క్యామియోలతో నిండిపోతున్న కూలీ

సౌత్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ ఒకరు. కథలు కొత్తగా లేకపోయినా స్క్రీన్ ప్లే, హీరోయిజం ఎలివేషన్లతో ఇప్పటి ట్రెండ్ కి నచ్చేలా సినిమాలు తీయడం యూత్ లో ఫాలోయింగ్ పెంచింది. లియోకి అంత భారీ వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లోనూ రావడానికి విజయ్ ఇమేజ్ కన్నా ఎక్కువ పని చేసింది లోకేష్ బ్రాండే. గోట్ కు ఓపెనింగ్స్ తక్కువ రావడానికి కారణం ఇదే. ప్రస్తుతం రజనీకాంత్ తో తను కూలి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం పూర్తి చేసుకున్న ఈ మాఫియా డ్రామా నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన బంగారం స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుందని ఇన్ సైడ్ టాక్.

ఇందులో నాగార్జున, ఉపేంద్ర ప్రత్యేక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంత నిడివి అనేది బయటికి రాలేదు కానీ చాలా ప్రాధాన్యం ఉందని తెలిసింది. విక్రమ్ లో రోలెక్స్ ని ఎంత పవర్ ఫుల్ గా చూపించాడో అంతకన్నా ఎక్కువే వీటిని డిజైన్ చేసినట్టు సమాచారం. ఇప్పుడు వీళ్ళు చాలదు అన్నట్టు బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ ని సైతం తీసుకొస్తున్నాడట. అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ దాదాపు ఖాయమైనట్టు చెన్నై టాక్. ఇదే నిజమైతే కూలి హిందీ మార్కెట్ కు బూస్ట్ దొరికినట్టే. రజని సోలో హీరోగా చేసినవాటిని నార్త్ ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. జైలర్, వేట్టయన్ లే ఉదాహరణ.

చూస్తుంటే లోకేష్ కనగరాజ్ మరీ ఎక్కువగా క్యామియోల మీద ఆధారపడుతున్నాడేమో అని అనుమానం రాకమానదు. సినిమాటిక్ యునివర్స్ పేరుతో ఢిల్లీ, రోలెక్స్, విక్రమ్ లను కలుపుతూ ఒక మల్టీస్టారర్ తీస్తానని, ఎవరూ ఊహించని అంశాలు అందులో ఉంటాయని ఊరిస్తున్నాడు. కూలి మాత్రం స్టాండ్ అలోన్ మూవీ ఆట. ఖైదీ 2 త్వరలో సెట్స్ పైకి వెళ్తుందని చెబుతున్నారు. ఇంకో మూడు సంవత్సరాలు లోకేష్ పూర్తిగా వీటికే టైం కేటాయించబోతున్నాడు. తెలుగులో స్టార్ హీరోలు తనతో పని చేసేందుకు మొగ్గు చూపుతున్నప్పటికీ ఇప్పట్లో అతని టాలీవుడ్ డెబ్యూ జరగని పని.