Movie Reviews

సమీక్ష – వారసుడు

ఒకానొక కాలంలో చిన్నపిల్లలను బుజ్జగించడానికి అందనంత ఎత్తులో ఉన్న చందమామని చూపిస్తూ తల్లులు తమ పిల్లలకు అన్నం తినిపించేవారు. అందరు మదర్స్ చెప్పే కథ ఒకటే. ఇప్పుడు టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్ లో యుట్యూబ్ రైమ్స్ చూపించే సౌలభ్యం వచ్చాక ఇది మారిపోయింది లెండి. కానీ స్టార్ హీరోలకు సినిమా కథలను చెప్పే పద్దతిలో కొందరు దర్శకులు మొదటి విధానాన్నే ఇప్పటికీ పాటిస్తున్నారనిపిస్తుంది. దిల్ రాజు నిర్మాత కావడం వల్ల థియేటర్ల పంపకాల విషయంలో ముందు నుంచి వివాదాలకు బిందువుగా నిలిచిన వారసుడు ఇవాళ థియేటర్లలో అడుగుపెట్టింది.

రాజేంద్ర(శరత్ కుమార్)ది అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యం. ఇద్దరు కొడుకులు ఆయనకు అండగా ఉంటూ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటే మూడో వాడు(విజయ్) నాకిష్టమొచ్చిన లైఫ్ బ్రతుకుతానంటూ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. గుంటకాడ నక్కలా ఎదురు చూస్తున్న శత్రువు జెపి(ప్రకాష్ రాజ్) రకరకాల కుట్రలు చేస్తుంటాడు. పరిస్థితి చేయి దాటి పోతున్నప్పుడు విజయ్ ఎంట్రీ ఇస్తాడు. తండ్రి ఇచ్చిన బాధ్యతను తీసుకుని అన్నయ్యలకు బుద్ది చెప్పడంతో పాటు కుటుంబాన్ని ఎలా నిలబెట్టాడనేదే ఇందులో కథ.

అదేంటి మొత్తం చెప్పేశాం అనుకోకండి. ట్రైలర్ లో చూపించింది ఫైనల్ గా వారసుడులో ఉన్నదీ ఇదే. ఒక మల్టీ మిలియనీర్ ఫ్యామిలీలో తలెత్తే అలజడులను హీరో సరిచేసే సినిమాలు కొన్ని వందలు వచ్చాయి. అయినా తిరిగి ఇదే పాయింట్ ని తీసుకుని దర్శకుడు వంశీ పైడిపల్లి కొత్తగా రాసుకున్నానని ఫీలవ్వడం అస్సలు అర్థం కాని విషయం. టైటిల్ కార్డుతో మొదలుపెట్టి క్లైమాక్స్ దాకా ఏ సీనూ ఫ్రెష్ గా అనిపించదు. ఎవరూ పాత కథలు తీసుకోవడం లేదాని విజయ్ అభిమానులు అడగొచ్చు. నిజమే. అందులో తప్పేం లేదు. అయితే కనీసం రైటింగ్ లో ట్రీట్ మెంట్లో వైవిధ్యం ఉంటే సబ్జెక్టు ఎంత రొటీన్ గా ఉన్నా ఆడియన్స్ క్షమించి హిట్ చేస్తారు.

మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ అంటూ విడివిడిగా ఉండరు. మెప్పించేలా చెబితే ఇద్దరూ ఆదరించిన బ్లాక్ బస్టర్లు ఎన్నో ఉన్నాయి. అత్తారింటికి దారేది, డార్లింగ్ లాంటి వాటిలో మసాలాలు, ఫైట్లు, ఆహ్లాదపరిచే పాటలు అన్నీ ఉంటాయి. అంతదాకా ఎందుకు ఇదే వంశీ పైడిపల్లి తీసిన బృందావనంలో అద్భుతమైన ఎమోషన్స్ పడ్డాయి. అవి క్లిక్ అవ్వడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో సైతం కుటుంబాలకు దగ్గరయ్యాడు. మహర్షిలో ఇవి బ్యాలన్స్ అయినందుకే కోట్ల వసూళ్లు వచ్చి పడ్డాయి. వారసుడు తమిళ జనాలకు నచ్చుతుందా లేదా అనే కోణం మనకనవసరం. ఎన్నో డబ్బింగులను ఆదరించిన తెలుగు జనాలకు నచ్చుతుందా లేదా అనేదే కీలకం

సరే కొత్తదో పాతదో ఏదోకటి వంశీ చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే. ఉమ్మడి కుటుంబంలో ఏ లోపాలు లేకుండా ఎవరూ ఉండరు, వాటిని అర్థం చేసుకుని సర్దుకుంటూ జీవితం గడపితేనే అసలైన ఆనందం. వారసుడులో మెసేజ్ ఇదే. స్టార్ హీరోతో చేయాలనుకున్నాడు కాబట్టి వంశీ కావాల్సిన కమర్షియల్ హంగులన్నీ ఇందులోనూ జోడించాడు. కానీ అసలైన ఎమోషన్స్, క్యారెక్టరైజేషన్స్ విషయంలో తడబడ్డాడు. దాదాపు ముప్పాతిక శాతం సినిమా ఖరీదైన హీరో ఇంట్లోనే జరుగుతుంది. లేదా మహా అంటే చైర్మన్ రూమ్ కు షిఫ్ట్ అవుతుంది. ఓ మూడు ఫైట్లలో అవుట్ డోర్ దర్శనం ఉంటుంది. ఇంతకు మించి లొకేషన్లు కనిపించవు.

