Movie Reviews

సమీక్ష – Writer పద్మభూషణ్

అసలే చిన్న సినిమా. పైగా ఓటిటి పాపులారిటీ తప్ప థియేటర్ పరంగా పెద్దగా గుర్తింపు లేని హీరో. అలాంటి మూవీతో జనాన్ని కదిలించాలంటే అంత సులభం కాదు. అందుకే రైటర్ పద్మభూషణ్ మీద అసలే అంచనాలు లేని స్టేజి నుంచి ప్రీమియర్లకు హౌస్ ఫుల్స్ పడే దాకా నిర్మాణ సంస్థ అమలు పరిచిన మార్కెటింగ్ ప్రణాళిక ఓపెనింగ్స్ పరంగా మంచి ఫలితాన్నే ఇచ్చింది. జాతీయ అవార్డు సాధించిన కలర్ ఫోటోతో సోలో హీరోగా పరిచయమైన సుహాస్ కి ఈ సినిమా ఒకరకంగా పరీక్ష లాంటిది. ఇందులో నెగ్గితేనే రాబోయే వాటికి బిజినెస్ బాగా జరుగుతుంది. హైప్ ఏమో కానీ ట్రైలర్ తోనే ఫ్యామిలీ ఎంటర్ టైనరనే ఫీలింగ్ కలిగించారు

విజయవాడలో అసిస్టెంట్ లైబ్రేరియన్ గా ఉద్యోగం చేసే పద్మభూషణ్(సుహాస్)కు పుస్తకాలంటే పిచ్చి. రచయితగా పేరు తెచ్చుకోవాలని అమ్మానాన్నలకు చెప్పకుండా స్వంతంగా నాలుగు లక్షలు ఖర్చు పెట్టి బుక్కు అచ్చేసుకుంటే అవి అమ్ముడుపోక అప్పులు తీర్చే మార్గం కోసం వెతుకుతుంటాడు. మరదలు సారిక(టీనా శిల్పరాజ్) పరిచయం అయ్యాక హఠాత్తుగా పాపులర్ రైటర్ అయిపోతాడు. వీళ్ళ పెళ్లి దగ్గర పడుతున్న టైంలో హఠాత్తుగా కన్నా(శ్రీగౌరీ) ఇచ్చిన ఎంట్రీ వల్ల కొత్త ట్విస్టులు వచ్చి పడతాయి. అదే అసలు స్టోరీ.

మధ్యతరగతి నేపధ్యాలను సరిగా వాడుకోవాలే కానీ అధిక శాతం ప్రేక్షకులకు వేగంగా కనెక్ట్ అవుతాయి. స్టార్లందరూ మల్టీ మిలియనీర్లుగా కంపెనీ సిఈఓలుగా ఎక్కువగా కనిపించే ట్రెండ్ లో ఆడియన్స్ తమను తాము ఎక్కువగా ఐడెంటిఫై చేసుకుంది మిడిల్ క్లాస్ కథల్లోనే. అందుకే పద్మభూషణ్ తో ప్రయాణం మొదలుపెట్టిన కాసేపటికే మనలో ఒకడు అనిపిస్తాడు. అతనింట్లో అమ్మానాన్నలో మన తల్లితండ్రులు కనిపిస్తారు. ఈ మెంటాలిటిని బాగా ఒంటబట్టించుకున్న దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ ఎక్కువ ఆర్భాటం చేయకుండా శేఖర్ కమ్ముల స్టైల్ ని అనుకరిస్తూ వీలైనంత సింపుల్ గా క్లీన్ కామెడీతో రాసుకోవడం ఈ సినిమాకున్న అతి పెద్ద ప్లస్ పాయింట్.

