2.25/5
2 Hr 18 Mins | Comedy/Romantic | 14-08-2021
Cast - Vishwak Sen, Nivetha Pethuraj, Murali Sharma, Simran Choudary, Megha Lekha
Director - Naresh Kuppili
Producer - Dil Raju
Banner - Sri Venkateswara Creations
Music - Radhan
ప్రేమ-పిచ్చి ఒకటే అని వెనకటికి ఎవరో కవి అనేసి వుండొచ్చు. అంతమాత్రం చేత ప్రేమ కథను పిచ్చి కథగా మార్చి తీయనక్కరలేదు. బంగారం మీద మోజు వుండొచ్చు. అది ఎక్కడ దొరుకుతుందో అని కనిపించిన ప్రతి బురదలోనూ పడి దొర్లనక్కరలేదు. అప్పుడు ‘పిచ్చి అంటారండీ..పిచ్చి అంటారు దాన్ని’ అనే డైలాగు గుర్తు చేసుకోవాలి. తల్లిలా ప్రేమించే అమ్మాయి కావాలి. మనం ప్రేమిస్తే వాళ్లూ ప్రేమిస్తారు. ఇంత వరకు వ్యవహారం బాగానే వుంది. కానీ అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది. అసలు మనను ప్రేమించేవాళ్లు ఎక్కడ వుండారు అని కనిపించిన ప్రతి బస్ స్టాప్ లో, ప్రతి ఊళ్లో వెదికే పాయింట్ కథను అల్లుకోవడం దగ్గరే అసలు మైనస్ వుంది.
ఇదంతా ఈవారం విడుదలైన పాగల్ సినిమా సంగతే. హీరో (విష్వక్ సేన్) చిన్నప్పుడు తల్లి ప్రేమ ఏమిటో చూసిన వాడు. కానీ అంతలోనే దానికి దూరమైన వాడు. పెరిగిన తరువాత తనను తల్లిలా ప్రేమించే అమ్మాయి కోసం వెదకడం మొదలెడతాడు. కానీ వెదుకులాట ఎలా వుంటుందీ అంటే అమ్మాయి అనే దాని కోసం వెంపర్లాడిపోయినట్లు వుంటుంది. కరువెత్తినట్లు, మొహం వాచిపోయినట్లు వుంటుంది. అందుకోసం ఊళ్లూ పూళ్లూ పట్టుకుని తిరిగేయడం అంటే ఏమనుకోవాలి? అసలు కనీసపు లోకజ్ఞానం లేదనుకోవాలా? కానీ టైటిల్ కు తగినట్లు పాగల్ అనుకోవాలా?
సరే ఈ వెంపర్లాట సరదాగా సినిమా కు వచ్చే కుర్రకారుకు మజాగా వుండొచ్చు. కానీ ఆ తరువాత ఏదో ఓ పాయింట్ లో దానికి బ్రేక్ వేయాలి కదా, కథ టర్నింగ్ తీసుకోవాలి కదా? అదయినా సరిగ్గా వుండాలి కదా? అక్కడ కూడా పాగల్ వ్యవహారం అయితే ఎలా? అసలు సిసలు ప్రేమ (నివేదా)దోరికిన తరువాత కూడా పాగల్ వ్యవహారంలాగే వుంటుంది అంతా.
హీరో ప్రేమ కోసం అంతలా వెంప్లర్లాడిపోవడానికి బేస్ ను బాగానే తయారు చేసుకున్నారు. తల్లి (భూమిక) పాత్రను ఎస్టాబ్లిష్ చేసి, బేస్ బలంగానే వుందనిపించారు. కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేసే క్రమంలో ఫన్ బాగానే పండించుకున్నారు. కానీ కనిపించిన ప్రతి అమ్మాయి అచ్చం తన అమ్మలా తనను చూసుకుంటుందని హీరో ఎలా డిసైడ్ అవుతాడన్నది మళ్లీ అంత పద్దతిగా వుండదు. ఇక ఈ క్రమంలో పోలిటికల్ లీడర్ (మురళీశర్మ) తో ప్రేమ అనే వ్యవహారం మరీ పరాకాష్టకు చేరుకుంటుంది. ఆఫ్ కోర్స్ దానికి సినిమా కథతో లింక్, వుందని, అది తరువాత చూపిస్తామని, అందుకే ఈ ఫౌండేషన్ అంతా అని దర్శకుడు అంటే అనొచ్చు. కానీ అదే బేస్ లేదా అదే ఫౌండేషన్ ను హీరోయిన్ విషయంలో తండ్రి తీసుకున్న నిర్ణయానికి ఎందుకు వాడలేదు?
