ప్రస్తుతం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం అంటే.. ‘దేవర’నే. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కొరటాల శివ రూపొందించాడు. కొరటాల చివరి చిత్రం ‘ఆచార్య’ పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ.. ఆ ప్రభావం ‘దేవర’ మీద ఉండదనే భావిస్తున్నారు. ముందు నుంచి టీం అంతా కూడా ఈ సినిమా మీద చాలా ధీమాగానే ఉంది. కాకపోతే ఇటీవల రిలీజైన ట్రైలర్ విషయంలో మాత్రం కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ రిలీజ్ ముంగిట హైప్ అయితే తక్కువగా లేదు.
ఐతే తాము అద్భుతమైన సినిమాను అందిస్తున్నామనే ధీమా ఉన్నప్పటికీ.. రిలీజ్ ముంగిట టెన్షన్‌గానే ఉందని ‘దేవర’ ప్రమోషన్లలో భాగంగా జరిపిన ఓ చిట్ చాట్ కార్యక్రమంలో తారక్ చెప్పాడు. “సినిమాపై మేం చాలా నమ్మకంగా ఉన్నాం. టీం అంతా చాలా కష్టపడి పని చేశాం. ఔట్ పుట్ అద్భుతంగా వచ్చింది. అయినా సరే.. రిలీజ్ దగ్గర పడుతుంటే టెన్షన్‌గా ఉంది” అని తారక్ అన్నాడు.
ఇక ‘దేవర’ మ్యూజిక్ విషయం కొంచెం మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ తారక్ మాత్రం అనిరుధ్ మీద ప్రశంసల జల్లు కురిపించాడు. అతను ఏఆర్ రెహమాన్ స్థాయికి చేరుకుంటాడని అన్నాడు. “ప్రస్తుతం అనిరుధ్ శకం నడుస్తోంది. కొంతమంది సక్సెస్ సాధించాక కొంత ఉదాసీనంగా ఉండి ఫెయిలవుతుంటారు. కానీ అనిరుధ్ అలా కాదు. ఒక సినిమాకు ఎలాంటి సంగీతం అవసరమో అతడికి బాగా తెలుసు. జైలర్, విక్రమ్, మాస్టర్ సినిమాల మ్యూజిక్ మెస్మరైజ్ చేసింది. దేవరకు కూడా అద్భుతమైన సంగీతం అందించాడు. అతను రెహమాన్ స్థాయికి వెళ్తాడని నమ్మకంగా చెబుతున్నా” అని ఎన్టీఆర్ అన్నాడు.
‘దేవర’కు ముందు హీరోయిన్‌గా జాన్విని అనుకోలేదని.. కరణ్ జోహారే ఆమె పేరును సూచించాడని.. ఆయన చెప్పాక కూడా తన పేరును ఖరారు చేయడానికి చాలా టైం తీసుకున్నామని.. ఆమె ఈ చిత్రంలో చాలా బాగా నటించిందని తారక్ తెలిపాడు.