బావా బావమరిది భలే గట్టెక్కారు

దేవర ముందు నువ్వెంత అంటూ బాక్సాఫీస్ పోటీ కవ్విస్తున్నా సరే పోటీకి సై అంటూ వచ్చిన సత్యం సుందరం తెలుగులోనూ మంచి వసూళ్లతో గట్టెక్కే దిశగా వెళ్లడం పట్ల టీమ్ సంతోషంగా ఉంది. నిజానికి సోలోగా వచ్చి ఉంటే ఇంకా మంచి ఫలితం దక్కేదనే కామెంట్ లో నిజముంది కానీ తమిళంలో కాంపిటీషన్ లేని టైం కావడంతో నిర్మాతలు డేట్ వదులుకునేందుకు ఇష్టపడలేదు. మొదట్లో నెమ్మదిగా మొదలై క్రమంగా ఊపందుకున్న సత్యం సుందరంలో బావా బావమరిదిగా కార్తీ, అరవింద్ స్వామిల కాంబినేషన్ తెరమీద బాగా కనెక్ట్ అయ్యింది. తెలుగులో అప్డేట్ అయ్యింది లేనిది తెలియాల్సి ఉంది.

టాలీవుడ్ ఆడియన్స్ స్పందన గుర్తించిన కార్తీ ఆలస్యం చేయకుండా వెంటనే వచ్చేసి విజయవాడ నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టాడు. దేవర చూడమని ఎవరూ అడగకపోయినా దానికి భారీ కలెక్షన్లు వచ్చేస్తాయి. కానీ సత్యం సుందరంకి అలా కాదు. పుష్ కావాలి. మాస్ మద్దతు దొరకని ఎమోషనల్ మూవీ కావడంతో ప్రత్యేకంగా పబ్లిసిటీ అవసరం. అందుకే కార్తీ ఒక్కడే అయినా సరే అదే పనిగా తిరుగుతూ జనానికి చేరువ చేస్తున్నాడు. అక్టోబర్ రెండు గాంధీ జయంతి సెలవుతో పాటు పది రోజుల పాటు స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులు మొదలు కాబోతున్నాయి. ఈ అవకాశం వసూళ్లకు చాలా కీలకం.

ఇది గుర్తించిన కార్తీ సత్యం సుందరం పని మీదే ఉన్నాడు. ముందు దీన్ని ఓటిటికి ఇవ్వాలని అనుకున్నామని,ఇలాంటి ఫీల్ గుడ్ మూవీస్ థియేటర్ లో కమర్షియల్ గా ఆడతాయా అని అనుమానం వచ్చిందని అన్నాడు. అయితే నిర్ణయం మార్చుకోవడం వల్ల గొప్ప ఫలితం చూస్తున్నామని సంతోషం వ్యక్తం చేశాడు. కె విశ్వనాధ్, దాసరి లాంటి ఎందరో మహానుభావులు ఇలాంటి సినిమాలు ఎప్పుడో తీశారని, ఇప్పుడు తామూ ఒక ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చాడు. బుక్ మై షోలో వర్కింగ్ డే సోమవారం రోజు సగటున గంటకు 1500కు పైగా టికెట్లు అమ్ముడుపోవడం సత్యం సుందరంకి శుభ సూచిక.