Movie Reviews

సమీక్ష – మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

కెరీర్ మొదలుపెట్టి దశాబ్దంన్నర దాటినా అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్కకి మంచి ఫాలోయింగ్ ఉంది. భాగమతి తర్వాత బాగా గ్యాప్ వచ్చేయడం, చేసిన ఒక ఓటిటి మూవీ డిజాస్టర్ కావడంతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మీద ప్రత్యేకమైన అంచనాలు నెలకొన్నాయి. జాతరత్నాలుతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరైన నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ తోడవ్వడంతో డిఫరెంట్ మూవీ చూడొచ్చనే ఫీలింగ్ కలిగించారు. ప్రభాస్ హోమ్ బ్యానర్ లా ఫీలయ్యే యువి క్రియేషన్స్ నుంచి వచ్చిన ఈ జంట మెప్పించేలా ఉందా

కథ

లండన్ లో మాస్టర్ చెఫ్ గా పనిచేసే అన్విత(అనుష్క శెట్టి) తన ప్రాణంగా చూసుకునే తల్లి(జయసుధ) కోరిక మేరకు హైదరాబాద్ వచ్చేస్తుంది. ఆవిడ హఠాన్మరణంతో కలత చెంది తోడు కోసం భర్త లేకుండా బిడ్డను కనాలని నిర్ణయించుకుని సంతానోత్పత్తి కేంద్రంకు వెళ్తుంది. దాతను వాళ్ళు ఇవ్వడం కన్నా తనే వెతుక్కోవడం మంచిదని భావించి స్టాండప్ కామెడియన్ సిద్దు(నవీన్ పోలిశెట్టి)ని ఎంచుకుంటుంది. ముందు ప్రేమగా భ్రమపడ్డ సిద్దు అసలు నిజం తెలుసుకుని షాక్ తింటాడు. ఆపై జరిగేదే అసలు స్టోరీ

విశ్లేషణ

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్లతో హీరోయిజం డామినేట్ చేస్తున్న ట్రెండ్ లో ఒక విభిన్నమైన పాయింట్ తో సినిమా తీయాలనుకోవడం సాహసం. దర్శకుడు పి మహేష్ బాబుని ఈ విషయంలో మెచ్చుకోవాలి. ఎందుకంటే వీర్య దానం లాంటి కాన్సెప్టులు చాలా రిస్కుతో కూడుకున్నవి. సగటు తెలుగు కుటుంబ ప్రేక్షకులు వాటిని అంత సులభంగా జీర్ణించుకోలేరు. బాలీవుడ్ లో పెద్ద సక్సెసైన విక్కీ డోనర్ ని ఇక్కడ సుమంత్ తో రీమేక్ చేస్తే కనీసం వచ్చిన విషయం గుర్తు లేనంతగా వెళ్లిపోయింది. స్ట్రెయిట్ గా ఇలాంటివి డీల్ చేస్తే దెబ్బ తగులుతుంది. అందుకే మహేష్ చాలా తెలివిగా ఎంటర్ టైన్మెంట్ కోటింగ్ తో ఒక సున్నితమైన అంశాన్ని ఎంచుకున్నాడు.

ఇది ప్రధానంగా అన్విత పాత్ర చుట్టూ తిరుగుతుంది. అందుకే పాత్రల ఎస్టాబ్లిష్మెంట్ కోసం చాలా సమయం తీసుకున్నారు. నవీన్ పోలిశెట్టి ఎంట్రీ పాతిక నిమిషాల తర్వాత వస్తుంది. అక్కడి వరకు కథనం చాలా నెమ్మదిగా ఉంటుంది. ఎప్పుడైతే సిద్దు ఎంట్రీ జరుగుతుందో అక్కడి నుంచి స్క్రీన్ ప్లే హుషారుగా పరుగులు పెట్టింది. వన్ లైనర్స్ తో నవ్విస్తూనే అమాయకత్వం చలాకీతనం సమపాళ్లలో ప్రదర్శిస్తూ ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అసలు బోర్ కొట్టకుండా సాగింది. అన్విత చాలా సీరియస్ గా ఉన్నప్పటికీ దాన్ని బ్యాలన్స్ చేస్తూ ఎక్కడిక్కడ సిద్దుతో కామెడీ చేయించడం బాగా కుదిరింది. ఇంటర్వెల్ దాకా అలా సాఫీగా వెళ్లిపోయింది.

