2.25/5
2 Hour 17 mins | Comedy - Drama | 07/07/2023
Cast - Naga Shaurya, Yukti Thareja, Shine Tom Chacko, Kalyani Natarajan, Murali Sharma, Sathya and others
Director - Pawan Basamsettii
Producer - Sudhakar Cherukuri
Banner - Sri Lakshmi Venkateswara Cinemas
Music - Pawan Ch
ఛలో నుంచి యూత్, ఫ్యామిలీస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగ శౌర్య కొత్త సినిమా రంగబలి ప్రేక్షకుల దృష్టిని తన వైపుకి బాగానే లాక్కోగలిగింది. ముఖ్యంగా సత్య స్పూఫ్ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక ఇందులో కంటెంట్ మీద జనాల దృష్టి మళ్లింది. పవన్ బసంశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మీద శౌర్య చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. అందుకే హడావిడిగా నిర్ణయం తీసుకున్నా ముందు రోజే స్పెషల్ ప్రీమియర్లు వేశారు. మరి కుర్రాడి నమ్మకం గెలిచిందా లేదా.
కథ
రాజవరంలో మెడికల్ షాప్ నడుపుకునే విశ్వం(గోపరాజు రమణ)కొడుకు శౌర్య ఉరఫ్ షో(నాగశౌర్య). పనీపాటా లేకుండా ఫ్రెండ్స్ తో కలిసి బేవార్స్ గా సమయం గడుపుతుంటాడు. తండ్రి వ్యాపారం కోసం ఇష్టం లేకపోయినా బిఫార్మసీ చేయడానికి విశాఖపట్నం వెళ్తాడు. అక్కడ పరిచయమైన సహజ(యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు. పెళ్లికి ఆమె తండ్రి(మురళిశర్మ)ఓ విచిత్రమైన కండీషన్ పెడతాడు. దానికి శౌర్య ఊళ్ళోని రంగబలి సెంటర్ కి కనెక్షన్ ఉంటుంది. ఒప్పుకున్న శౌర్య రిస్కుకి సిద్ధపడతాడు. ఆ తర్వాత జరిగేది తెరమీదే చూడాలి.
విశ్లేషణ
దర్శకుడు పవన్ బసంశెట్టి అన్నీ కలగలిసిన ఎంటర్ టైనర్ ఇవ్వాలని ఈ రంగబలి రాసుకున్నాడు. కామెడీ, యాక్షన్, ఎమోషన్, లవ్, రొమాన్స్ ఇవన్నీ ఏదో తూకమేసుకున్నట్టు సెట్ చేసుకున్నాడు కానీ త్రాసులో ఒకవైపు బరువు తూచే రాయి లేదన్న సంగతి మర్చిపోయాడు. జులాయిగా తిరిగే కొడుకు, అతన్ని మందలించే తండ్రి ఇలా కొన్ని వందల సినిమాల్లో చూసేసిన సెటప్ తో మొదలుపెట్టిన పవన్ ఫస్ట్ హాఫ్ ని సత్య కామెడీ సహాయంతో బాగానే లాక్కొచ్చాడు. అయితే హీరో హీరోయిన్ ప్రేమ వ్యవహారం, పాటలు గట్రా లాంటి విషయాల్లో రొటీన్ స్టైల్ లో వెళ్లిపోవడంతో మరీ ప్రత్యేకంగా అనిపించకుండా అలా టైం పాస్ చేస్తూ వెళ్ళింది.
ఫ్లాష్ బ్యాక్ రూపంలో బరువైన ఎమోషన్ ని రిజిస్టర్ చేయాలనుకున్నప్పుడు అది ఆడియన్స్ కి ఏ స్థాయిలో కనెక్ట్ అయ్యే అవకాశం ఉందో చెక్ చేసుకోవడం అవసరం. పవన్ పెట్టిన ట్విస్టు కొంత డిఫరెంట్ గా అనిపిస్తుంది కానీ దానికి సరిపడా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో పూర్తిగా తడబడ్డాడు. స్టోరీ పరంగా కాదు కానీ ట్రీట్ మెంట్ కోణంలో చూసుకుంటే అల్లు అర్జున్ సినిమా బన్నీని స్ఫూర్తిగా తీసుకున్న ఛాయలు కనిపిస్తాయి. అందులో ఫస్ట్ హాఫ్ ఎంఎస్-వేణుమాధవ్ ల హాస్యంతో నెట్టుకొచ్చి విశ్రాంతికి ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ లో శరత్ కుమార్ గతంతో సీరియస్ లుక్ తెస్తారు. ఇక్కడా ఆయన్నే తీసుకొచ్చి అలాంటి ఫ్లేవరే ట్రై చేయబోయాడు పవన్.
ఎప్పుడైతే రంగబలి పేరు మార్చేందుకు శౌర్య రంగంలోకి దిగుతాడో అక్కడి నుంచి కథనం గాడి తప్పుతుంది. కొన్ని సన్నివేశాలు నవ్వించినా అధిక శాతం జీవం లేకుండా సాగాయి. కమర్షియల్ సినిమాల స్టార్ హీరోలు ఇలాంటి బలహీనతలు కొంత మేర కవర్ చేయగలరు కానీ నాగశౌర్యకు అంత ఇమేజ్ లేకపోవడమే అసలు సమస్య. దీంతో అతను చేసే పనులు కొన్ని నవ్వించినా అధిక శాతం నవ్వులపాలయ్యాయి. ఎమ్మెల్యేతో స్నేహం చేసే ఐడియా బాగానే ఉంది కానీ దాన్ని సరిగా వాడుకోలేదు. పైగా దసరా ఫేమ్ షైన్ టామ్ చాకో రాంగ్ సెలక్షన్ అయ్యాడు. క్లైమాక్స్ లో అతనికి ఇచ్చిన ముగింపు మరీ పేలవంగా ఉండటంతో ఆ ఎపిసోడ్ తేడా కొట్టేసింది.
