Movie Reviews

సమీక్ష – టక్కర్

బొమ్మరిల్లు హీరోగా సిద్దార్థ్ కు తెలుగులో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దాని తర్వాత స్ట్రెయిట్ సినిమాలు చాలా చేసినా అవేవీ మళ్ళీ ఆ స్థాయి ఫేమ్ తీసుకురాలేకపోయాయి. గృహం బాగానే ఆడినా హారర్ స్టోరీ కావడంతో పెద్దగా ఉపయోగపడలేదు. గత ఏడాది మహా సముద్రంతో రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ అది డిజాస్టర్ కావడంతో మళ్ళీ కొంత గ్యాప్ తప్పలేదు. తాజాగా అతను నటించిన చిత్రం టక్కర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రమోషన్ల కోసం హైదరాబాద్ లోనే తిష్ట వేసి మరీ ముచ్చట్లు పంచుకున్న సిద్దార్థ్ కోరిక నెరవేరిందా

కథ

గుణశేఖర్ అలియాస్ గుణ్స్(సిద్దార్థ్) చాలా చిన్న ఉద్యోగాలు చేస్తూ వాటితో సంతృప్తి పడలేక తక్కువ టైంలో కోటీశ్వరుడు కావాలని కలలు కంటూ ఉంటాడు. ఓ చైనీస్ వాడి బెంజ్ కారుని టాక్సీగా నడుపుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్న క్రమంలో అనుకోకుండా ఓ కిడ్నాప్ ముఠా వేసిన ఉచ్చు వల్ల ప్రమాదంలో పడతాడు. అప్పుడే లక్కీ(దివ్యంష కౌశిక్) పరిచయమై కారులో ఆమె తోడుగా ప్రయాణం చేసే ఛాన్స్ దక్కుతుంది. ఈ జంటను వెతుకుతున్న రౌడీ(అభిమన్యు సింగ్)నుంచి తప్పించుకోవడమే స్టోరీ

విశ్లేషణ

రోడ్ జర్నీ థ్రిల్లర్లు మనకు కొత్త కాదు. హిందీ నుంచి తెలుగు దాకా బోలెడు వచ్చాయి. టక్కర్ కూడా అదే బాటలో వెళ్ళింది. దర్శకుడు కార్తీక్ జి క్రిష్ దీన్ని యాక్షన్ టచ్ ఉన్న లవ్ ఎంటర్ టైనర్ గా తీసే ప్రయత్నం చేశాడు. కథగా లైన్ అనుకున్నాడు కానీ దాన్ని ప్రాపర్ గా ఆడియన్స్ ని మెప్పించేలా కథనం రాసుకోవడంలో తడబడ్డాడు. ఒకరకంగా కార్తీ ఆవారాను స్పూర్తిగా తీసుకున్నాడు కానీ అందులో ఉన్న ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేకు తగ్గట్టు టక్కర్ ని మలుచుకోవడంలో ఫెయిలయ్యాడు. డబ్బు లేకపోవడం వల్లే విధి వంచితుడిగా ఫీలయ్యే గుణ మీద రిపీట్ గా వచ్చే సీన్స్ తో మొదలుపెట్టి క్రమం తప్పకుండా ఆ సానుభూతిని బలవంతంగా జొప్పించే ప్రయత్నం చేశాడు

ఏ ట్విస్టు అయినా సరే లాజిక్ కి లోబడి ఉండాలి. కానీ కార్తీక్ ఆడియన్స్ పల్స్ ని చాలా తేలిగ్గా తీసుకున్నాడు. గుణ వాడే బెంజి కారు సిటీ మొత్తం విధ్వంసం సృష్టిస్తే కనీసం పోలీసులు పట్టించుకున్నట్టు కూడా ఎక్కడ చూపించరు. పైగా దాన్ని పైపై రిపేర్ చేయించి మళ్ళీ దర్జాగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు. ఇవి సిల్లీ మిస్టేక్స్. స్క్రిప్ట్ స్టేజిలోనే ఎవరిని అడిగినా చెబుతారు. పాత్రల మధ్య సంబంధాలు కృత్రిమంగా ఉండటంతో బేసిక్ ఎమోషన్లు సైతం జీరో అయ్యాయి. హీరోయిన్ ని అంత విచ్చలవిడిగా చూపించడంలో కార్తీక్ ఉద్దేశం ఏమైనా ఆమె నాన్నను డమ్మీగా మార్చి ప్రేమను నోచుకోని ఓ అభాగ్యురాలి రేంజ్ లో బిల్డప్ ఇవ్వడం ఏ మాత్రం సింక్ అవ్వలేదు.

