Movie Reviews

సమీక్ష – మ్యాడ్ స్క్వేర్

బాహుబలి, కెజిఎఫ్, పుష్ప సీక్వెల్స్ వస్తే వాటికి క్రేజ్ రావడం సహజం. ఎందుకంటే వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన స్టార్ హీరోల గ్రాండియర్లు కాబట్టి. కానీ ముగ్గురు సెటిల్ కాని హీరోలు చేసిన ఒక కామెడీ ఎంటర్ టైనర్ కి కొనసాగింపు వస్తే దానికి బజ్ ఏర్పడటం మాత్రం అరుదు. అది మ్యాడ్ స్క్వేర్ విషయంలోనే జరిగింది. లాజిక్స్ అక్కర్లేదు మేజిక్ ఫీలవ్వండి అంటూ నిర్మాత నాగవంశీ పదే పదే ఇచ్చిన పిలుపు మెల్లగా అంచనాలు పెంచేసింది. ఉగాది పోటీని డామినేట్ చేస్తున్న మ్యాడ్ మ్యాక్స్ అంచనాలు అందుకునేలా ఉందా

కథ

ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న మ్యాడ్ బృందం (నితిన్ నార్నె – సంగీత్ శోభన్ – రామ్ నితిన్) కాలేజీ లైఫ్ తర్వాత వేర్వేరుగా వెళ్ళిపోయాక లడ్డు (విష్ణు) తమకు చెప్పకుండా పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళిపోతారు. అయితే సరిగ్గా ముహూర్త సమయానికి అమ్మాయి వేరొకరితో లేచిపోవడంతో లడ్డు బాధని తీర్చడం కోసం అందరూ కలిసి గోవా ప్లాన్ చేస్తారు. సరదాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఒక మ్యూజియం దొంగతనం కేసులో ఇరుక్కుంటారు. దీనికి మాఫియా డాన్ మ్యాక్స్ (సునీల్) కి కనెక్షన్ ఉంటుంది. దీంతో ఫ్రెండ్స్ బృందం చిత్ర విచిత్ర సమస్యల్లో ఇరుక్కుంటారు. వీటి నుంచి ఎలా బయటపడ్డారనేది తెలుసుకోవడమే స్టోరీ.

విశ్లేషణ

మూడేళ్ళ క్రితం మ్యాడ్ అంతగా వర్కౌట్ అవ్వడానికి కారణం ఆర్గానిక్ గా అనిపించిన కామెడీ. కాలేజీ వాతావరణం, జూనియర్ సీనియర్ ర్యాగింగ్, అమ్మాయిలతో ప్రేమకథలు, స్నేహితుల సరదాలు, క్యాంటీన్ గొడవలు ఇలా అన్ని మిక్స్ చేయడంతో యూత్ కి బాగా నచ్చేసింది. కొంచెం లౌడ్ గా అనిపించినా సరే క్లాస్ మాస్ ఇద్దరూ ఎంజాయ్ చేశారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ మళ్ళీ అక్కడే సీక్వెల్ ని కంటిన్యూ చేస్తే రొటీన్ ఫ్లేవర్ వచ్చేస్తుంది కాబట్టి గోవాను ఎంచుకుని సునీల్ రూపంలో దానికో కామెడీ విలన్ ని జోడించాడు. ఇలాంటివి బాలీవుడ్ లో చాలా వచ్చాయి, పేలాయి. మనకు అలవాటు పెద్దగా లేదు కాబట్టి ఫ్రెష్ గా అనిపిస్తుందనే ఉద్దేశంతో ఇలా ఎంచుకున్నాడు.

ఫస్టాఫ్ మొత్తం సరదాగానే గడిచిపోతుంది. మరీ హిలేరియస్ కాకుండా నవ్వులకు ఢోకా లేకుండా చూసుకోవడతో పెద్దగా బోర్ కొట్టదు. లడ్డు పెళ్లి సెటప్, స్నేహితులొచ్చాక లడ్డుకి ఎదురైయ్యే సరదా సంఘటనలు కాలక్షేపం చేయిస్తాయి. అక్కడక్కడా వీళ్ళు చేసే అల్లరి కొంత శృతి మించినట్టు అనిపించినా షుగర్ కోటింగ్ వేసినట్టు స్నేహం ముసుగులో కళ్యాణ్ శంకర్ బాగానే లాకొచ్చారు. ఇంటర్వెల్ దాకా ఒక ట్విస్టుతో చిన్న సస్పెన్స్ క్రియేట్ చేసిన దర్శకుడు రెండో సగం ఇంకో గంట పాటు అదే స్థాయి ఫన్ ని సృష్టించడంలో తడబడ్డాడు. గోవాలో పోలీస్ స్టేషన్, మ్యాక్స్ డెన్, హోటల్ రిసార్ట్ తప్ప ఎక్కువ లొకేషన్లు లేకుండా సింపుల్ గా లాగేందుకు ట్రై చేశాడు.

