Movie Reviews

సమీక్ష – విడుదల పార్ట్ 1

విలక్షణమైన సినిమాలు తీస్తాడని పేరున్న వెట్రిమారన్ తెలుగు ఆడియన్స్ కి అంతగా పరిచయం లేదు కానీ సౌత్ ఇండస్ట్రీలో అన్ని బాషలతో పరిచయమున్న వాళ్ళకు ఆయన మీద ప్రత్యేక గౌరవముంది. రెగ్యులర్ ఫార్ములాకి భిన్నంగా బయటికి కనిపించని ఒక వాస్తవిక ప్రపంచంలోకి తీసుకెళ్లే ఆలోచనలు డిఫరెంట్ ఫిలిం మేకరనే బిరుదునిచ్చాయి. తమిళంలో గత నెల 31న రిలీజైన విడుతలై పార్ట్ 1 విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రెండు వారాలు ఆలస్యంగా గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగులో అందించారు.

కథ

1987 సంవత్సరం. మారుమూల అడవుల్లో ఉండే పోలీస్ క్యాంప్ కు డ్రైవర్ గా వస్తాడు కుమారేశన్(సూరి). అక్కడ ప్రజాదళం అనే నక్సలైట్ల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఓ ట్రైన్ బ్లాస్ట్ లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం ముఠానాయకుడు పెరుమాళ్ (విజయ్ సేతుపతి)ని పట్టుకునేందుకు స్పెషల్ ఆఫీసర్ సునీల్(గౌతమ్ మీనన్)ని పంపిస్తుంది. దగ్గరలో ఉండే గ్రామంలో నివసించే తమిళసై(భవానిశ్రీ)ని కుమారేశన్ ప్రేమిస్తాడు. పెరుమాళ్ ఊళ్ళో ఉన్నాడని గుర్తించిన డిపార్ట్ మెంట్ ఆడోళ్లను తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టడం మొదలుపెడుతుంది. ఎలాగైనా ఈ దుర్మార్గాన్ని ఆపాలనుకున్న కుమారేశన్ ఏం చేశాడన్నదే అసలు స్టోరీ

విశ్లేషణ

కొందరు దర్శకులు ఏటికీ ఎదురీదుతారు. తాము నమ్మిన సిద్ధాంతాలు, ఎదురుకున్న సంఘటనలు, పుస్తకాలు పేపర్లలో చదివిన దారుణాలను సినిమా మాధ్యమం ద్వారా ప్రపంచానికి చూపించాలని తాపత్రయపడతారు. వాళ్ళలో వెట్రిమారన్ ది ముందువరస. పోలీస్ వ్యవస్థకు నక్సలిజం సిద్ధాంతాలకు జరుగుతున్న యుద్ధం ఇప్పటిది కాదు. దశాబ్దాలుగా వస్తున్నది. అయితే కాల్పుల్లో రెండు వర్గాల వారు చనిపోవడం గురించే విన్నాం కానీ అసలు బయటికే కనిపించని దారుణమైన వాస్తవాలు మరెన్నో ఉన్నాయని ఈ విడుదలలో చూపించే ప్రయత్నం చేశారు వెట్రిమారన్. కేవలం తన ఆలోచనలకే కట్టుబడటంతో కనెక్టివిటీ తగ్గిపోయింది

ఇది ప్రాధమికంగా రెండు వర్గాలకు ప్రతినిధులుగా వ్యవహరించే ఇద్దరి మధ్య సంఘర్షణ. ఒకరు కుమరేశన్ మరొకరు పెరుమాళ్. టైటిల్స్ పడగానే నేరుగా అసలు పాయింట్ లోకి వెళ్ళిపోయిన వెట్రిమారన్ కథా నేపధ్యాన్ని బలంగా రిజిస్టర్ చేసే ఉద్దేశంతో చాలా ఎక్కువ సమయం తీసుకోవడం ఇబ్బంది పెడుతుంది. సూరి డ్యూటీలో చేరాక అక్కడి పోలీసుల మనస్తత్వాలను విప్పి చూపించే సీన్లు ఓపికను డిమాండ్ చేస్తాయి. పైగా ఈ నేటివిటీ మనకు అలవాటున్నది కాదు. ఇలా నిజంగా జరిగిందా అనేలా సన్నివేశాలు వస్తూ పోతుంటాయి. కాంఫ్లిక్ట్ పాయింట్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ దాన్ని నెరేట్ చేసిన తీరు నెమ్మదిగా ఉండటం ఈ సినిమాకున్న మైనస్

చాలా ఏళ్ళ క్రితం కృష్ణవంశీ ఈ అంశాన్ని తన సిందూరంలో చర్చించారు. అయితే ఆయన ఒకవైపే చెప్పలేదు. పోలీసులు నక్సల్స్ ఇద్దరి మధ్య తప్పుందనే పాయింట్ లేవనెత్తి ఆలోచింపజేశారు. ఇప్పుడేదో కల్ట్ అంటాం కానీ అప్పటి ఆడియన్స్ దాన్ని ఫ్లాప్ చేశారు. రేవతి ప్రధాన పాత్ర పోషించిన అంకురంలో ఖాకీ చొక్కాల దాష్టికాన్ని కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరించారు ఉమామహేశ్వరరావు. ఇదీ కమర్షియల్ గా విజయం సాధించలేదు. విడుదల పార్ట్ 1 ఈ రెండింటి మధ్యలో ఉండేందుకు ప్రయత్నించి ఎటూ కాకుండా పోయింది. నత్తనడకన సాగే కథనం వల్ల కామన్ ఆడియన్స్ కి బోర్ కొట్టే ప్రమాదాన్ని వెట్రిమారన్ పసిగట్టలేదు. రాసింది తీసుకుంటూ పోయారు.

