2.75/5
02 Hrs & 32 Mins | Love & Action | 07/02/2025
Cast - Naga Chaitanya, Sai Pallavi, Roa Ramesh, Prakash Belawadi, Karunakaran, Divya Pillai, Prithiveeraj, Kalpa Latha, Kalyani Natarajan, Mahesh Achanta and others
Director - Chandoo Mondeti
Producer - Allu Aravind & Bunny Vasu
Banner - Geetha Arts
Music - Devi Sri Prasad
ఏడాదిన్నరగా ఒకే సినిమా మీద దృష్టి పెట్టి ఒళ్ళు, మనసు రెండూ కష్టపెట్టి నాగచైతన్య చేసిన సినిమా తండేల్. గత కొన్ని ఫ్లాపులు కనీస ఫలితాలు అందుకోలేకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ప్రీ ప్రొడక్షన్ నుంచే ఇందులో భాగమయ్యాడు. అందులోనూ సాయిపల్లవి హీరోయిన్ కావడం, ప్యాన్ ఇండియా స్థాయిలో అల్లు అరవింద్ భారీ బడ్జెట్ కేటాయించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బన్నీ వాస్ కంటే ఎక్కువగా ఈయన ప్రాజెక్టుని నమ్మడం అంచనాలు పెంచింది. మరి తండేల్ కోరుకున్న తీరం చేరుకుందా
కథ:
శ్రీకాకుళం సముద్ర తీరంలో ఏడాదికి ఎనిమిది నెలలు గుజరాత్ కంపెనీ కోసం పని చేస్తుంటాడు రాజు (నాగచైతన్య). చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన సత్య (సాయిపల్లవి) ని ప్రాణంగా ప్రేమిస్తాడు. కాబోయేవాడి ప్రాణభయంతో ఈ వృత్తి మానేయమని ఎంతగా వేడుకున్నా తండేల్ (నాయకుడు) గా ఎన్నుకోబడ్డ రాజు సత్య మాట వినడు. ఓ రాత్రి అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల అతనితో సహా మొత్తం ఇరవై రెండు మంది పాకిస్థాన్ ఆర్మీకి దొరికిపోతారు. వాళ్ళను ఎలా విడిపించాలో అర్థం కాని పరిస్థితిలో సత్య పోరాటం మొదలు పెడుతుంది. తనవాళ్ళ కోసం మొండిగా నిలబడ్డ రాజు పోరాటం ఏమైంది, చివరికి మన దేశానికి ఎలా చేరుకున్నారనేది స్టోరీ.
విశ్లేషణ:
వెండితెరపై ప్రేమకథలు ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. దానికి జనరేషన్ తో సంబంధం లేదు. మారిన కొత్త ట్రెండ్ కు తగ్గట్టు సరైన మోతాదులో అన్ని అంశాలు జోడిస్తే ఎవరితోనైనా ఆకట్టుకునేలా తీయొచ్చు. దర్శకుడు చందూ మొండేటి నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా రచయిత కార్తీక్ ఇచ్చిన బ్యాక్ డ్రాప్ కి తనదైన సినిమాటిక్ ట్రీట్ మెంట్ తో తండేల్ ని రాసుకున్నాడు. అయితే అందరూ అనుకున్నట్టు ఇది కేవలం రాజు, సత్యల ప్రేమ గురించి కాదు. శత్రుదేశంలో చిక్కుకుని విలవిలలాడిన మత్య్సకారుల వెతలకు దేశభక్తిని జోడించి కాస్త కొత్తగా చెప్పాలని చూసిన ప్రయత్నం. అందుకే ఓపెనింగ్ సీన్ లోనే తన ఉద్దేశాన్ని స్పష్టంగా చెబుతాడు.
ఫస్ట్ హాఫ్ మొత్తం రాజు, సత్యల ప్రేమకథతో వాళ్ళ మధ్య బాండింగ్ ఎస్టాబ్లిష్ చేస్తాడు చందూ మొండేటి. నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ ఆహ్లాదకరమైన సంగీతం, పాటలు మనల్ని ప్రశాంతంగా ప్రయాణం చేయిస్తాయి. కొన్ని మాములు సన్నివేశాల్లోనూ నాగచైతన్య, సాయిపల్లవిల నటన వాటిని నిలబెడుతూ వెళ్లిన వైనం ఎక్కడో మూల కొత్తగా ఏం లేదనే ఫీలింగ్ రాకుండా చేస్తాయి. రాజుని గూడెం జనాలు నాయకుడిగా ఎంపిక చేసుకోవడం అంతగా ఎలివేట్ కాకపోయినా ఫ్యాన్స్ వరకు మెప్పించేలానే సాగింది. చందూకి మాస్ పల్స్ మీద పట్టు లేకపోవడం వల్ల యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేసుకోవడంలో తడబడిన వైనం అక్కడక్కడా లయ తప్పేలా చేసింది.
