2.25/5
| Action | 02-Apr-2021
Cast - Karthi, Rashmika Mandanna, Napoleon, Others
Director - Bakkiyaraj Kannan
Producer - SR Prakash Babu, SR Prabhu
Banner - Dream Warrior Pictures
Music - Vivek Mervin
సినిమాల్లో భారీ సినిమాలు వేరు. భారమయ్యే సినిమాలు వేరు. బాహుబలి, ఆచార్య లాంటి సినిమాలు భారీ సినిమాలు. ఈవారం విడుదలైన సుల్తాన్ లాంటివి భారమయ్యే సినిమాలు. సుల్తాన్ లాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతి ఫ్రేమ్ లోనూ కనీసంలో కనీసం ఇరవై మంది జనం వుండాల్సిందే. పైగా ఆ జనం కూడా ఇలాంటి అలాంటి జనం కాదు. భారీ శాల్తీలు, జులపాలు, గెడ్డాలు, వీర లెవెల్ బొజ్జలు, ఇలా ఒకటేమిటి? తలా స్పెసిమన్ టైపు్ జనాలను ఎంచి మరీ తీసుకవచ్చి ఓ ఫ్రేమ్ లో పడేసారు. వీళ్లందరి మధ్యా గుర్తుపట్టే ఆడ క్యారెక్టర్ ఒకటే ఒకటి. అది రష్మిక. ఆమె కూడా అప్పుడప్పుడు డీగ్లామర్ గా ఇలా అలా కనిపించి వెళ్తుంటుంది.
కాన్సెప్ట్ మంచిదైతే సరిపోదు. అది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ చేసే విధానం సినిమాలు చూసే ప్రేక్షకులకు నప్పుతుందా? నచ్చుతుందా? దాని మంచి చెడ్డలేమిటి? అన్నది ముందు చూసుకోవాలి. అలా చూసుకోకుండా దిగిపోతే ఇదిగో ఇలా సుల్తాన్ లాగే వుంటుంది. ఇంతకీ ఈ సుల్తాన్ కథేంటీ?
సేతుపతి (నెపోలియన్) మంచి దందాలు చేసే నాయకుడు. అతగాడి దగ్గర వందకు పైగా రౌడీ బ్యాచ్ వుంటుంది. నెత్తురు వాసన చూడకుండా వుండలేరు. అలాంటి సేతుపతి భార్య కొడుకును కని కన్నుమూస్తుంది. ఆ కుర్రాడే సుల్తాన్(కార్తి). ఆ కుర్రాడిని ఈ రౌడీ బ్యాచ్ నే పెంచుతుంది. కానీ సుల్తాన్ కు ఈ రక్తపాతాలు వగైరా వ్యవహారాలు నచ్చవు. బాగా చదువుకుని, కంపెనీ పెట్టే ఆలోచనలో వుంటాడు. అలాంటి టైమ్ లో కొత్త గా వచ్చిన పోలీస్ అధికారి రౌడీలను అందిరినీ ఏరేసే క్రమంలో సేతుపతిని అటాక్ చేయిస్తాడు. దాంతో సేతుపతి ఈ వంద మంది బాధ్యతనూ సుల్తాన్ ని అప్పగించి కన్నుమూస్తాడు. సిటీకి కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ రౌడీల్నందరినీ ఎన్‌కౌంటర్ చేయడం మొదలెడతాడు. ఈ నేపథ్యంలో వారిని కాపాడుకోవడం కోసం మరో ఊరు తీసుకెళ్లిపోతాడు. ఆ ఊరికో సమస్య. అది పరిష్కారం చేయడం కోసం, ఈ రౌడీలను మార్చడం కోసం అక్కడ ఈ వంద మంది చేత వ్యవసాయం చేయిద్దామనుకుంటాడు. ఆ తరువాత ఏం జరిగింది అన్నది మిగిలిన కథ.