లాజిక్స్ లేకుండా ఇలాంటి కథలను నడపొచ్చు కానీ మరీ ఓవర్ రేటెడ్ గా వెళ్ళకూడదు. కొన్నిచోట్ల పవన్ తనను తాను బోయపాటి, వివి వినాయక్ రేంజ్ లో ఊహించేసుకుని ఏవేవో పాట్లు పడ్డాడు. అవి మాస్ కి ఎక్కలేదు సరికదా నసగా మారిపోయాయి. శుభలేఖ సుధాకర్ కి కాస్ట్యూమ్స్ మార్చే అవసరం లేకుండా అన్ని సినిమాల్లో ఒకే తరహా పాత్రలు ఇవ్వడం సానుభూతిని తగ్గించేస్తోంది. శరత్ కుమార్ ఎపిసోడ్ నుంచి ఎంతో ఆశిస్తే చాలా చప్పగా గడిచిపోయింది. హీరోకు అలాంటి లీడ్ క్యారెక్టర్ కి మధ్య ఉన్న సంబంధంలో సోల్ లేనప్పుడు ఆటోమేటిక్ గా క్లైమాక్స్ చప్పగా మారిపోతుంది. ఇలా చేసినప్పుడే చివర్లో ఇచ్చే సందేశాలు కూడా నవ్వు తెప్పిస్తాయి
డెబ్యూతోనే తనకు మాస్ పల్స్ మీదున్న పట్టుని చూపించుకోవాలన్న తాపత్రయం పవన్ బసంశెట్టిని చాలా పరిమితులకు కట్టుబడేలా చేసింది. రంగబలి సెంటర్ గురించి అంత ఎలివేషన్ ఇచ్చినప్పుడు దానికి న్యాయం చేకూర్చేలా కొన్ని హై మూమెంట్స్ ని డిజైన్ చేసుకోవాలి. అంతే తప్ప ఓ పెద్ద సీనియర్ ఆర్టిస్టుని తీసుకొచ్చి నడిపినంత మాత్రాన అది పండదు. అక్కడక్కడా కొన్ని డబుల్ మీనింగులు, పాటలో యుక్త ఎక్స్ పోజింగ్ మిస్ ఫైర్ అయ్యాయి. బోలెడంత స్కోప్ ఉన్న పాయింట్ ని సరిగా హ్యాండిల్ చేయలేకపోవడంతో రంగబలి పూర్తిగా మెప్పించలేకపోయింది. మంచి వంటకం ఛెఫ్ పైత్యం వల్ల రుచి చెడిపోయింది.
నటీనటులు
అందం, చలాకీతనం పుష్కలంగా ఉన్న నాగశౌర్య షో పాత్రలో బాగా ఒదిగిపోయాడు. కామెడీలో సత్య డామినేట్ చేసినప్పుటికీ శౌర్య తన మార్కుని మిస్ కాకుండా చూసుకున్నాడు. ఎమోషనల్ గానూ మెప్పించాడు. కమెడియన్ సత్య అందరూ కోరుకున్నట్టే ఫస్ట్ హాఫ్ లో చెలరేగిపోయాడు. స్పైడర్ సైకోని స్ఫూర్తిగా తీసుకుని డిజైన్ చేసిన తీరు బాగా పేలింది. యుక్తి తరేజా రొటీన్ బాపతే. ఏ ప్రత్యేకతా లేదు. ఓ పాటలో స్కిన్ షో ఎక్కువయ్యింది. దసరాలో అంత సీరియస్ గా మెప్పించిన షైన్ చామ్ టాకోని వృథా చేసుకున్నారు. బిల్డప్ ఇచ్చినంత స్థాయిలో శరత్ కుమార్ క్యారెక్టర్ పేలలేదు. గోపరాజు రమణ, సప్తగిరి, నోయెల్, బ్రహ్మాజీ తదితరులంతా రెగ్యులరే.
సాంకేతిక వర్గం
పవన్ సిహెచ్ సంగీతంలో ఎలాంటి పస లేదు. పాటలు చప్పగా సాగగా నేపధ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది. ఇలాంటి వాటికి సాంగ్స్ ప్లస్ అవ్వాలి. కానీ అలా జరగలేదు. దివాకర్ మణి ఛాయాగ్రహణంలో పెద్దగా లోపాలేం లేవు. దర్శకుడి విజన్ ని యథాతథంగా చూపించారు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ రెండో సగంలో షార్ప్ గా ఉండాల్సింది. అవసరం లేని సాగతీత చాలా ఉంది. ఆ లోపం స్క్రిప్ట్ దే అయినప్పుడు ఒకరినే బాధ్యుడిగా చేయలేం. పవన్ డైలాగులు అక్కడక్కడా పేలాయి తప్పించి మరీ ప్రత్యేకంగా లేవు. యాక్షన్ ఎపిసోడ్లు ఓకే. నిర్మాణ విలువలు మరీ కళ్ళు చెదిరేలా ఏం లేవు. కొండారెడ్డి బురుజు సెట్ మార్చేసి దాన్నే రంగబలి సెంటర్ గా మార్చి కానిచ్చేశారు
ప్లస్ పాయింట్స్
నాగశౌర్య
సత్య కామెడీ
మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్
రొటీన్ ఫ్లాష్ బ్యాక్
పాటలు
బలహీనమైన క్లైమాక్స్
ఫినిషింగ్ టచ్ : సగం జాలీ సగం ఖాళీ
రేటింగ్ : 2.25/5
Gulte Telugu Telugu Political and Movie News Updates