బిగ్ స్క్రీన్ మీద సమంతాని చూసి అభిమానులకు బాగా గ్యాప్ వచ్చేసింది. ఇటీవలే అలియా భట్ జిగ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బయటికి రావడం తప్పించి బొత్తిగా మీడియాను కలుసుకోవడం సైతం మానేసింది. ఫ్యాన్స్ ఏదో ఒక సినిమాలో తనను చూడాలని కోరుకుంటుండగా యశోద, శాకుంతలం, ఖుషి తర్వాత మళ్ళీ దర్శనం లేకుండా పోయింది. వచ్చే నెల సిటాడెల్ హానీ బన్నీ వెబ్ సిరీస్ తో స్మార్ట్ తెరపై ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ది ఫ్యామిలీ మ్యాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన రాజ్ అండ్ డికె దీనికి దర్శకత్వం వహించడం విశేషం.
ఈ హానీ బన్నీకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రముఖ హాలీవుడ్ ద్వయం రస్సో బ్రదర్స్ రచన చేసిన కాన్సెప్ట్ ఇది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళే. ఇండియన్ ఆడియన్స్ కి తగట్టు రాజ్ డీకేలు మార్పులు చేశారు. ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ లో పని చేసే సామ్, వరుణ్ ధావన్ లు అనుకోని పరిస్థితుల్లో విడిపోతారు. పాపను చూసుకుంటూ వేరే ప్రపంచంలో ఉన్న సామ్ కు శత్రువుల నుంచి కొత్త ముప్పు ఏర్పడుతుంది. కూతురి ప్రాణాలను కాపాడుకునే క్రమంలో హానీ బన్నీ ఒక్కటవుతారు. ఒళ్ళు జలదరించే ఆటలో సాహసాలు చేస్తూ ఎదురెళతారు. చివరికి ఎలా విజయం సాధించారనేది నవంబర్ 7న చూసి తెలుసుకోవాలి.
కంటెంట్ మొత్తం యాక్షన్ విజువల్స్ తో నింపేశారు. ముఖ్యంగా సమంతా చేస్తున్న ఫైట్లు అడ్వెంచర్లు అభిమానులకు మాములు కిక్ ఇవ్వడం లేదు. నిజంగానే రియల్ స్టంట్స్ చేసిన సమంతా సుదీర్ఘ కాలం హానీ బన్నీ కోసం పని చేసింది. అమెజాన్ ప్రైమ్ కోట్ల రూపాయల బడ్జెట్ మంచి నీళ్లలా ఖర్చు పెట్టింది. ఇప్పటిదాకా మన దేశంలో రూపొందిన అత్యంత ఖరీదయిన సిరీస్ ఇదేనని ముంబై మీడియా టాక్. కేకే మీనన్, సిమ్రాన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ స్పై డ్రామా తనకు పెద్ద బ్రేక్ ఇస్తుందని సామ్ బలంగా నమ్ముతోంది. ట్రైలర్ చూస్తే ఆ నమ్మకం నిజమయ్యేలానే ఉంది.