2.25/5
2 Hrs 25 Mins | Action | 29-10-2021
Cast - Akash Puri, Ketika Sharma, Ramya Krishna, Uttej and others
Director - Anil Paduri
Producer - Puri Jagannadh, Charmme
Banner - Puni Connects
Music - Sunil Kashyap
రెగ్యులర్ సినిమా ఆడియన్స్ కు కొన్ని డీఫాల్ట్ ఒపీనియన్స్ వుంటాయి. సినిమా ఎలా వున్నా పూరి, ఆర్జీవీ లాంటి వాళ్ల సినిమాలు చూడాలి. చూసేసి కావాలంటే అప్పుడు తిట్టేసుకోవాలి. అంతే తప్ప చూడకుండా వుండలేరు. ఆర్జీవీ మీద ఇలాంటి ఒపీనియన్ ఇప్పుడిప్పుడే మాయం అవుతోంది. కానీ దర్శకుడు పూరి జగన్నాధ్ ఆ విషయంలో కొంత లక్కీనే. ఇంకా ఆయన పెన్నులో తడి ఆరిపోలేదు. వైవిధ్యమైన ఆలోచనా ధోరణి, జీవితాన్ని ఇలా కూడా చూడొచ్చా..ఆలోచించొచ్చా అనే భావన ఆయన మాటల్లో వినిపిస్తూనే వుంటాయి. అందుకే పూరి ప్యాడ్ కాస్ట్ అడియోలకు అంత ఆదరణ.
తన తరహా చిత్రీకరణ, తన స్టయిల్ మాటలు, యూత్ కు నచ్చే కాంటెంపరరీ పాటలు వీటిని నమ్ముకుని పూరి తనే కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ, అనిల్ అనే కొత్త దర్శకుడితో రూపొందించిన సినిమా ‘రొమాంటిక్’. ఇస్మార్ట్ శంకర్ టైమ్ లో ప్రారంభమైన సినిమా ఇది. కరోనా కారణంగా ఆలస్యమై ఇప్పుడు విడుదలయింది. పూరి తనయుడు ఆకాష్ హీరో. కేతిక శర్మ హీరోయిన్.
గోవా నేపథ్యంలో సాగే కథ ఇది. ఎలా సంపాదించామన్నది ముఖ్యం కాదు, సంపాదించడమే లక్ష్యం. ఆ లక్ష్యం వెనుక కూడా ఓ ఆశయం వున్న కుర్రాడు వాస్కోడిగామా (ఆకాష్). చిన్నవయసులోనే దారి తప్ప డ్రగ్స్ స్మగ్లర్ గా మారతాడు. జీవితం మీద పెద్దగా ప్రేమ వుండదు. కానీ ఓ అమ్మాయి మోన (కేతికశర్మ) ను చూసి ప్రేమలో పడతాడు. కానీ అది ప్రేమగా గుర్తించడు. మోహంగా భావిస్తాడు. ముందు విముఖత చూపించినా ఆ అమ్మాయి కూడా ఇతగాడి మోహంలో పడుతుంది. ఇదిలా వుంటే గోవాలో స్మగ్లర్లను ఏరి పారేసేందుకు రంగంలోకి దిగుతుంది ఎసిపి రమ్య (రమ్యకృష్ణ). ఆమెతో వాస్కోడీగామాకు యుద్దం మొదలవుతుంది. అప్పుడేం జరిగింది అన్నది మిగిలిన సినిమా.
దర్శకుడు పూరి జగన్నాధ్ కు ఓ నమ్మకం వుంది. మాస్ జనాలకు సరైన పాటలు, డైలాగులు, ఫైట్లు పడితే చాలు మాస్ జనాలు సినిమాకు ఎగబడి వస్తారని. పైసా వసూల్ కు ఆ మాత్రం చాలని విశ్వాసం. అందుకే కథ గురించి పెద్దగా పట్టించుకోరు. సీన్లు రిపీట్ అయినా ఏమీ అనుకోరు. రొమాంటిక్ అచ్చంగా ఇలాంటి సినిమానే. సినిమా కథ కొత్తదేమీ కాదు. గతంలో చూసిన అనేకానేక పూరి సినిమాలు మిక్సీలో వేసి రుబ్బేసిన కథనే. అలా అని కథనం కూడా కొత్తదేం కాదు. బిజినెస్ మన్, పోకిరి సినిమాలు గుర్తుకు తెచ్చే సీన్లు అనేకం వున్నాయి. విశ్రాంతికి ముందు వచ్చే సీన్ అచ్చంగా పోకిరి సినిమాను గుర్తుకు తెస్తుంది.
సినిమా ద్వితీయార్థం లో ఈ రిపీట్ సీన్ల సమస్య కాస్త తక్కువే. పైగా కథ కూడా మలిసగంలోనే వుంటుంది. అందువల్ల తొలిసగం కన్నా మలిసగం బాగుంది అనే ఫీల్ కలుగుతుంది. మలిసగంలో కూడా కథ ఎక్కువగా లేకపోవడంతో వీలయినంత వరకు పాటలు, సీన్లతో నడిపి, క్లయిమాక్స్ కు తీసుకువచ్చారు. క్లయిమాక్స్ పండడంతో సినిమా పాస్ అయిపోయింది అనిపించేసుకుంటుంది.
క్రిటిక్ యాంగిల్ లో చూస్తే ఏముంది సినిమాలో. అంతా కలగూరగంప అనిపిస్తుంది. కానీ మాస్ ఆడియన్ యాంగిల్ లో పూరి మార్కు డైలాగులు, పూరి మార్కు హీరోయిన్ అందాల ఆరబోత, ఒకటి రెండు మంచి పాటలు ఇవి చాలు. సినిమాను రెండు గంటల పాటు చూసి ఎంజాయ్ చేసేయడానికి. సినిమా మొత్తం గన్స్, డ్రగ్ కల్చర్ నడుమ ఓ రగ్డ్ లవ్ స్టోరీని ఇమిడ్చినట్లు కనిపిస్తుంది. అది మాస్ కు నచ్చే అంశమే.
సినిమాలో హీరో ఆకాష్ పూరి కాస్త మంచి నటనే కనబర్చాడు. వయసు తక్కువే అయినా, ఇంకా లేత మొహమే అయినా, నటన విషయంలో మాత్రం బాగానే మార్కులు సంపాదించాడు. క్లయిమాక్స్ లో మంచి నటన కనబర్చాడు. హీరోయిన్ కేతిక శర్మ అందాలు మామూలుగా పట్టుకోవు మాస్ ను. రమ్యకృష్ణ జస్ట్ ఓకె.
సునీల్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్, రెండు మూడు పాటలు ప్లస్ అయ్యాయి. పూరి జగన్నాధ్ మాటలు కూడా క్లిక్ అయ్యాయి. వీటన్నింటికి తోడు మాంచి కథ పడి వుంటే సినిమా మరో లెవెల్ లో వుండి డైరక్టర్ అనిల్ కు కూడా పేరు వచ్చేది.
ప్లస్ పాయింట్లు
డైలాగులు
పాటలు
క్లయిమాక్స్
మైనస్ పాయింట్లు
రెగ్యులర్ ఫార్మాట్ స్టోరీ
ఫినిషింగ్ టచ్: రొమాన్స్ బిట్వీన్ డ్రగ్స్ అండ్ వెపన్స్
Rating: 2.25/5
Gulte Telugu Telugu Political and Movie News Updates