కలెక్షన్లతో వీరవిహారం చేస్తున్న దేవర తొలి రోజే నూటా డెబ్భై రెండు కోట్ల గ్రాస్ వసూలు చేయడం దేశవ్యాప్త ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది. విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ ఫాంటసీ సబ్జెక్టు కాని ఒక కమర్షియల్ యాక్షన్ మూవీకి ఈ స్థాయి స్పందన రావడం ఊహించనిది. దానికి తోడు జూనియర్ ఎన్టీఆర్ ని సోలో హీరోగా తెరమీద చూసి ఆరేళ్ళ గ్యాప్ వచ్చిన నేపథ్యంలో అభిమానులు రిపీట్ షోస్ రూపంలో తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. సెకండాఫ్ కంటెంట్ మీద కంప్లయింట్స్, చర్చలు జరుగుతున్నప్పటికీ ఓవరాల్ గా చూడాల్సిన సినిమాగా వచ్చిన తీర్పు సాధారణ ప్రేక్షకులు టికెట్లు కొనేలా చేస్తోంది.
ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి ఒక డిమాండ్ ఉంది. అదే భారీ ఎత్తున ఒక సక్సెస్ మీట్ జరపాలని. ప్రీ రిలీజ్ ఈవెంట్ నోవాటెల్ లో చేసినప్పుడు రద్దీని తట్టుకోలేక రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం వల్ల జూనియర్ ఎన్టీఆర్ బాగా కలత చెందాడు. ఇంత కాలం తర్వాత అభిమానులను నేరుగా కలుసుకునే అవకాశం చేజారిపోవడం పట్ల వీడియో రూపంలో విచారం వ్యక్తం చేశాడు. ఇప్పుడు దీన్ని సంబరంగా మార్చాలంటే సక్సెస్ మీట్ ఒకటే మార్గం. నిర్మాతలతో పాటు దర్శకుడు కొరటాల శివ, డిస్ట్రిబ్యూటర్లు నాగవంశీ, దిల్ రాజు దీని గురించి సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది.
మొదటి ఆప్షన్ హైదరాబాద్. ఓపెన్ గ్రౌండ్ లో చేస్తే తప్ప వర్కౌట్ కాదు. ఇటీవలే కేటీఆర్ దేవర ఈవెంట్ రద్దు కావడం గురించి ప్రస్తావిస్తూ దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ ఖాతాలో వేశారు. దీన్ని తిప్పికొట్టడం కోసమైనా రేవంత్ సర్కారు అనుమతులు ఇవ్వొచ్చనేది ఒక వెర్షన్. నైజామ్ లో భారీ వసూళ్లు వచ్చాయి కనక ఇక్కడ చేయడం సబబనేది కొందరి వెర్షన్. లేదూ ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి సమస్యలు రావు కనక అక్కడ చేయడం రెండో ఛాయస్. దేవర టీమ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ విదేశాల నుంచి తిరిగి వచ్చాక దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవచ్చని టాక్.