ఈ ఏడాది భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. భారీ అంచనాల మధ్య గత శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ అంత గొప్పగా లేకపోయినా ఈ సినిమాకు రిలీజ్ ముంగిట హైప్ తక్కువగా ఏమీ లేదు.
ఇక రిలీజ్ తర్వాత ట్రైలర్ లాగే సినిమా కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కొరటాల శివ చివరగా తీసిన ‘ఆచార్య’ కంటే చాలా బెటర్ అన్నారే తప్ప.. సినిమా సూపర్ అనే టాక్ ఆడియన్స్ నుంచి వినిపించలేదు. రివ్యూలు కూడా మోడరేట్‌గా ఉన్నాయి.
అయినా సరే.. తొలి రోజు ఈ సినిమా రూ.150 కోట్ల మేర గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం రేపింది. కానీ తర్వాత ‘దేవర’ పడుతూ లేస్తూ సాగింది. శనివారం వసూళ్లు డ్రాప్ అయ్యాయి. కానీ ఆ రోజు కూడా రాత్రి షోలకు స్పందన బాగుంది. ఆదివారం కూడా సినిమా బాగానే పెర్ఫామ్ చేసింది.
మొత్తంగా మూడు రోజుల్లో కలిపి ‘దేవర’ వరల్డ్ వైడ్ రూ.250 కోట్లకు కాస్త ఎక్కువగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. కానీ టీం మాత్రం అధికారికంగా రూ.300 కోట్ల పోస్టర్ దించేసింది. వాస్తవ వసూళ్లు ఆ స్థాయిలో లేవని తెలుస్తోంది. సినిమాకు హైప్ తేవడం కోసం, అభిమానుల కోసం ఇలా కలెక్షన్లు పెంచి చూపించడం అందరూ చేసేదే. అయినా సరే.. వీకెండ్లో ‘దేవర’ రూ.250 కోట్ల మార్కును టచ్ చేయడం అంటే పెద్ద విషయమే. ఇండియా వరకు వసూళ్లు రూ.200 కోట్లకు చేరువగా ఉన్నాయి. నైజాం గ్రాస్ రూ.55 కోట్ల మేర ఉండగా.. ఆంధ్రా, రాయలసీమ కలిపి గ్రాస్ రూ.90 కోట్ల మేర వచ్చినట్లు సమాచారం.
‘దేవర’ హిందీ వెర్షన్ గ్రాస్ రూ.50 కోట్లకు చేరువగా ఉండడం విశేషం. కర్ణాటకలో కూడా సినిమా బాగా ఆడుతోంది. ఐతే వీకెండ్ పూర్తయిన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి. బుధవారం గాంధీ జయంతి సెలవు మాత్రం సినిమాకు బాగానే కలిసి రావచ్చు. రెండో వీకెండ్లో కూడా సినిమా బాగానే ఆడే అవకాశముంది.