విజయ్ ఉంటే చాలు మిగతా అంశాలు ఎలా ఉన్నా పాస్ అయిపోతాయనుకున్న వంశీ తెలుగు ఆడియన్స్ ని కూడా దృష్టిలో పెట్టుకుని ఉంటే బాగుండేది. అధిక శాతం సీన్లు గతంలో చూసినట్టే అనిపిస్తాయి. ఒకసారి వెంకటేష్ లక్ష్మి గుర్తుకువస్తే మరోసారి జగపతిబాబు ఆహా ఫ్లాష్ అవుతుంది. అలా మైండ్ లో పోలికలు తిరుగుతుండగానే శ్రీమంతుడు, అన్నయ్య, గౌతమ్ ఎస్ఎస్సి ఇలా క్యూ కట్టి ఒక్కొక్కటిగా హయ్ చెబుతూ వెళ్తాయి. ఇంత అంతర్మథనం జరిగితే ఫ్రెష్ గా ఏదో చూసిన ఫీలింగ్ ఎందుకు కలుగుతుంది. పైగా ప్రకాష్ రాజ్ లాంటి ఆర్టిస్టులను ఏళ్ళ తరబడి అరిగిపోయిన ఫార్ములా విలన్ పాత్రలకు పదే పదే తీసుకుంటే ఇంకేం చెబుతాం

ఇప్పుడున్న పరిస్థితిలో ప్రేక్షకులను ఓపిగ్గా థియేటర్లో కూర్చోబెట్టడం పెద్ద సవాల్. అలాంటిది వారసుడుని మూడు గంటలకు దగ్గరగా తీసుకెళ్లడం కూడా మైనస్సే. ఏం జరుగుతుందో ఈజీగా ఊహించగలిగిలా కథా కథనాలు వెళ్తున్నప్పుడు ఎగ్జైట్ చేసే విషయాలు లేనప్పుడు ఆటోమేటిక్ గా చూసేవాళ్లకు బోర్ కొట్టడం మొదలవుతుంది. పైగా విజయ్ టాలీవుడ్ లో రజనీకాంత్ లాగా భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ కాదు. అలాంటప్పుడు అతను చేసే విన్యాసాలు మన కంటికి ఆనవు. అన్నదమ్ములను డమ్మీ చేసినంత మాత్రాన తమ్ముడు బాహుబలి రేంజ్ లో హీరో అయిపోడుగా.

స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా విజయ్ బాగున్నాడు. మహేష్ బాబు లాగే వయసు పెరుగుతున్నా మొహంలో ఛార్మ్ ని బాగా మైంటైన్ చేస్తున్నాడు. డాన్స్ మాత్రం తిప్పి తిప్పి అవే స్టెప్పులు రిపీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. రష్మిక మందన్న పాటల కోసమే కానీ ఇంకెందుకు ఉపయోగపడలేదు. శరత్ కుమార్ కో జబ్బు ట్విస్ట్ పెట్టారు కానీ ఆయన ఫస్ట్ ఫ్రేమ్ నుంచే జబ్బు పడిన మనిషిలా కనిపించారు. జయసుధ, సుమన్, జై, శ్రీకాంత్ ఇలా క్యాస్టింగ్ లో మంచి తారాగణమే ఉన్నా ప్లాట్ వీక్ గా ఉండటంతో ఎవరూ ప్రత్యేకంగా రిజిస్టర్ కాలేకపోయారు.

తమన్ సంగీతంలో రంజితమే ఒకటే మంచి హుషారుగా సాగుతుంది. మిగిలినవి సోసోనే. విజువల్ గా గ్రాండ్ గా తీయడంతో చూస్తాం కానీ ఆడియో వీకే. బీజీఎమ్ కు మంచి స్కోరే ఇచ్చిన ఎలివేషన్లున్న కమర్షియల్ మూవీ కాకపోవడంతో తన వైపు నుంచి అద్భుతాలు చేసే అవకాశం లేకుండా పోయింది. కార్తీక్ పళని ఛాయాగ్రహణం బాగుంది. కెఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ మాత్రం నిందలకు గురవుతుంది. ట్రిమ్ చేసే స్కోప్ చాలా ఉన్నా ఎందుకు మొహమాటపడ్డారో. దిల్ రాజు నిర్మాణ విలువలు తెలివిగా సాగాయి. ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ డిమాండ్ చేసే ఇలాంటి వాటికి రెమ్యునరేషన్ల ఖర్చే ఎక్కువ

ప్లస్ పాయింట్స్

విజయ్ మ్యానరిజం
రంజితమే పాట
రెండు ఫైట్లు 

మైనస్ పాయింట్స్

రొటీన్ స్టోరీ
సుదీర్ఘమైన నిడివి
చప్పగా సాగే మలుపులు
సింక్ అవ్వని ఎమోషన్

ఫినిషింగ్ టచ్ – పాతకాలం వారసుడు

రేటింగ్ : 2/5

This post was last modified on January 15, 2023 1:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

1 hour ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

2 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

2 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

3 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

4 hours ago