రాజుతో దూరమవ్వడానికి సత్య వైపు నుంచి చూపించిన కారణం కన్విసింగ్ గా అనిపించినప్పటికీ ప్రేమించినవాడు పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాడని తెలిశాక కూడా అదే మొండితనం చూపించడం క్యారెక్టరైజేషన్ పరంగా అంతగా సింక్ అవ్వలేదు. పైగా ఢిల్లీకి వెళ్లి ఆమె పోరాటం చేసింది సాటివాళ్ళ కోసమే కానీ రాజు గురించి కాదని ఒక డైలాగులో చెప్పించడం ద్వారా చైతు ప్రేమ హైలైట్ అయ్యింది. దీంతో సత్య నిజాయితీ బ్యాక్ లేయర్ లో ఉండిపోయింది. దీని వల్ల క్లైమాక్స్ కు వెళ్లే క్రమంలో ఈ జంట ఎలా కలుసుకుంటుందనే ఉద్వేగం కలిగించడంలో చందూ మొండేటి అంతగా సక్సెస్ కాలేదు. ఈ బలహీనత కాపాడుకుంటూ వచ్చింది సాయిపల్లవి నటనే.
పాకిస్థాన్ జైలులో రాజు గ్యాంగ్ పడే కష్టాలు, ఓ టెర్రరిస్టుతో కలిగే విభేదాలు వీటిని ఇంకా బాగా ప్రెజెంట్ చేయాల్సింది. కోర్టు నుంచి జైలుకు తీసుకెళ్లే క్రమంలో ముష్కరులు దాడి చేస్తే చైతు బృందం వాళ్ళ నుంచి తప్పించుకునే ఎపిసోడ్ ని గూస్ బంప్స్ వచ్చేలా డిజైన్ చేయొచ్చు. కానీ ఆశించినంత ఇంపాక్ట్ రాలేదు. ఆర్ఆర్ఆర్ లో రామరాజు వేల మందిని దాటి ఒక్కడిని అరెస్ట్ చేయడం రాజమౌళి చూపిస్తే ఎక్కడా వీసమెత్తు అనుమానం రాదు. లాజిక్ ఊసే తలెత్తదు. కానీ ఇక్కడ ఇరవై రెండు మంది తప్పించుకుని మళ్ళీ జైలుకి వచ్చే వైనాన్ని అంతే స్థాయిలో ఎలివేట్ చెయ్యొచ్చు. కానీ కుదరలేదు.ఇలాంటివి హ్యాండిల్ చేయడం సులభం కాదు కానీ అసాధ్యమూ కాదు.
చివరి ఘట్టంలో జరిగేది ఏంటో ముందే ఊహించగలిగినా క్లైమాక్స్ దాకా విసుగు తెప్పించుకుండా చేయగలిగితేనే డ్రామాకు న్యాయం జరుగుతుంది. తండేల్ ఈ విషయంలో తడబడుతూ సాగింది. భావోద్వేగాలు ఆశించిన స్థాయిలో రిజిస్టర్ కాకపోవడం దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అసలు సత్య వేరొకడితో పెళ్ళికి ఒప్పుకుని రాజు బయటికి వచ్చే దాకా దాన్ని నానుస్తూ వెళ్లడం మాస్ కి అంతగా నప్పకపోవచ్చు. రాజు పడుతున్న క్షోభ తెలిసి కూడా తండ్రితో తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పడం ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. అంత పిచ్చిగా ప్రేమించిన అమ్మాయి జరుగుతున్న పరిణామాలకు చలించకుండా ప్రవర్తించడం ఔచిత్యాన్ని తగ్గించింది.
తండేల్ నిరాశపరచదు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక ధీటైన ప్యాన్ ఇండియా మూవీగా అందరి చేత యునానిమస్ గా అంగీకరింపబడటంలో కొంత మిశ్రమ ఫలితం అందుకోవచ్చు. చైతు, సాయిపల్లవి నుంచి ఏం ఆశిస్తామో, దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఏం కోరుకుంటామో అక్కడి వరకు తండేల్ పైసా వసూల్ చేయించేసింది. ప్రమోషన్లలో చెప్పుకున్నట్టు ప్రేమజంటలు ఎక్కువగా కనెక్ట్ అయిపోయి మళ్ళీ మళ్ళీ చూస్తారేమో కానీ ఫ్యామిలీ జనాలు కోరుకునే ఎంటర్ టైన్మెంట్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, హుషారైన నెరేషన్, తగిన మోతాదులో ఎలివేషన్ పూర్తి స్థాయిలో కుదరలేదు. అయినా సరే ఫిబ్రవరి నెలలో గుడ్ ఛాయస్ తండేలయ్యే అవకాశముంది.