ఫస్ట్ హాఫ్ ఏదో అత్తెసరుగా నడిచినా సెకండ్ హాఫ్ కాపాడుతుందనుకుంటే మొదటి సగమే నయమనిపించేలా ఓపికకు పరీక్ష పెట్టాడు. ఇంటర్వెల్ అయ్యాక గుణ, లక్కీలు ఎప్పుడైతే రోడ్డెక్కుతారో అక్కడి నుంచి కార్తీక్ క్రియేటివిటీ షెడ్డుకి వెళ్లిపోయింది. ఇక్కడ గంటా పదిహేను నిముషాలు షో రన్ చేయడానికి కంటెంట్ లేదు. దీంతో అవసరమే లేని రొమాంటిక్ ట్రాక్ ని ఇరికించాడు. పాటలు ఎందుకు వస్తాయో అర్థం కాదు. ఏదో ఫిలాసఫీ చెప్పినట్టు సిద్దు గుణలు రూమ్ తీసుకుని అక్కడ శృంగార గీతం మొదలుపెట్టడం సహనాన్ని పీక్స్ లో పరీక్షిస్తుంది. వాళ్ళ ప్రయాణాన్ని థ్రిల్లింగ్ గా మార్చే అవకాశం ఉన్నా సరే కార్తీక్ జి క్రిష్ కొంచెం కూడా రిస్క్ తీసుకోలేదు

వీటి సంగతి ఎలా ఉన్నా కనీసం కామెడీ ఉన్నా థియేటర్ ఏసిలో కాసింత నవ్వుకోవడానికి పనికొచ్చేది. కానీ కమెడియన్ యోగిబాబు ఎంత ట్రై చేసినా అక్కడక్కడా తప్పించి పేలవమైన రైటింగ్ వల్ల ఒక దశ దాటాక తను కూడా ఫ్రస్ట్రేట్ అయిన భావన కలుగుతుంది. ధనవంతులైన పిల్లలను అపహరించి కోట్ల రూపాయలు కొల్లగొట్టే అంత పెద్ద డాన్ రోడ్ మీద బుర్ర లేని గూండాలను వేసుకుని ఎరుపు కారా పచ్చ కారా అంటూ అమాయకంగా నటించడం మరీ టూ మచ్. దానికి తోడు అభిమన్యు సింగ్ కి ఈ క్యారెక్టర్ ఇవ్వడంతో సహజంగానే అతను ఇచ్చే ఓవర్ ఎక్స్ ప్రెషన్స్ పరిస్థితిని ఇంకా దిగజార్చాయి. క్లైమాక్స్ వెళ్లే క్రమం కూడా ఆసక్తిగా లేదు

కార్తీక్ జి క్రిష్ లోని అపరిపక్వత టక్కర్ ని బలహీనంగా మార్చేసింది. ఓటిటి జమానాలో ఏదో అదిరిపోయే పాయింట్ ఉంటే తప్ప పబ్లిక్ ని థియేటర్లకు రప్పించలేని పరిస్థితిలో ఇలాంటి కథలతో హీరోలను కన్విన్స్ చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అరవ జనాల గురించి చెప్పలేం కానీ టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం ఈ టక్కర్ లో ఎలాంటి కన్విసింగ్ పాయింట్ కనిపించదు. అసలు చైనావాడు బెంజ్ కారుని అద్దెకు తిప్పుతూ దావూద్ ఇబ్రహీంలా హంగామా చేయడం ఏమిటో, ఒక వీధి మొత్తాన్ని నేరాలకు అడ్డాగా మార్చిన విలన్ చిన్నపిల్లాడిలా నడిరోడ్డు మీద ప్లాన్లు వేయడం ఏమిటో ఇలా అంతులేని ప్రశ్నలు ఎన్నో క్లైమాక్స్ దాకా వెంటాడుతూనే ఉంటాయి.

