపధ్య సంగీతం అతని శైలికి భిన్నంగా డిఫరెంట్ గా సాగింది. పాటలు లేకపోయినా తనదంటూ ఒక ముద్ర పడేలా స్టోరీలో సింక్ అయ్యే సౌండ్స్ బాగా సెట్ చేశాడు. ఏజె ఆరోన్ ఛాయాగ్రహణం స్టైలిష్ గా సాగింది. విపరీతమైన బడ్జెట్ పరిమితులను దాటుకుని క్వాలిటీ ఇవ్వాలంటే అదో పెద్ద ఛాలెంజ్. అందులోనూ లొకేషన్లు తక్కువగా ఉన్నప్పుడు. అయినా సరే తన బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. ఉపేంద్ర వర్మ ఎడిటింగ్ ఫైనల్ కట్ ని నూటా ఇరవై నిమిషాలకే కుదించేయడంతో ఫిర్యాదు చేయడానికి లేదు. దగ్గుబాటి రానా సమర్పణలో ఆయిదుగురు నిర్మాతలు కలిసి పెట్టుబడి పెట్టారంటే రిస్క్ ఫ్యాక్టర్ లేని తెలివైన వ్యాపారం కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
కొంత యూత్ కామెడీ
తరుణ్ భాస్కర్ నటన
బిజిఎం
మైనస్ పాయింట్స్
పాత్రల మధ్య లింకులు
కథనాన్ని నడిపించిన విధానం
క్లైమాక్స్ ఊగిసలాట
ఫినిషింగ్ టచ్ : చల్లదనం తగ్గిన కోలా
రేటింగ్ : 2.5 / 5
This post was last modified on November 3, 2023 2:36 pm
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…