నటీనటులు:
మాటల్లో కాదు నాగచైతన్య ఈసారి చేతల్లో చూపించాడు. తండేల్ రాజుగా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. నటన పరంగా ఛాలెంజ్ విసిరే ఇలాంటి క్యారెక్టర్లు ఎంచుకోవడం ద్వారా తనను తాను మెరుగుపరుచుకోవడమే కాక ఫ్యాన్స్ తో పాటు ఇతర వర్గాల ఆడియన్స్ నుంచి ఆమోదం దక్కడం సులభమవుతుంది. రఫ్ లుక్స్ ని మైంటైన్ చేయడంతో పాటు రాజు పాత్ర డిమాండ్ చేసిన ఇంటెన్సిటీని వంద శాతం ఇచ్చాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో జైలుకెళ్ళినప్పటి నుంచి చివర్లో స్నేహితుడి కోసం నిలబడే దాకా అభిమానులతో చాలా సార్లు నాన్ స్టాప్ విజిల్స్ వేయించుకున్నాడు. రెగ్యులర్ ఫార్మట్ కి దూరంగా ఇలాంటి క్యారెక్టర్లు రావడం ఏ యూత్ హీరోకైనా అవసరమే.
సాయిపల్లవి గురించి ఎన్నిసార్లు రాసినా ఒకే వివరణ ఉంటుంది. అమరన్ ని ఎక్స్ ప్రెషన్లతో నిలబెట్టిన ఫిదా భాగమతి ఈసారి శ్రీకాకుళం సత్యగా మరోసారి గుర్తుండిపోయేలా చేసింది. ఎమోషన్ ని కళ్ళతో పలికించడంతో మొదలుపెట్టి కన్నీళ్లను బిగపట్టుకుని పెదాలతోనే ఏడిపించడం వరకు తనకు పోటీ రావడం అంత సులభం కాదు. ఇక డాన్స్ గురించి చెప్పేదేముంది. తమిళం నుంచి తెచ్చిన కరుణాకరన్ మంచి యాక్టింగే కానీ తెలుగు నటుడైతే ఇంకా బాగుండేది. పృథ్విరాజ్, ఆడుకాలం నరేష్ పర్వాలేదు. పాకిస్థాన్ జైలర్ గా ప్రకాష్ బెలవాడి నప్పలేదు. శతమానంభవతి మహేష్ కు కాస్త లెన్త్ దొరికింది. దివ్య పిళ్ళై, కల్పలత, పార్వతీశం తదితరులు ఓకే.
సాంకేతిక వర్గం:
అల్లు అర్జున్ ఇటీవలే దేవిశ్రీ ప్రసాద్ ని ప్రేమకథల స్పెషలిస్ట్ గా వర్ణించాడు. దేవి కెరీర్ మొదలుపెట్టిన ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఇదే మాటని నొక్కి వక్కాణించవచ్చు. తండేల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రాణం పోశాడు. ముఖ్యంగా మొదటిసగంలో ప్రేమ సన్నివేశాలకిచ్చిన బిజిఎం వాటి స్థాయిని పెంచేసింది. పాటలు చూసేందుకు వినేందుకు పోటాపోటీగా కుదిరాయి. శామ్ దత్ సైనుద్దీన్ ఛాయాగ్రహణం కొత్త ప్రమాణాలను నిర్దేశించింది. నవీన్ నూలి ఎడిటింగ్ పరంగా కంప్లయింట్ తక్కువే కానీ సెకండాఫ్ లో నిడివిని కంట్రోల్ చేయాల్సింది. ఆర్ట్ వర్క్ బాగుంది. రాజీ లేకుండా గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు అరవింద్ నమ్మకాన్ని చూపించాయి.
ప్లస్ పాయింట్స్
చైతు, సాయిపల్లవి నటన
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
ప్రేమ సన్నివేశాలు
ఛాయాగ్రహణం
మైనస్ పాయింట్స్
భావోద్వేగాల బరువు తగ్గడం
పాకిస్థాన్ ఎపిసోడ్ డ్రామాపాళ్ళు
గ్రిప్ తగ్గిన స్క్రీన్ ప్లే
కాస్త నెమ్మదిగా సాగే కథనం
ఫినిషింగ్ టచ్ : తడబడినా నిలబడింది
రేటింగ్ : 2.75 / 5