‘కంగువ’కు 2000 కోట్లు.. అతిగా లేదూ?

‘బాహుబలి’ సినిమా తర్వాత వెయ్యి కోట్ల వసూళ్లు కేక్ వాక్ అనుకున్నారు చాలామంది. భారీగా బడ్జెట్లు పెంచేసి, ఓ హైప్ తెచ్చేసి రిలీజ్ చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టాయి. ‘బాహుబలి’ తర్వాత వెయ్యి కోట్ల మార్కును అందుకున్న సినిమాలను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. కానీ తమ సినిమాలకు హైప్ పెంచడం కోసం వెయ్యి కోట్ల వసూళ్ల అంచనాలు చెప్పే నిర్మాతలు చాలామందే ఉన్నారు. ఐతే ఇప్పుడు తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఏకంగా రూ.2 వేల కోట్ల లెక్క చెబుతున్నాడు.

ఆయన ప్రొడక్షన్లో తన కజిన్ సూర్య హీరోగా నటించిన ‘కంగువ’ మీద భారీ అంచనాలే ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబరు 10న రావాల్సిన ఈ చిత్రం.. నవంబరు 14కు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఆ రోజు వరల్డ్ వైడ్ భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాకు వందల కోట్ల వసూళ్లు వస్తాయనడంలో సందేహం లేదు. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ వర్కవుట్ అయితే వెయ్యి కోట్ల మార్కును కూడా అందుకోవచ్చేమో.

కానీ జ్ఞానవేల్ రాజా మాత్రం ఈ సినిమా ఏకంగా రూ.2 వేల కోట్ల వసూళ్లు రాబడుతుందని అంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘కంగువ’ వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందా అని అడిగితే.. వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్లు వస్తాయని అన్నాడు జ్ఞానవేల్ రాజా. కానీ ఈ కామెంట్ నెటిజన్లకు రుచించడం లేదు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్‌లా అనిపిస్తోంది. సూర్య సౌత్ ఇండియాలో మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న హీరోనే.

కానీ నార్త్‌లో పెద్దగా గుర్తింపు లేదు. సూర్య సినిమాల్లో ఏదీ ఇప్పటిదాకా ఇప్పటిదాకా కనీసం 300 కోట్ల మార్కును కూడా అందుకోలేదు. ‘కంగువ’ వేరే లెవెల్ సినిమాలా కనిపిస్తున్నా.. దానిపై అంచనాలు భారీగా ఉన్నా సరే.. ఏకంగా 2 వేల కోట్ల మార్కును టచ్ చేయడం అంటే అసాధ్యమే. అసలు వెయ్యి కోట్ల వసూళ్లయినా సాధిస్తుందా అన్నది చూడాలి. ఎందుకంటే ఈ సినిమా తీసింది రాజమౌళి కాదు. సగటు మాస్ మసాలా సినిమాలు తీసే శివ. అంచనాలు పెంచడానికి ఘనంగా స్టేట్మెంట్లు ఇవ్వొచ్చు కానీ.. మరీ ఇలాంటి అతిశయోక్తులు కరెక్ట్ కాదనే అభిప్రాయాలు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి.