టాలీవుడ్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న అరంగేట్రం అంటే.. నందమూరి మోక్షజ్ఞదే. నిన్నటితరం సూపర్ స్టార్లలో చిరంజీవి, నాగార్జునల వారసులు ఎప్పుడో సినిమాల్లోకి వచ్చారు కానీ.. నందమూరి బాలకృష్ణ కొడుకు అరంగేట్రం మాత్రం అనుకున్న దాని కంటే చాలా ఆలస్యం అయింది. ఎప్పుడో ఏడెనిమిదేళ్ల కిందటే అనుకున్న ఎంట్రీ.. 2025లో కానీ సాధ్యపడట్లేదు. ఐతే ఎట్టకేలకు ఇటీవలే మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని ప్రకటించారు.
‘హనుమాన్’ తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ జరగబోతోంది. ‘హనుమాన్’ తరహాలోనే ఫాంటసీ టచ్ ఉన్న సినిమానే తీయబోతున్నాడని పోస్టర్ మీద వేసిన ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ లోగో చూస్తేనే అర్థమైపోయింది. ఈ సినిమాను దసరాకు లాంఛనంగా మొదలుపెట్టబోతున్నారట. ముహూర్త వేడుకను ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న టీం.. ముహూర్త వేడుక తర్వాత కూడా వెంటనే చిత్రీకరణ మొదలుపెట్టట్లేదు. డిసెంబరులో షూట్ ఆరంభమవుతుందట. తాజాగా బాలయ్య కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇక ఈ మూవీ గురించి బయటికి వచ్చిన ఆసక్తికర అప్‌డేట్ ఏంటంటే.. దీని మీద ఏకంగా రూ.100 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట. ఒక కొత్త హీరో మీద ఇంత బడ్జెట్టా అని ఆశ్చర్యం కలగడం ఖాయం. కానీ ‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ మీద అంచనాలు బాగా పెరిగాయి. అతడి సినిమాటిక్ యూనివర్శ్ నుంచి సినిమా అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అదే సమయంలో నందమూరి వారసుడి సినిమా అన్నా ఉండే క్యూరియాసిటీ వేరు.
హనుమాన్, కార్తికేయ తరహా డివోషనల్ టచ్ ఉన్న ఫాంటసీ మూవీ చేస్తే పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ వస్తుందని.. బడ్జెట్ వర్కవుట్ చేయడం కష్టమేమీ కాదని టీం భావిస్తోందట. ఈ చిత్రం బాలయ్య తనయురాలు తేజస్వి నిర్మాణ భాగస్వామి కావడంతో ప్రొడక్షన్ విషయంలో రాజీ పడట్లేదని తెలుస్తోంది.