పుస్తకాలు చదివే వాళ్లే కరువవుతున్న ట్రెండ్ లో వాటిని రాయాలని తాపత్రయపడే ఓ యువకుడి చుట్టూ కథ అల్లుకోవడం బాగుంది. స్మార్ట్ ఫోన్లలో అస్తమానం మునిగి తేలే టీనేజ్ బ్యాచ్ కి ఈ వ్యవహారం కొంత నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు కానీ బయట నిజంగానే ఇలాంటి రచయితలు బోలెడున్నారు. డబ్బులు లేక కొందరు, పబ్లిషర్లు దొరక్క మరికొందరు గుట్టల కొద్దీ పేపర్లు ఎప్పుడు ప్రింటింగ్ కు వెళ్తాయనే ఆశతో ఎదురు చూస్తున్న వారు ఎందరో. ఈ బాధనే బ్యాక్ గ్రౌండ్ గా ఎంచుకున్న షణ్ముఖ దానికి మదర్ సెంటిమెంట్, ఫాదర్ ఎమోషన్ జోడించి ఒక ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ ఇవ్వాలనే ప్రయత్నం గట్టిగానే చేశారు. ఓ మోస్తరుగా విజయం సాధించాడు కూడా.

సినిమా మొత్తం ఈ థ్రెడ్ మీద నడిపిస్తే పద్మభూషణ్ పడే కష్టాలు, ఎదురుకున్న అవమానాలు, నాటకీయ మలుపులు ఇలా బోలెడు స్కోప్ ఉండేది. ఫస్ట్ ఫ్రేమ్ లోనే ఇతనో గొప్ప రైటర్, కాకపోతే టైం కలిసిరాక కష్టపడుతున్నాడని రిజిస్టర్ చేసిన దర్శకుడు ఆ తర్వాత కథా క్రమాన్ని పూర్తిగా ఇంకో డైవెర్షన్ లోకి తీసుకెళ్లిపోవడంతో సుహాస్ క్యారెక్టరైజేషన్ లోని గొప్పదనం తగ్గుతూ వెళ్ళిపోయింది. అసలు ట్విస్టుని ఇక్కడ రివీల్ చేయడం భావ్యం కాదు కానీ ఆ కీలకమైన అంశాన్ని క్లైమాక్స్ లో ఎలివేట్ చేయడం కోసం సెకండ్ హాఫ్ లో రెండో హీరోయిన్ చుట్టూ అల్లుకున్న ఎపిసోడ్ అంత సహజంగా అనిపించదు. పైగా అది టైం ఫిల్లింగ్ కోసం చేసిన ఫీలింగ్ ఇస్తుంది

తనకు విపరీతమైన పాపులారిటీ వచ్చాక పద్మభూషణ్ అసలు వ్యక్తి కోసం పడే టెన్షన్, ఇంటర్వెల్ బ్లాక్ లో చూపించే మలుపు ఇవన్నీ సెకండ్ హాఫ్ కి సరిపడా ఇంటరెస్ట్ ని సృష్టించాయి. దానికి ముందు వచ్చే సీన్లలో థియేటర్ కామెడీ బాగా పేలింది. యూత్ ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్ సెలూన్ తాలూకు సింపుల్ జోక్స్ తో ఓ మోస్తరుగా నవ్విస్తారు. పగలబడి కాకపోయినా పెదవి మీద అలా చిరునవ్వు వచ్చేలా చేయడంలో తెరవెనుక రైటర్ ఫెయిల్ కాలేదు. ఇదే జోష్ పద్మభూషణ్ లక్ష్యం ఏమిటో చెప్పేశాక కొనసాగించి ఉంటే స్థాయి ఇంకా పెరిగేది. చివరి ఘట్టంలో హెవీ ఎమోషన్, మెసేజ్ ప్లాన్ చేసుకున్నప్పుడు దానికి తగ్గ లింకులు కంటిన్యూగా వస్తూనే ఉండాలి

హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ నీట్ గా చక్కని పాటలతో ఆహ్లాదకరంగా నడిపించారు. అయితే పద్మభూషణ్ ఏదో సాధిస్తాడని మనతో చప్పట్లు కొట్టిస్తాడని ఆశిస్తాం కానీ చివర్లో జరిగేది ఊహాతీతంగా సాగుతుంది. బుక్ లాంచ్ కి అసలు మలుపుకి ముడిపెట్టి బరువుగా డిజైన్ చేయడంతో ఫ్యామిలీ జనాలకు నచ్చే అవకాశాలున్నాయి. సినిమా ఫలితాన్ని శాశించే కీలక అంశాల్లో ఇదే పెద్ద స్థానం తీసుకుంటుంది. పద్మభూషణ్ కు ఒక బుక్కు రాసి దాన్ని అచ్చు వేయించే తెలివితేటలు ఉన్నప్పుడు మధ్యలో పూర్తి బేలగా మారిపోయి ఇతరుల మీద విపరీతంగా ఆధారపడటం అంత కన్విసింగ్ గా లేదు. అయినప్పటికీ ఆర్టిస్టుల టైమింగ్స్ ఇలాంటి లోపాలను కవర్ చేశాయి

సుహాస్ నటనపరంగా బాగా మెరుగవుతున్నాడు. కొందరు తొందరపడి విజయ్ సేతుపతితో పోల్చేస్తున్నారు కానీ సరైన అవకాశాలు పడితే ఆ రేంజ్ కి చేరుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. హడావిడి లేని ఎక్స్ ప్రెషన్లతో పాటు చక్కని కామెడీతో మెప్పించాడు. టీనా శిల్పరాజ్ పాత్ర కోరిన పెర్ఫార్మన్స్ ని ఇచ్చింది. శ్రీగౌరీ ప్రియా అందంగా ఉన్నా నప్పలేదు. ఆశిష్ విద్యార్ధి చాలా గ్యాప్ తర్వాత దొరికిన హోమ్లీ ఫాదర్ పాత్రలో చెలరేగిపోయారు. రోహిణి మరోసారి బెస్ట్ ఇచ్చారు. అమ్మగా పర్ఫెక్ట్ ఛాయస్. ఫ్రెండ్ గా ప్రవీణ్ కఠారి, గోపరాజు రమణ, రామకృష్ణ తదితరులు చిన్న చిన్న పాత్రల్లోనూ చక్కగా ఒదిగిపోయారు.మిస్ క్యాస్టింగ్ జరగలేదు.

శేఖర్ చంద్ర పాటలు శ్రవణానికి వీక్షణానికి ఇబ్బంది లేకుండా సాగాయి. మళ్ళీ మళ్ళీ వినాలపించే ఆడియో కాకపోయినా ఒకటి రెండు పాటలు స్లో పాయిజన్ లా ఎక్కేస్తాయి. కళ్యాణ్ నాయక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కువ సౌండ్ లేకుండా నీట్ గా సాగింది. థీమ్ ని క్యారీ చేయడంలో బాగా ఉపయోగపడింది. వెంకట్ ఆర్ శాఖమూరి ఛాయాగ్రహణంలో లోపాలేం లేవు. ఉన్నంతలో మంచి క్వాలిటీని చూపించారు. కోదాటి పవన్ కళ్యాణ్ – సిద్దార్థ్ తాతోలు ఎడిటింగ్ లో రన్ టైం వీలైనంత క్రిస్పీగానే ఉంది. ఎక్కువ రిస్క్ లేకుండా అవసరం మేరకే ఖర్చు పెట్టడంతో అక్కడక్కడా రాజీపడిన దాఖలాలు కనిపించినా ఛాయ్ బిస్కెట్ టీమ్ ప్రొడక్షన్ వేల్యూస్ ఓకే.

ప్లస్ పాయింట్స్

సుహాస్ నటన
క్లీన్ కామెడీ
స్టోరీ పాయింట్
క్లైమాక్స్ ఎమోషన్

మైనస్ పాయింట్స్

మధ్యలో కొంత డీవియేషన్
హీరో క్యారెక్టరైజేషన్ లోపాలు
సెకండ్ హీరోయిన్ ట్రాక్

ఫినిషింగ్ టచ్ – రైటర్ పాసయ్యాడు

రేటింగ్ : 2.75 / 5

This post was last modified on February 3, 2023 11:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

45 minutes ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

1 hour ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

1 hour ago

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

2 hours ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

2 hours ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

2 hours ago