ఎనిమిదేళ్ల సుదీర్ఘ కాలంలో ఒక హిట్టు లేకుండా మార్కెట్ ని కాపాడుకోవడం బ్యాక్ గ్రౌండ్ లేని హీరోకి అసాధ్యం. అందులోనూ పక్క రాష్ట్రం వాడైతే ఇక చెప్పేదేముంది. కానీ విజయ్ ఆంటోనీ దీనికి అతీతంగా 2016 బ్లాక్ బస్టర్ బిచ్చగాడుతో ఇప్పటి దాకా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. మధ్యలో ఎన్ని సినిమాలు వచ్చినా అవేవి పెద్దగా ఆడకపోయినా ఫస్ట్ సక్సెస్ ఇచ్చిన ఇమేజ్ దాని సీక్వెల్ గా వచ్చిన మూవీకి ఆరు కోట్ల బిజినెస్ చేసి పెట్టింది. ఊహించని విధంగా డీసెంట్ ఓపెనింగ్స్ రావడం విశేషం. మరి బికిలి మెప్పించాడా
కథ
లక్ష కోట్ల ఆధిపతి విజయ్ గురుమూర్తి(విజయ్ ఆంటోనీ)మీద నమ్ముకున్న వాళ్ళే కుట్ర చేసి మెదడు మార్పిడి ద్వారా శస్త్ర చికిత్స చేయిస్తారు. అతని పోలికలతోనే ఉండే సత్య(విజయ్ ఆంటోనీ)ని ఆ స్థానంలో తీసుకొస్తారు. చిన్నప్పుడే ప్రాణంగా ప్రేమించి తప్పిపోయిన చెల్లి కోసం వెతుకుతున్న సత్య ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని చేతుల్లోకి తీసుకుని తనలాగే డబ్బులేని పేదవాళ్ళు, రోడ్డు మీద బిచ్చమెచ్చుకునే వాళ్ళను ఆదుకునే ఉద్దేశంతో యాంటీ బికిలి కంపెనీ స్థాపిస్తాడు. ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి
విశ్లేషణ
బిచ్చగాడు ప్రభావం ఆడియన్స్ లో చాలా బలంగా ఉంది. ఇప్పటికీ టీవీలో వచ్చిన ప్రతిసారి అతుక్కుపోయి చూసేవాళ్ళు ఎందరో. అందులో తల్లి సెంటిమెంట్ అంతగా కదిలించడం వల్లే గొప్ప విజయం సాధించింది. విజయ్ ఆంటోనీ ఈసారి దర్శకత్వ బాధ్యతను తలకెత్తుకుని చెల్లి ఎమోషన్ తో ఓ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నిజానికి ఆ మైండ్ ట్రాన్స్ ప్లాంటేషన్ కాన్సెప్ట్ పక్కనపెట్టి చూస్తే డబ్బున్న వాడి స్థానంలో అదే డబుల్ ఫోటో రూపురేఖలున్న ఇంకో పేదవాడు వెళ్లడం చాలా సార్లు చూశాం. ఆ పోలిక రాకూడదనే ఉద్దేశంతో చాలా తెలివిగా ఇలాంటి పాయింట్ ని ఎంచుకున్నాడు. నమ్మశక్యంగా లేకపోయినా కన్విన్సింగ్ గా మొదలుపెట్టారు
విజయ్ గురుమూర్తి క్యారెక్టరైజేషన్, పక్కన ఉంటూ గోతులు తవ్వే విలన్ల సెటప్, ప్లాన్ ని అమలు చేయడం కోసం డాక్టర్ ని దుబాయ్ కి రహస్యంగా తీసుకురావడం ఇవన్నీ బాగానే కుదిరాయి. ఏదో కొత్త అనుభూతి దక్కబోతోందని ఫీలవుతున్న టైంలో సత్య ఫ్లాష్ బ్యాక్ ని ఓపెన్ చేసిన విజయ్ ఆంటోనీ దానికి చాలా సమయం తీసుకోవడం విసిగిస్తుంది. చెల్లి దూరమయ్యిందని చెప్పడానికి అంత లెన్త్ అవసరం లేదు. ఓ పాథోస్ సాంగ్ తో నిడివిని ఇంకా పెంచారు. దీంతో మొదట్లో వచ్చిన ఆ డిఫరెంట్ ఫీల్ కాస్తా మాయమై చెన్నై సాంబార్ వాసన రావడం మొదలవుతుంది. ఈ గతం ఎపిసోడ్ జరిగినంత సేపు ఎప్పుడెప్పుడు అయిపోతుందాని ఎదురు చూస్తుంటాం.
బిచ్చగాడు బ్రాండ్ ప్రభావంతో ఇందులోనూ విజయ్ ఆంటోనీ వాళ్ళ నేపధ్యాన్నే తీసుకున్నాడు కానీ ఫస్ట్ పార్ట్ అంత ప్రతిభావంతంగా దీన్ని మలచలేకపోయాడు. ముఖ్యంగా డ్రామా విషయంలో తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది. గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళను పోలీస్ స్టేషన్ లో పట్టించాక వచ్చే సీన్, బీచ్ దగ్గర శత్రు సంహారం లాంటివి మాస్ కి ఓ మోస్తరుగా నచ్చేలా బాగానే డీల్ చేసినప్పటికీ అసలైన ఎమోషన్ విషయంలోనే శృతి తప్పడంతో కీలకమైన చెల్లెలి పాయింట్ పక్కకెళ్లిపోయి అనవసరమైన విషయాలు వచ్చి చేరాయి. శివాజీ, అపరిచితుడు రేంజ్ లో డిజైన్ చేసుకున్న యాంటీ బికిలి కాన్సెప్ట్ సైతం ఒక దశ దాటాక లాజిక్స్ కి దూరంగా ఉండిపోయింది.