సిద్దు పాత్రకు అసలు విషయం తెలిశాక డ్రామా కొత్త మలుపు తిరుగుతుంది. అయితే సంఘర్షణ రెండు ప్రధాన పాత్రల మధ్యే ఉండటంతో వినోదమైనా, బాధ అయినా వేరొకరి ద్వారా ప్రదర్శించే అవకాశం లేకపోయింది. దీంతో ఎమోషన్ కోసం పేర్చుకున్న కొన్ని సన్నివేశాలు, పాటలు కొంత ల్యాగ్ కు కారణమయ్యాయి. సిద్దు, అన్విత తప్ప వేరొకరు తెరమీద చాలా వరకు కనిపించరు. మురళీశర్మ లేదా తల్లి ద్వారా భావోద్వేగాన్ని ఇంకాస్త బలంగా సెట్ చేసి ఉంటే వెయిట్ పెరిగేది. పిల్లలు వద్దనుకునేంత మొండితనం అన్వితకు ఎందుకుందనే కారణం ఒక డైలాగుతో చెప్పించారు కానీ ఆమె ప్రవర్తనలో మార్పుని ప్రీ క్లైమాక్స్ వరకు తీసుకురాకపోవడం వల్ల నిడివి పెరిగింది.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో ఎక్కడ అసభ్యతకు, ద్వందార్థాలకు చోటివ్వకుండా క్లీన్ నెరేషన్ ఇవ్వడం బాగుంది. తలుచుకుంటే ఫెర్టిలిటీ సెంటర్ లో బోలెడు డబుల్ మీనింగ్ జోకులు పెట్టొచ్చు. మహేష్ బాబు వాటి జోలికి వెళ్ళలేదు. డాక్టర్ గా నటించిన హర్షవర్ధన్ సైతం సెటిల్డ్ గా కనిపిస్తాడు. సిద్దు నిజం తెలుసుకుని తిరిగి అన్వితకు దగ్గరయ్యే ప్రయత్నంలో అతని నిజాయితీ ఆకట్టుకుంది. అదే మోతాదులో ఆ అమ్మాయి వైపు కూడా రియలైజేషన్ ని త్వరగా తెచ్చేసి ఉంటే వేగం పెరిగేది. జరగబోయేది ముందే ఆడియన్స్ ఊహించగలిగేలా ఉన్నప్పుడు కంటెంట్ మరింత ఎంగేజ్ అయ్యేలా సెకండ్ హాఫ్ లో ఎంటర్ టైన్మెంట్ డోస్ పెంచాల్సి ఉంటుంది.

కొత్త జానర్లు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న మహేష్ బాబు లాంటి దర్శకుడు ఇప్పుడీ సినిమా ద్వారా గొప్ప ఫలితం అందుకోవచ్చు. లేకపోవచ్చు. కానీ ఒక దారంటూ వేయడం మొదలుపెట్టారు కాబట్టి క్రమంగా జనం నడవడం అలవాటు చేసుకుని చూడటం ఇష్టపడతారు. అది దీంతోనే జరిగిపోతుందని చెప్పలేం. కమర్షియల్ బిర్యానీలకు ఆలవాటైన నాలుకలకు ఇలాంటి పంచదార చిలకలు రుచిగానే అనిపించినా కాస్త గట్టిగా ఉంటాయి. క్రమంగా తినేకొద్దీ దినచర్యలో భాగంలో చేసుకుంటాం. నవ్యత కోరుకునే క్రమంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి లాంటి ప్రయోగాలు మరిన్ని జరగాలి. పరిణతితో కూడిన ఆలోచనలకు శ్రీకారం చుడితే సరికొత్త ఐడియాలు వస్తాయి

నటీనటులు

నవీన్ పోలిశెట్టి స్టాండ్ అప్ కమెడియన్ గా సిద్దుగా జీవించేశారు. పంచులు బాగా పేలాయి. ఎనర్జీని వాడుకున్నాడు. తన టైమింగ్ ని దృష్టిలో పెట్టుకునే రాసుకున్న సంభాషణలు కావడంతో నవ్విస్తాయి. అనుష్క ఎందుకీ సబ్జెక్టుని ఓకే చేసిందో సినిమా చూశాక అర్థమవుతుంది. డీసెంట్ గా, గ్లామర్ కోటింగ్ లేని హుందాతనంతో మెప్పించేసింది. కాస్త బొద్దుగా ఉన్నా ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. మురళీశర్మ, తులసి, అభినవ్ గోమటం, నాజర్, హర్షవర్ధన్, హ్యాపీ డేస్ సోనియా తదితరులవి అలవాటైన పాత్రలే కావడంతో చేసుకుంటూ పోయారు. థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు గుర్తుండేది మాత్రం బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన లీడ్ పెయిరే

సాంకేతిక వర్గం

రదన్ స్వరపరిచిన పాటల్లో ఓ రెండు పర్వాలేదనిపిస్తాయి తప్పించి క్యాచీగా అనిపించే ట్యూన్లు కానీ, మళ్ళీ వినాలనిపించే ఆడియో కానీ లేకపోవడం శెట్టి జంటకు మైనస్ గా నిలిచింది. సాంగ్స్ బెస్ట్ పడి ఉంటే ఇంకాస్త స్థాయి పెరిగి రిపీట్ వేల్యూ వచ్చేది. గోపీ సుందర్ నేపధ్య సంగీతం థీమ్ కు తగ్గట్టు సాగింది. నిరవ్ ఛాయాగ్రహణంలో అనుభవం తొంగి చూసింది. ఎక్స్ ప్రెషన్లు, లొకేషన్లు సరైన రీతిలో చూపించారు. కోటగిరి వెంకటేశ్వరరావు గారి ఎడిటింగ్ ఇంకొంత క్రిస్పీగా ఉండాల్సింది. రెండో సగం నిడివి ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. యు క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. విదేశీ లొకేషన్ డిమాండ్ చేసినా వెనుకాడకుండా ఖర్చు పెట్టారు

ప్లస్ పాయింట్స్

నవీన్ పోలిశెట్టి
కామెడీ
క్లీన్ నెరేషన్
ఎంచుకున్న నేపథ్యం

మైనస్ పాయింట్స్

రెండో సగం సాగతీత
పాటలు

ఫినిషింగ్ టచ్ : హాస్యం భావోద్వేగం ఫిఫ్టీ ఫిఫ్టీ

రేటింగ్ : 3/5

This post was last modified on September 7, 2023 3:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

16 mins ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

52 mins ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

2 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

2 hours ago

రెహమాన్ పై రూమర్స్.. బాధతో తనయుడి వివరణ

ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…

2 hours ago