మాస్ స్పెల్లింగ్ రాయిస్తున్న దేవర

ఒక స్టార్ సోలో హీరోగా సుదీర్ఘ విరామం తీసుకుంటే ఎలా ఉంటుందో దేవర అడ్వాన్స్ బుకింగ్స్ చూపిస్తోంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటాపోటీగా టికెట్ రేట్ల పెంపు, అదనపు షోలకు అనుమతి ఇవ్వడంతో సెప్టెంబర్ 26 అర్ధరాత్రి నుంచి అరాచకం ఓ రేంజ్ లో ఉండబోతోంది. ఇప్పటిదాకా సుమారుగా 400 పైగా బెనిఫిట్ షోలు అమ్మకానికి పెట్టగా దాదాపుగా అన్నీ సోల్డవుట్ అయ్యాయి. ఇంకా మూడు రోజులు సమయం ఉంది కాబట్టి ఈ కౌంట్ ఎక్కడిదాకా వెళ్తుందో ఊహకందడం లేదు. పట్టుమని పది వేల జనాభా లేని పల్లెటూరిలోని చిన్న థియేటర్లో సైతం షోలు వేయబోతున్నారు.

మొదటిరోజు ఒక్క ఆర్టిసి క్రాస్ రోడ్స్ లోనే కోటి గ్రాస్ దాటొచ్చనే అంచనాలు బలంగా ఉన్నాయి. టికెట్ల కోసం డిమాండ్ మాములుగా లేదు. మల్టీప్లెక్సులు, సింగల్ స్క్రీన్లనే తేడా లేకుండా ఉదయం ఆటలకు పెద్ద స్థాయిలో రికమండేషన్లు వస్తున్నాయి. సాయంత్రం, సెకండ్ షోల బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. ధర సగటు ప్రేక్షకులకు కొంత విపరీతంగా అనిపిస్తుండటంతో టాక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏ మాత్రం పాజిటివ్ గా వచ్చినా ఏ షోకి టికెట్ ముక్క మిగలదనేది ఖాయం. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, గుంటూరు లాంటి నగరాల్లో టికెట్ల ఒత్తిడి ఓ రేంజ్ లో ఉంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో తీవ్రంగా నిరాశ చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆ కొరతని దేవరను పలుమార్లు చూడటం ద్వారా తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. కల్కి 2898 ఏడి తర్వాత రోజుల తరబడి థియేటర్లకు కళకళలాడించిన సినిమా ఏదీ లేదు. ఆయ్, కమిటీ కుర్రోళ్ళు లాంటి కొన్ని మినహాయించి అధిక శాతం కనీసం అద్దెలు సైతం గిట్టుబాటు చేయించలేదు. ఇప్పుడు దేవర కనక హిట్ అయితే దసరాకు మళ్ళీ కొత్త రిలీజు వచ్చేదాకా ఢోకా ఉండదని ట్రేడ్ అంచనా వేస్తోంది. బాక్సాఫీస్ ఫిగర్స్ షాకింగ్ గా ఉండబోతున్నాయి. హిందీలోనూ తారక్ ప్రభావం గట్టిగా ఉంటుందని అంటున్నారు.