మిగిలిన కథ అని సింపుల్ గా అనేసినా, ఇంకా చాలా అంటే చాలా వుంది. అసలు కథకు ఓ కొసరు కథ, ఆ కొసరు కథకు మరో పిట్ట కథ అన్నట్లు చాలా వుంది వ్యవహారం. సినిమాకు సరిపడా కథ లేకపోవడం అన్నది ఎంత మైనస్ అవుతుందో మరీ ఎక్కువ కథ వుండడం కూడా అంతే మైనస్ అవుతుంది. సుల్తాన్ లో ఆ సమస్య కూడా వుంది. సినిమాలో ప్రధానమైన రెండు సమస్యల్లో ఒకటి కాశీమజిలీ అంతటి పేద్ద కథ. రెండవది వంద మంది అరివీర భయంకరమైన జూనియర్ ఆర్టిస్ట్ లు.
పాటలు, ఫైట్ల సంగతి పక్కన పెడితే ఏ సీన్ చూసినా ఈ మందీ మార్బలమే. అసలే వెంట్రుకవాసి లవ్ ట్రాక్. ఆ ట్రాక్ కూడా ఈ భారీ వ్యవహారంలో పడి నలిగిపోయింది. తమిళ ఫ్లావర్ అన్నది సుల్తాన్ సినిమాకు తమిళనాట అండగా వుంటే వుండొచ్చేమో కానీ తెలుగు నాట మాత్రం జనాలకు కాస్త ఇబ్బందిగానే వుంటుంది. సుల్తాన్ సినిమా ఓపెనింగ్ షాట్ నుంచి ఇదే స్టార్ట్ అవుతుంది. చివరి వరకు కొనసాగుతుంది ఏదో రూపంలో. హీరోయిన్ పెళ్లి చూపులు లాంటి కామెడీ సీన్లు కితకితలు పెట్టుకున్నా నవ్వు రాని టైపు. హీరోను చిన్నప్పటి నుంచి పెంచిన వంద మందిలో ఓ బ్లాక్ షీప్ వుండడం అన్నది సినిమాటిక్ వ్యవహారం తప్ప వేరు కాదు. సినిమాకు ఓ విలన్ అంటూ నిర్దిష్టంగా లేడు. కొంత వరకు ఓ విలన్. తరువాత అసలు విలన్ అంటూ రకరకాల విన్యాసాలు చేసారు. ఓ ప్రాంతంలో అపారంగా ఇనుప ఖనిజం వుందీ అంటే ప్రభుత్వమే భూములు తీసుకుంటుంది కదా? అలా కాకుండా అక్కడ ఖనిజం వుందని ప్రయివేటు వ్యక్తులు కొనేసి తీసేసుకోవడం ఎలా సాధ్యం? మళ్లీ తవ్వకాలకు అనుమతి ఇవ్వాల్సింది ప్రభుత్వమేగా. ఇలాంటి లాజిక్ లు తీస్తే అసలు కథలోనే లోపం వుంటుంది.
సినిమా కథ భారీ…జనం భారీ. మరింక చేయడానికి ఏముంటుంది. ఏదో ఒప్పుకున్నాక తప్పుతుందా అన్నట్లు చేసుకుంటూ వెళ్లారు కీలక పాత్రధారులు కార్తీ, రష్మిక. కానీ టెక్నికల్ టీమ్ మాత్రం తమ పని తాము బాగా చేసారు. భారీ ఫైట్లు, సినిమాకు తగినట్లు యువన్ శంకర్ రాజా రీ రికార్డింగ్ బాగున్నాయి అని చెప్పుకోవడానికి సినిమాలో వున్నవి. నిజానికి కథ, లైను మంచివే. కానీ వాటికి ఇచ్చిన ట్రీట్ మెంట్ తోనే సమస్య. దాంతోటే సినిమా చూసిన తరువాత ఒక తలకు బదులు వంద తలలు మనకే వున్నాయోమో అన్నంత భారమైన ఫీలింగ్ తో బయటకు రావాల్సిందే.
ప్లస్ పాయింట్లు
యాక్షన్ సీన్లు
బ్యాక్ గ్రవుండ్ స్కోర్
మైనస్ పాయింట్లు
అన్నింటా నిండిన భారీతనం
నీరసమైన లవ్ ట్రాక్
ఫినిషింగ్ టచ్: సుల్తాన్ కాదు సైతాన్
Rating: 2.25/5
-సూర్య