సరే స్క్రిప్ట్ లో డొల్లతనం సంగతి అలా వుంచితే, అనుకున్న స్క్రిప్ట్ ను తెరపైకి తీసుకురావడంలో కూడా తేడా జరిగింది. సినిమా ఎత్తుగడ నుంచి విశ్రాంతికి ఇరవై నిమషాల ముందు వరకు బాగానే నడుస్తోంది సినిమా అనిపిస్తుంది. కానీ అక్కడ నుంచి మురళీశర్మ ఎపిసోడ్ ప్రారంభమై పిచ్చి పీక్స్ కు వెళ్లిపోతుంది. నవ్వు పుట్టకపోగా, వెగటుగా అనిపిస్తుంది. బోర్ గా ఫీలవ్వాల్సి వస్తుంది. అలాంటి ఎపిసోడ్ కు ఇంటర్వెల్ బ్యాంగ్ తో చిన్న క్యూరియాసిటీని జనరేట్ చేసే ప్రయత్నం జరిగింది.
విశ్రాంతి తరువాత అసలు సిసలు ప్రేమకథ మొదలవుతుంది. కానీ హీరోయిన్ (నివేదా) ఫేస్ లో ఎక్స్ ప్రెషన్లు, లుక్స్ అన్నీ యావరేజ్ గా వుండడంతో, ఇప్పటి వరకు కిందా మీదా పడిపోయి మరీ పట్టుకున్న అమ్మాయి ఈమేనా అనిపించేస్తుంది. అక్కడ కాస్త ఇంకా మంచి కాస్టింగ్ దొరికి వుంటే వేరుగా వుండేదేమో? ఆ ప్రేమ ఎపిసోడ్ చివరిలో హీరోయిన్ ఇంటి దగ్గర సీన్లు ఏమాయచేసావె సినిమాలో సమంత-చైతూల సీన్ ను గుర్తుకు తెస్తాయి. ఆ వ్యవహారం కాస్తా ముగిసాక, అనుకున్న రీతిలోనే క్లయిమాక్స్ వచ్చి, సినిమా అయిపోయింది అనిపిస్తుంది. సో, తోలిసగం ముగియడానికి ఇరవై నిమషాల ముందు నుంచి చివరకు వరకు ఇక జనం ‘పాగల్..పాగల్..పాగలు’ అని పాడుకోవడమే.
ఇలాంటి సినిమాలో విష్వక్ సేన్ బాగానే చేసాడు. కలర్ ఫుల్ గా కనిపించాడు. డ్యాన్స్ లు, యాటిట్యూడ్, మాడ్యులేషన్ అన్నింటా ఓకె అనిపించేసుకున్నాడు. ఇక సినిమా లో మరెవరి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేకుండా చేసారు. టెక్నికల్ గా సినిమా బాగానే వుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రవుడ్ స్కోర్, లోకేషన్లు అన్నీ పెర్ ఫెక్ట్ గానే వున్నాయి. కానీ దానికి తగినట్లు స్క్రిప్ట్ కూడా వుంటే బాగుండేది. ఆయన వుంటే…అన్న సామెత మాదిరిగా, అలాంటి స్క్రిప్ట్ నే వుంటే ఇలాంటి యాప్ట్ టైటిల్ ఎందుకు పెడతారు?
ప్లస్ పాయింట్లు
టైటిల్ సాంగ్
తొలిసగంలో కాస్త ఫన్
మైనస్ పాయింట్లు
సెకండాఫ్
ఫినిషింగ్ టచ్: పిచ్చి పీక్స్
-సూర్య
Gulte Telugu Telugu Political and Movie News Updates