మ్యాడ్ లో ఉన్న అమాయకత్వం, తాజాదనం స్థానాన్ని ఈసారి డాన్ లాంటి ఎక్స్ ట్రాలు ఆక్రమించుకోవడంతో ఒకదశ దాటాక డార్క్ కామెడీ జానర్ లోకి వెళ్తుందన్న అనుమానం వస్తుంది. ముగ్గురికి మరో కుర్రాడిని జోడించిన కళ్యాణ్ శంకర్ ఒక్క విష్ణుకి తప్ప ఎవరికీ తమ టైమింగ్ చూపించే అవకాశం ఇవ్వకపోవడంతో సన్నివేశాలు వచ్చి వెళ్తుంటాయి కానీ ప్రభావం తక్కువే. ఎంతో ఆశించిన డిడి సైతం విశ్రాంతి తర్వాత గుంపులో కలిసిపోయి స్పెషల్ గా నిలవలేదు. ఇది సబ్జెక్టు డిమాండ్ మేరకు చేసిందే కావొచ్చు కానీ సంగీత్ శోభన్, నవీన్ పోలిశెట్టి లాంటి ఆర్టిస్టులు దొరికినప్పుడు వాళ్ళు చెలరేగిపోయేలా డైలాగులు, సీన్లు పడాలి. కానీ అంత వెయిట్ మ్యాడ్ 2లో లేదు.

అయితే సరదాగా కుర్రాళ్ళు కలిసి థియేటర్లో ఎంజాయ్ చేయడానికి సరిపడా ఓ మోస్తరు స్టఫ్ ఇవ్వడంలో కళ్యాణ్ శంకర్ పాసయ్యాడు. కానీ దీని మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ముందే గుర్తించి ఉంటే మరింత మెరుగ్గా కథా కథనాలు ఉండేవన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే గోవాకు వెళ్ళాక జరిగే కన్ఫ్యూజన్ డ్రామా, ప్రియాని వెతకడం కోసం కుర్రాళ్ళు పడే పాట్లు ఇవన్నీ కొంచెం తక్కువ మోతాదులోనే ఎంటర్ టైన్ చేశాయి. వెరైటీ కోసం శుభలేఖ సుధాకర్ తో కామెడీ చేయించే ప్రయత్నం అంతగా పేలలేదు. పైగా భాయ్ అంటూ సునీల్ చేసే విలనిజం గతంలో చాలా సార్లు చూసిందే కావడంతో ఈ థ్రెడ్ మొత్తం రిపీట్ గా అనిపించడం ఒక మైనస్.

మొత్తంగా చెప్పాలంటే టైటిల్ లో ఉన్న స్క్వేర్ అంత వినోదం లేదు కానీ హాఫ్ ఉంది. దానితో సంతృప్తి పడే ప్రేక్షకుల శాతం బాగానే ఉండే అవకాశాలున్నాయి కాబట్టి బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్లు నమోదు చేసే అవకాశాన్ని కొట్టి పారేయలేం. నిర్మాత అన్నట్టు లాజిక్స్ అన్నీ పక్కనపారేసి హాయిగా నవ్వుకోండి, నవ్వి నవ్వి ఆసుపత్రిలో చేరతారనే స్థాయిలో మాత్రం ఈ సినిమా లేదు. అరగంటకో సారి రెండుమూడు సార్లు నవ్విస్తూ ఈ మాత్రం వినోదం ఇప్పుడొస్తున్న సినిమాల్లో ఏవి ఇస్తున్నాయనే ఫీలింగ్ కనక జనాలకు కలిగిందంటే మ్యాడ్ స్క్వేర్ పంట పండినట్టే. కాకపోతే టిల్లు స్క్వేర్ లాగా మూడో భాగానికి సరిపడా ఆసక్తిని రేపడంలో మాత్రం తడబడింది.

నటీనటులు

ముగ్గురు కుర్రాళ్లు చలాకీగా చేసుకుంటూ పోయారు. ఆశ్చర్యకరంగా ఈసారి విష్ణుకి ఎక్కువ స్పేస్ దొరికేసి మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు పెంచుకునే స్కోప్ అయితే దక్కింది. టైటిల్ కార్డు నుంచి క్లైమాక్స్ దాకా దాదాపు ఇతను కనిపించని ఫ్రేమ్ లేదు. సంగీత్ శోభన్ ఎప్పటిలాగే తనదైన టైమింగ్ తో మరోసారి అంచనాలు నిలబెట్టుకున్నాడు. కాకపోతే ద్వితీయార్థంలో తన మార్కు తగ్గిపోయింది. నితిన్ నార్నెకి ప్రాధాన్యత పరంగా ఓ ముఖ్యమైన మలుపు పెట్టారు కానీ మరీ మిగిలిన వాళ్ళను డామినేట్ చేసే స్థాయిలో లేదు.