ఇది తమిళంలో ఆడిందా లేదానేది మనకనవసరం. సగటు తెలుగు ప్రేక్షకుడు తన అభిరుచులు ఆలోచనల కోణంలో చూస్తాడు కాబట్టి విడుదల పార్ట్ 1 కంటెంట్ తనకు సులభంగా కొరుకుడు పడేదైతే కాదు. ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం పోలీసులు మహిళలను ఘోరంగా
అవమానించారనేది నిజమే కావొచ్చు. కానీ అలాంటి పీడిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు థియేటర్ కొచ్చే జనంలో అతి తక్కువ శాతం ఉన్నప్పుడు ఆ ఘటనలోని ఎమోషన్ మిగిలివాళ్లను తాకే ఛాన్స్ ఉండదు. ఎంత బోల్డ్ గా చూపించినా కళ్ళు పక్కకు తిప్పుకోవాలనిపిస్తుందే తప్ప అయ్యో పాపం అనిపించదు. ఇది కేవలం అరవ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకోవడం వల్ల వచ్చిన చిక్కు

మరో ప్రధాన లోపం విడుదలని రెండు భాగాలుగా ప్లాన్ చేయడం. పార్ట్ 1లో ఉన్న ల్యాగ్ మొత్తం కోసేసి కథని ఒకే సినిమాగా మలచి ఉంటే విసరనై(విచారణ) లాగా విడుదల కూడా ఖచ్చితంగా క్లాసిక్ అయ్యేదేమో. ఇప్పుడా ఛాన్స్ మిస్ అయ్యింది. శుభం కార్డు పడ్డాక సీక్వెల్ లోని కొన్ని కీలక సన్నివేశాలను రివీల్ చేశారు. అవి చూశాక కలిగే ఫీలింగ్ ఇదే. కెజిఎఫ్, బాహుబలి లాగా ఇదేమి కమర్షియల్ గ్రాండియర్ కాదుగా జనం ఎగ్ జైట్ మెంట్ తో ఎదురు చూడడానికి. పైపెచ్చు మిగిలిన భాగం ఏ ఓటిటిలోనో టీవీలోనో చూసుకుందామనే భావన కలుగుతుందే తప్ప అధిక శాతం మళ్ళీ థియేటర్లకొచ్చి చూద్దామనే జస్టిఫికేషన్ వెట్రిమారన్ చేయలేకపోయారు

నటీనటులు

హీరోల పక్కన సైడ్ కమెడియన్ గా నవ్వించే సూరి ఇందులో కుమరేశన్ పాత్రలో పరకాయప్రవేశం చేశాడు. ఎక్కడ పిసరంతైనా నవ్వు లేకుండా సీరియస్ హావభావాలతో కట్టిపడేశాడు. డీ గ్లామర్ పాత్రలో భవాని శ్రీ చాలా సహజంగా మెప్పించింది. విజయ్ సేతుపతిని పార్ట్ 2 కోసం దాచారు కాబట్టి ఉన్న కాసింత సేపు హడావిడి చేసి వెళ్లిపోయారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ క్యారెక్టర్ చాలా కీలకం కావడం వల్ల ఆయన కన్నా మంచి ఆర్టిస్ట్ పడుంటే బాగుండేది. స్టేట్ సిఎస్ గా రాజీవ్ మీనన్ పర్ఫెక్ట్. చేతన్, బాలాజీ శక్తివేల్, ఇళవరసు, శరవణ సుబ్బయ్య, మున్నార్ రమేష్, తమిజ్, నవగీతన్, అసురన్ కృష్ణ తదితరులంతా తమకిచ్చిన క్యారెక్టర్లకు తగ్గట్టు చేసుకుంటూ పోయారు

సాంకేతిక వర్గం

ఇళయరాజా సంగీతం విడుదలలో కొంతవరకు ఆయువుపట్టుగా నిలిచింది. ఒరిజినల్ వెర్షన్ లో రెండు పాటలు మెలోడీగా అనిపించాయి కానీ డబ్బింగ్ క్వాలిటీ వల్లనేమో ఇక్కడ ఆ ఫీల్ రాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ క్లైమాక్స్ భాగాన్ని బాగా ఎలివేట్ చేసింది కానీ చాలా చోట్ల ఆయన రేంజ్ అవుట్ ఫుట్ లేదు. ఆర్ వేల్ రాజ్ ఛాయాగ్రహణంను మెచ్చుకోవాలి. ఇరుకైన అడవి దారులలో రిస్కీ ఎపిసోడ్లను, ఒకే చోట అటుఇటు తిరిగే సీన్లను చక్కగా ప్రెజెంట్ చేశారు. ఎడిటింగ్ ఇంకొంచెం చురుకుగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తం అవుట్ డోరే అయినా ప్రొడక్షన్ వేల్యూస్ చీప్ గా అనిపించవు. ఖర్చు పెట్టిన విషయం తెరమీద కనిపిస్తుంది

ప్లస్ పాయింట్స్

సూరి నటన
క్లైమాక్స్ ఎపిసోడ్

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్
ఓవరనిపించే పోలీసు హింస
బోల్డ్ సన్నివేశాలు
నేటివిటీ

ఫినిషింగ్ టచ్ : స్వేచ్ఛ కోసం యుద్ధం

రేటింగ్ : 2.75 / 5

This post was last modified on April 15, 2023 9:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

26 minutes ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

2 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

2 hours ago

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

3 hours ago

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

4 hours ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

5 hours ago