నిన్న దేవరతో క్లాష్ అయితే నిలవలేమని గుర్తించి కార్తీ డబ్బింగ్ మూవీ సత్యం సుందరం ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలో విడుదలయ్యింది. శుక్రవారమే మీడియాకు వేసిన ప్రీమియర్ల నుంచి మంచి స్పందన రావడంతో హిట్ అవుతుందనే నమ్మకం మేకర్స్ లో కనిపించింది. దానికి తోడు తమిళ రివ్యూలు, టాక్స్ చాలా పాజిటివ్ గా వచ్చాయి. విజయ్ సేతుపతి, త్రిష కాంబోలో 96 లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఇచ్చిన ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించడం ఒక ఆకర్షణ అయితే కార్తీ, అరవింద్ స్వామిల కలయిక ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. ఊహించినట్టే సత్యం సుందరంకి పాజిటివ్ టాక్ వచ్చింది.
ఒక సింపుల్ కథను అందంగా శిల్పం చెక్కినట్టు ప్రేమ్ కుమార్ మలచిన తీరు ఆకట్టుకునేలా సాగింది. సత్యం అనే వ్యక్తి ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక పెళ్లి కోసం స్వంత ఊరికి వెళ్తే అక్కడ బంధువునని చెప్పి ఒక అపరిచితుడు పరిచయమవుతాడు. ముందు చికాగ్గా మొదలైన వీళ్ళ స్నేహం తర్వాత ఘాడంగా మారుతుంది. ఈ మధ్య జరిగే పరిణామాలు, సరదా సంఘటనల క్రమమే అసలు స్టోరీ. సింపుల్ ఎమోషన్స్ తో మన చుట్టూ జరిగే భావోద్వేగాలను మలచిన తీరు ఒకపక్క నవ్విస్తూనే మరోసారి ఎక్కడో హృదయాలను తాకుతూ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పెయింటింగ్ లాగా.
మూడు గంటల నిడివికి దగ్గరగా ఉండటం వల్ల సత్యం సుందరం కొంత ల్యాగ్ అనిపించే మాట వాస్తవమే అయినా థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఫీల్ గుడ్ ఫీలింగ్ ఇస్తుంది. ముఖ్యంగా కార్తీ వెంటాడుతూనే ఉంటాడు. అరవింద్ స్వామి తక్కువేం కాదు. ఇదంతా బాగానే ఉంది కానీ దేవర సునామిని తట్టుకుని ఈ జంట నిలుస్తుందా అనేదే అసలు ప్రశ్న. ఇలాంటి ఎమోషనల్ డ్రామాలకు జనాన్ని రప్పించాలంటే సోలో రిలీజ్ కీలకం. దేవర దెబ్బకు అసలే షోలు, స్క్రీన్లు సత్యం సుందరంకు తక్కువ దొరికాయి. వీకెండ్ ఊపందుకుంటుందనే నమ్మకం బయ్యర్లలో ఉంది. చూడాలి మరి.
Gulte Telugu Telugu Political and Movie News Updates