నటీనటులు

సిద్దార్థ్ కు ఇలాంటివి కొత్తేమీ కాదు. ఎప్పటిలాగే చేసుకుంటూ పోయాడు. ఏదో వెరైటీ కోసం పెట్టినా అరబ్ షేక్ లాగా దవడ మీద పిల్లి గెడ్డం సూటవ్వలేదు. హీరోయిన్ దివ్యంశ కౌశిక్ గ్లామర్ షోకి మొహమాటపడలేదు. తన అందాలు చూపించడం కోసమే బలవంతంగా రాసిన సీన్లున్నాయి. యోగిబాబు క్రమంగా మరీ రొటీన్ అవుతున్నాడు. కోపంగా చూసే సింగల్ ఎక్స్ ప్రెషన్ తో నెట్టుకొచ్చే అభిమన్యు సింగ్ ఇందులోనూ అదే చేశాడు. రాంగ్ క్యాస్టింగ్ చాలా జరిగింది. లక్కీ తండ్రి, ఎంగేజ్ మెంట్ చేసుకున్న బిజినెస్ మెన్ మరీ జూనియర్ ఆర్టిస్టుల కన్నా అన్యాయంగా ఉన్నారు. మునిష్ కాంత్, ఆర్జె విగ్నేష్, సుజాత శివకుమార్ కొంత నిడివికే పరిమితమయ్యారు

సాంకేతిక వర్గం

నివాస్ కె ప్రసన్న బ్యాక్ గ్రౌండ్ మొదట్లో కాస్త ఫ్రెష్ గా అనిపించినప్పటికీ క్రమంగా పట్టు తప్పిపోయి రొటీన్ హోరులో కలిసిపోయింది. పాటలు ఆడియో ప్లస్ వీడియో ఏదీ ఆకట్టుకునేలా లేవు. వంచినాథన్ మురుగేషన్ ఛాయాగ్రహణం అచ్చం టక్కర్ స్క్రీన్ ప్లే లాగే నానా సర్కస్ చేసింది. ఆయన పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పే అవకాశం ఇవ్వలేదు. జిఏ గౌతమ్ ఎడిటింగ్ నిస్సహాయంగా మిగిలిపోయింది. కరెక్ట్ గా కత్తెర వేస్తే ఇంకో గంట ఎగురుతుంది కాబట్టి సైలెంట్ అయ్యారేమో. నిర్మాణ విలువలు పర్వాలేదు. మూడు పేరున్న బ్యానర్లు దీన్ని సొంతం చేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రొడక్షన్ లో అంతగా రాజీ పడలేదు

ప్లస్ పాయింట్స్

సిద్దార్థ్
అక్కడక్కడా ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్

సిల్లీ నెరేషన్
హీరోయిన్ ట్రాక్
కిచిడి కామెడీ
సంగీతం

ఫినిషింగ్ టచ్ – నో మ్యాటర్

రేటింగ్ : 1.75/5

This post was last modified on June 9, 2023 10:45 pm

Share
Show comments
Published by
Satya
Tags: takkar

Recent Posts

అల్లు అర్జున్ కు మరోసారి లీగల్ నోటీసులు!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…

1 hour ago

అవసరమైతే విదేశీ డాక్టర్లతో రేవతి కుమారుడు శ్రీతేజ్ కు వైద్యం!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…

2 hours ago

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

3 hours ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

4 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

4 hours ago

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

5 hours ago