నిజానికి ఈ ప్లాట్ తో గూస్ బంప్స్ తెప్పించే అంశాలు ఎన్నో జొప్పించవచ్చు. కానీ విజయ్ ఆంటోనీ ఆ దిశగా ఆలోచించలేదు. సినిమా ముందుకెళ్లేకొద్దీ అన్నాచెల్లెలు ఎప్పుడు కలుస్తారానే సస్పెన్స్ ఒకవైపు ఆడియన్స్ మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. కానీ దాన్ని సైడ్ లైన్ చేసేసి అదే పనిగా సందేశాలు ఇచ్చే పనిని గురుమూర్తికి అప్పజెప్పడంతో హై అనిపించే మూమెంట్స్ ఆటోమేటిక్ గా తగ్గిపోయాయి. ఒక పోలీస్ ఇన్స్ పెక్టర్ అంత పెద్ద బిజినెస్ మెన్ ఇంటికి వచ్చి వార్నింగ్ ఇవ్వడం, చీఫ్ మినిస్టర్ ప్రవర్తన కాస్తంత సిల్లీగా అనిపిస్తాయి. మలుపులు క్రమం తప్పకుండా వస్తూ వెళ్తుంటాయి కానీ ఏదీ ఊహాతీతంగా లేకపోవడం బిచ్చగాడు 2లో ప్రధాన సమస్య
అలా అని విపరీతంగా నిరాశపరిచి తలనెప్పి తెప్పించేలా బిచ్చగాడు 2 లేదు. బిర్యానీ పెడతారని ఆశించి ఆకలితో వచ్చిన వాడికి పులిహోర పెడితే కడుపు నిండొచ్చు కానీ పూర్తి సంతృప్తినివ్వదు. విజయ్ ఆంటోనీ చేసిన పొరపాటు ఇదే. సెంటిమెంట్, ఎమోషన్స్, సోషల్ మెసేజ్, క్రైమ్ థ్రిల్లర్ ఇన్ని అన్ని మిక్స్ చేయబోయి మిక్స్ ఫ్రూట్ జ్యూస్ బదులు రుచి తగ్గిన సలాడ్ ని అందించారు. చివర్లో వచ్చే కోర్టు రూమ్ సీన్లు సైతం తేలిగ్గా వచ్చాయి. సత్యని కాపాడేందుకు హీరోయిన్ సైడ్ నుంచి ఇచ్చిన ట్విస్ట్ నిజానికి చప్పట్లు కొట్టించాలి. కానీ అప్పటికే అతిశయోక్తులని చూసి చూసి చాలనిపించేసిన జనాలకు ఆ ట్రాక్ ఏమంత కిక్ ఇవ్వలేకపోయింది
నటీనటులు
విజయ్ ఆంటోనీ మరోసారి తనకు సరిపడా పాత్రలనే రాసుకున్నాడు. సత్య ఇంట్రో మేకప్ తేడా కొట్టడమనే మైనస్ ని పక్కనపెడితే పెర్ఫార్మన్స్ పరంగా పాస్ అయ్యాడు. హీరోయిన్ కావ్య థాపర్ లుక్స్ ప్లస్ యాక్టింగ్ రెండు బాగానే కుదిరాయి. మగధీర విలన్ దేవ్ గిల్ తో పాటు జాన్ విజయ్, హరీష్ పేరడీలు సరిపోయారు. ముఖ్యమంత్రిగా రాధారవికి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. యోగి బాబు జోకులతో కొంత రిలీఫ్ ఇచ్చాడు. మోహన్ రామన్, వైజి మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్ సీనియారిటీతో మెప్పించారు. బిచ్చగాళ్ల గ్యాంగ్ లో ఆర్టిస్టులు ఎప్పట్లాగే సహజంగా ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన కుర్రాడు ఆకట్టుకున్నాడు. ప్రధాన తారాగణంలో గుర్తుండేది వీళ్ళే
సాంకేతిక వర్గం
విజయ్ ఆంటోనీ సంగీతం పాటలతో ఎలాంటి అద్భుతాలు చేయలేదు. చెల్లి సాంగ్ పర్వాలేదంతే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా మరీ గొప్పగా లేదు కానీ డీసెంట్ గా సాగింది. ఓం నారాయణ్ ఛాయాగ్రహణం బడ్జెట్ పరిమితులు తట్టుకుంటూనే క్వాలిటీ విజువల్స్ ని అందించింది. ఎడిటింగ్ కూడా హీరోనే చేసుకున్నాడు కాబట్టి ల్యాగ్ ని పసిగట్టలేకపోవడం వల్ల కత్తెరకు పెద్దగా పని చెప్పలేదు. యాక్షన్ బ్లాక్స్ బాగానే వచ్చాయి. నెరేషన్ ఉన్న కన్ఫ్యూజన్ తెరమీద కన్పించడంలో రచయితలదే బాధ్యత. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. విఎఫెక్స్ ఎఫెక్ట్స్ సరిగా రాలేదు. ఇంకొంచెం శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ కు పాస్ మార్కులు వేయొచ్చు
ప్లస్ పాయింట్స్
విజయ్ ఆంటోనీ పాత్ర
తీసుకున్న నేపథ్యం
ఇంటర్వెల్ ట్విస్ట్
మైనస్ పాయింట్స్
చైల్డ్ ఫ్లాష్ బ్యాక్
ఎమోషన్ పేరుతో సందేశం
క్లైమాక్స్ పార్ట్
ఫినిషింగ్ టచ్ : తడబడిన బిచ్చగాడు
రేటింగ్ : 2.5 /5
This post was last modified on May 19, 2023 3:51 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…