మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర జనవరి 10 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకుంది. షూటింగ్ ప్రారంభ సమయంలోనే సంక్రాంతికి వస్తున్నామని స్పష్టంగా చెప్పేసింది. ఆ తర్వాత లిస్టులో వెంకటేష్ – అనిల్ రావిపూడి, బాలయ్య 109, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ / విదముయార్చి తోడయ్యాయి. కథ ఇక్కడితో అయిపోలేదు. మీడియం బడ్జెట్ లో రూపొందుతున్న సందీప్ కిషన్ – త్రినాధరావు నక్కిన కాంబో మూవీ సైతం ఇదే పండక్కు టార్గెట్ చేసుకుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇన్నేసి సినిమాలకు థియేటర్ల సర్దుబాటు పెద్ద సవాలే.
నిజానికి ఎవరికి వారు సంక్రాంతి మీద కన్నేయడానికి కారణాలు లేకపోలేదు. చాలా మందిలో విశ్వంభర వాయిదా పడొచ్చనే అనుమానాలున్నాయి. భారీ సిజి వర్క్ తో పాటు గేమ్ ఛేంజర్ కు దీనికి కేవలం ఇరవై రోజుల గ్యాప్ మాత్రమే ఉండటం వల్ల పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందంటూ ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ అదేమీ లేదట. దీనికి క్లారిటీ ఇవ్వడం కోసమే వశిష్ట తన ఎక్స్ అకౌంట్ ద్వారా విశ్వంభర విజృంభణం అంటూ ట్వీట్ చేసి జనవరి 10 డేట్ ని మరోసారి నొక్కి చెప్పాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో విశ్వంభర వెనక్కు తగ్గడం ఉండదనే సంకేతం స్పష్టంగా ఇచ్చినట్టే.
పైన చెప్పుకున్న లిస్టులో దాదాపు అన్ని ఖరారైనవే. ఏదీ వెనక్కు తగ్గే సూచనలు లేవు. డిస్ట్రిబ్యూటర్లకు ఆ మేరకు స్పష్టమైన సమాచారం ఉంది. ఆఖరి నిమిషంలో ఏవైనా అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప అన్నీ వచ్చేస్తాయి. ఇక విశ్వంభరకు బ్యాలన్స్ ఉన్న షూటింగ్ తక్కువే. ఒక పాట, కొంత టాకీ పార్ట్ మినహాయించి వసిష్ఠ మొత్తం పూర్తి చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు విఎఫెక్స్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. విజువల్ గ్రాండియర్ గా రూపొందుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో త్రిష హీరోయిన్ కాగా ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.