రాజమౌళి మళ్లీ మెగా ఫోన్ పట్టాడు

దర్శక ధీరుడు రాజమౌళి సినిమాకు, సినిమాకు మధ్య ఎంత గ్యాప్ తీసుకుంటాడో తెలిసిందే. ఒకప్పుడంటే రెండేళ్లకు ఓ సినిమా అయినా చేసేవాడు కానీ.. ‘బాహుబలి’ తర్వాత ఆయన సినిమాల స్కేల్, తన మీద అంచనాలు భారీగా పెరిగిపోవడంతో ఒక్కో చిత్రం తీయడానికి చాలా టైం పట్టేస్తుంది. ఐదేళ్లకో సినిమా కానీ రావడం లేదు. ‘బాహుబలి-2’ 2017లో రిలీజైతే.. తర్వాతి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక మహేష్ బాబుతో కొత్త సినిమాను మొదలుపెట్టడానికే మూడేళ్ల టైం పట్టేస్తోంది. విడుదలకు ఇంకో రెండేళ్లు అవ్వొచ్చేమో. రాజమౌళి-మహేష్ చిత్రానికి స్క్రిప్టు కొన్ని నెలల ముందే పూర్తి కాగా.. ప్రి ప్రొడక్షన్ పనుల్లో టీం అంతా ఫుల్ బిజీగా ఉంది. ఐతే ఆ పనులు కూడా ఒక కొలిక్కి వచ్చినట్లే తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో చిత్రీకరణ ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు.

ఐతే ఈ లోపే రాజమౌళి షూటింగ్ రిహార్సల్స్ మొదలుపెట్టేశాడు. రామోజీ ఫిలిం సిటీ వేదికగా డమ్మీ ఆర్టిస్టులతో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నాడట జక్కన్న. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచరస్ ఫిలింకి తగ్గట్లు చిన్న సెటప్‌లో సెట్స్ వేసి.. గుర్రాలను పెట్టి ఫిలిం సిటీలో ప్రస్తుతం చిన్న స్థాయి ఆర్టిస్టులను పెట్టి డమ్మీ షూట్ చేస్తున్నాడట జక్కన్న. కొన్ని కీలక సన్నివేశాలను ఇలా డమ్మీగా తీసి.. అసలు సన్నివేశాల మీద పూర్తి అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారట.

ఈసారి రాజమౌళి సినిమాటోగ్రాఫర్‌ను మార్చారు. సెంథిల్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో పీఎస్ వినోద్‌ను తీసుకున్నారు. డమ్మీ షూట్ ద్వారా ఆయనతో సింక్ కూడా చూసుకుంటున్నారు. తన సినిమాలకు పకడ్బందీ స్క్రిప్టు తయారు చేసుకోవడంతో పాటు వర్క్ షాప్స్, డమ్మీ షూట్స్ చేయడం ద్వారా ప్రిపరేషన్ పక్కాగా ఉండేలా చూసుకుంటాడు జక్కన్న. మహేష్ మూవీకి మరింత పకడ్బందీగా ఈ పని చేస్తున్నట్లు తెలుస్తోంది.