రామ్ నితిన్ రూపం, నటన రెండూ ఓకే. మురళీధర్ గౌడ్ యథావిధిగా తనదైన శైలిలో జోకులు పండించారు. సత్యం రాజేష్ కు చాలా గ్యాప్ తర్వాత కాస్త చెప్పుకోదగ్గ క్యారెక్టర్ దొరికింది. వెరైటీ పోలీస్ గా నప్పాడు. సునీల్ ది రొటీనే. ఏదైనా చెబితే దానికి రివర్స్ చేయడమనే ప్రవర్తనను ఇంకాస్త కామిక్ గా రాసుకుని ఉంటే ఇంకా బాగా పేలేది. రిసార్ట్ ఓనర్ గా రఘుబాబు కాసేపు కనిపిస్తాడు. ప్రియాంకా జవల్కర్, రెబ్బ మోనికా జాన్ ఐటెం సాంగ్స్ పర్వాలేదు. విజువల్ గా డాన్సులతో పాటు చూస్తే మాస్ ఎంజాయ్ చేసేలానే ఉన్నాయి.

సాంకేతిక వర్గం

భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు మరీ సంక్రాంతికి వస్తున్నాం రేంజ్ లో లేవు కానీ మ్యాడ్ స్క్వేర్ లో ఇంకా బెటర్ సాంగ్స్ ఉండి ఉంటే కంటెంట్ వేల్యూ మరింత పెరిగేది. తమన్ ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి కంపోజ్ చేయించుకున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరీ ప్రత్యేకంగా అనిపించలేదు. కొన్ని ఎపిసోడ్స్ కి కొత్త తరహా సౌండ్ వినిపించింది కానీ ఇలాంటి ఎంటర్ టైనర్స్ లో ఇంతకన్నా ఆశించలేమని సరిపెట్టుకోవాలి. శామ్ దత్ ఛాయాగ్రహణం రిచ్ గా ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ వీలైనంత క్రిస్పీగా ఉంది కనక నిడివి గురించి నిందించడానికి ఛాన్స్ లేదు. విపరీతమైన ఖర్చు లేకుండా సితార ఎంటర్ టైన్మెంట్ నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

లడ్డు పాత్రలో విష్ణు
ఫస్టాఫ్ ఫన్
తక్కువ నిడివి

మైనస్ పాయింట్స్

కిక్కు తగ్గిన కామెడీ
రెండో సగం
సునీల్ డెన్ ఎపిసోడ్

ఫినిషింగ్ టచ్ : కాసిన్ని నవ్వులు….కాసిన్ని నిట్టూర్పులు

రేటింగ్ : 2.75 / 5

This post was last modified on March 29, 2025 6:14 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాబిన్ హుడ్ బాగానే దోచాడు.. కానీ

రాబిన్ హుడ్ అంటే పెద్దోళ్లను దోచుకుని పేదోళ్లకు పెట్టేవాడు. ఈ పేరుతో ఓ తెలుగు సినిమా తెరకెక్కింది. రెండుసార్లు వాయిదా…

48 minutes ago

బాబు ఆలోచ‌న అద్భుతః – ఆనంద్ మ‌హీంద్ర ప్ర‌శంస‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ వ్యాపార, వాణిజ్య‌, పారిశ్రామిక వేత్త‌ల నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. అర‌కు కాఫీని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం…

1 hour ago

రష్మిక ఇక్కడ తప్పించుకుని.. అక్కడ ఇరుక్కుంది

గత దశాబ్ద కాలంలో బహు భాషల్లో విజయాలు అందుకుని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద రేంజికి ఎదిగిన కథానాయిక రష్మిక…

2 hours ago

కేతిరెడ్డి రాజకీయం వదిలేస్తున్నారా.?

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఏది చేసినా వైరల్ అయిపోతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం కేంద్రంగా రాజకీయం చేస్తున్న కేతిరెడ్డి..…

2 hours ago

స్పెషల్ ఫ్లైట్ లో ముంబైకి కొడాలి నాని

వైసీపీ కీలక నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్టు సమాచారం.…

4 hours ago

టీడీపీలో అతిపెద్ద జబ్బు అలక… వదిలించుకుందాం: లోకేశ్

కార్యకర్తే అధినేత కార్యక్రమం తెలుగు దేశం పార్టీలో పక్కాగా అమలు అవుతోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్వి, ఏపీ మంత్రి…

4 hours ago