తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న అర్ధరాత్రి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని వచ్చిన వార్త ఒక్కసారిగా అభిమానులను కుదిపేసింది. ఆందోళన చెందే అవసరం లేదని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నప్పటికీ కీలకమైన చికిత్స ఒకటి ఈ రోజు చేస్తారనే టాక్ వాళ్ళ టెన్షన్ ని పెంచింది. ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగా ఉంది కాబట్టి నిశ్చింతగా ఉండొచ్చు. అక్టోబర్ 10 వేట్టయన్ విడుదల కాబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లలో ఫ్యాన్స్ బిజీగా ఉన్నారు. జైలర్ ని మించిన స్థాయిలో భారీ ఎత్తున థియేటర్లను డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్న టైంలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం అనూహ్యం.
ఇప్పుడు క్షేమంగా బయట పడినా రజనీకాంత్ ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఆయన వయసు 73. అయినా సరే వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. వేట్టయన్ సెట్స్ మీద ఉండగానే కూలికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొంత భాగం పూర్తయ్యింది కూడా. అంతకు ముందు జైలర్ కావడం ఆలస్యం లాల్ సలాం కోసం సెట్లో అడుగు పెట్టారు. ఏడు పదుల ముదిమిలో చాలా మందికి నడవటమే కష్టం. అలాంటిది మేకప్ వేసుకుని గంటల తరబడి షూటింగుల్లో పాల్గొంటూ, విపరీతమైన ప్రయాణాలు చేస్తూ రిస్క్ చేయడం అంత చిన్న విషయం కాదు.
గతంలో పెద్దన్న, రోబో టైంలోనూ రజని ఇలా అస్వస్థతకు గురై వేగంగా కోలుకున్నారు. సినీ ప్రియులు ఎవరైనా సరే ఆయన నుంచి కోరుకునేది స్పీడ్ కాదు. నెమ్మదిగా చేసినా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండటం. అందులోనూ నూటా డెబ్భై పైగా ఎన్నో బ్లాక్ బస్టర్లు, క్లాసిక్స్ చూశాక కొత్తగా ఋజువు చేయాల్సింది ఏమి లేదు. నటతృష్ణ ఉండటం మంచిదే. ఫ్యాన్స్ కోసం నటించాలనే తపనా అర్థం చేసుకోదగిందే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి లెజెండ్స్ చివరి దాకా నటిస్తూనే ఉన్నారు. వాళ్ళ పరుగు అలుపు కోరుకోదు. అలాంటిది రజని తగ్గుతారని అనుకోలేం. కాకపోతే అప్రమత్తతో ఉండటం అవసరం.
Gulte Telugu Telugu Political and Movie News Updates